దేవుడి మొక్కులపైనా విమర్శిస్తున్నారు-కేసీఆర్

ఉద్యమ సమయంలో దేవుళ్లుకు మొక్కుకున్న మొక్కులను తీరుస్తుంటే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ మహబూబాబాద్ జిల్లా కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు సీఎం. అనంతరం ఆయన మాట్లాడుతూ..శివుడికి ప్రీతికరమైన శివరాత్రి నాడు మొక్కు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేవుడికి చెల్లించే మొక్కులపైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా ఏమీ చేయలేదని..తాము అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే అడ్డుపడుతున్నారని..వారి తీరును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామన్నారు. కురవి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లాలో రెండు పంటలు పండే విధంగా చేసి ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా సస్యశ్యామలం చేస్తానన్నారు.