కాంగీయుల కొత్త డ్రామా!

 

 

 

రాష్ట్ర విభజనను ఆపేస్తాం అని స్టేట్‌మెంట్లు ఇచ్చి సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టిన సీమాంధ్ర ఎంపీలు పరిస్థితిని విజయవంతంగా రాష్ట్ర విభజన ముంగిలి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త డ్రామాకి తెరతీశారు. ఆ కొత్త డ్రామా పేరు ‘అవిశ్వాస తీర్మానం’. తమ సొంత పార్టీ మీదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రం విడిపోకుండా చూస్తామన్నది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల వాదన. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి వీలుగా సీమాంధ్ర ఎంపీలు గతంలో స్పీకర్‌కి అందజేసిన తమ రాజీనామా లేఖల్ని ఎంచక్కా వెనక్కి తీసుకున్నారు.


లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం, నెగ్గడం సంగతి దేవుడెరుగు గానీ, తాము గతంలో చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకునే అవకాశం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు దక్కిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రం ఎలాగూ విడిపోబోతోంది. అలాంటప్పుడు స్పీకర్ దగ్గర తమ రాజీనామాలు ఎందుకనుకున్నారో ఏమోగానీ, కొత్త పథకం వేసి రాజీనామా లేఖలు వెనక్కి తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సొంత తెలివి కాదని, దీని వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం బుర్ర కూడా వుండే వుంటుందని అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ మీదే అవిశ్వాసం పెట్టి సీమాంధ్రుల దృష్టిలో త్యాగధనుల ఇమేజ్ సంపాదించుకునే వ్యూహం కూడా ఇందులో వుండొచ్చంటున్నారు.




యుపిఎ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ డిస్మిస్ చేసినట్టయితే వారికి సీమాంధ్రలో హీరో ఇమేజ్ వచ్చే అవకాశం వుంది.  రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద ఎలాగూ గెలిచే అవకాశం లేదు. అధిష్ఠానాన్నే ఎదిరించి పదవులను త్యాగం చేసిన ఇమేజ్‌తో ఇండిపెండెంట్లుగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ సన్నిధానానికి చేరే వ్యూహం కావచ్చని కూడా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని త్యాగాల బిల్డప్పులు ఇచ్చినా సీమాంధ్రలో ఇప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలు ఏరకంగానూ గెలిచే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.