తప్పించుకున్న సింహాన్ని చంపేశారు

 


జూలో వున్న సింహం బోనులో వున్నంతవరకే గౌరవం. బోను నుంచి తప్పించుకుంటే దానిమీద ఎవరికీ గౌరవం వుండదు. చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తైయాన్ టైగర్స్ పార్క్‌లో ఆదివారం నాడు సింహాల ఎన్‌క్లోజర్ని క్లీన్ చేయడానికి వెళ్ళిన జూ సిబ్బంది ఒకరి మీద ఒక సింహం దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఎన్‌క్లోజర్లోంచి తప్పించుకుని బయటకి వచ్చింది. దాంతో జూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. జూలో వున్న అందర్నీ బయటకి పంపేసి సింహాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. గంటసేపు ప్రయత్నించినా ఆ సింహం అదుపులోకి రాలేదు. దాంతో దాన్ని కాల్చి చంపేశారు. సింహాన్ని చంపి చాలా మంచి పనిచేశారని చాలామంది అంటుంటే, కొంతమంది జంతు ప్రేమికులు మాత్రం ఇది దారుణమని విమర్శిస్తున్నారు.