కాంగ్రెస్ తప్పిదాలకు రాహుల్ రాజకీయ భవిష్యత్ బలి

 

 

కాంగ్రెస్ పార్టీ మిజోరంలో గెలిచినందుకు సంతోషపడాలో లేక నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయినందుకు ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందిప్పుడు. అలాగని మిజోరాంలోనయినా  సంతోషించదగ్గ గొప్ప విజయమేమీ కాదు. క్రిందటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు వస్తే, ఈ సారి కేవలం 22మాత్రమే వచ్చాయి. అక్కడ ఎటువంటి బలమయిన ప్రతిపక్షమూ, పోటీ గానీ లేకపోయినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలవడం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా నూకలు చెల్లిపోతున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః రానున్న సాధారణ ఎన్నికలలో ఆ సంగతి స్పష్టమయిపోవచ్చును.

 

ఈసారి మిజోరం ఎన్నికలలో కాంగ్రెస్ చిహ్నంతోనో లేకపోతే సోనియా, రాహుల్ పేరు చెప్పుకోనో గెలవలేదు. వరుసగా తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్న ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా వ్యక్తిగత ప్రభావము, పేరు ప్రతిష్టలతోనే ఈసారి కాంగ్రెస్ పార్టీ మిజోరంలో గెలవగలిగింది, లేకుంటే అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోయేదే.

 

ఇక ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పరిస్థితి చూస్తే దేశంలో దాదాపు అన్ని ముఖ్యమయిన రాష్ట్రాలలో ఓడిపోతూ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్ కుచించుకు పోయినట్లు అర్ధం అవుతోంది. దక్షిణాదిన రెండు దశాబ్దాల తరువాత బీజేపీ తప్పిదం వలన కర్ణాటకలో మళ్ళీ అధికారం దక్కించుకొన్నపటికీ, అంతకంటే విలువయిన, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన కారణంగా పోగొట్టుకోబోతోందని ఇప్పటికే దాదాపు స్పష్టమవుతోంది. ఏవిధంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి ఇక గడ్డు కాలం మొదలయినట్లే కనిపిస్తోంది.

 

అయితే సరిగ్గా రాహుల్ గాంధీ ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలనుకొనే సమయంలో దేశమంతటా ఈవిధంగా ఎదురుగాలులు వీయడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సోనియాగాంధీకి చాలా ఆందోళన కలిగించే విషయమే. అయితే అందుకు ఎవరినో నినదించనవసరం లేదు. అంతా స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్ తప్పిదాలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్ధకంగా మార్చివేయడమే దురదృష్టకరం.