బీజేపీలోకి టీడీపీ ఎంపీలు... స్పందించిన చంద్రబాబు!!

 

రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలవడంతో బీజేపీలో వారి చేరిక ఖరారైంది. ఈ పరిణామంపై విదేశీ పర్యటనలో ఉన్న ఆ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలను ఫోన్ లో తెలిపారు. రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకోవాలన్న ఆ పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో తాము బీజేపీపై పోరాటం చేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు.

ఈ మేరకు ఫోన్ కాల్ ద్వారా టీడీపీ సీనియర్ నేతలతో మాట్లాడిన చంద్రబాబు టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, నేతలు కార్యకర్తలు అధైర్య పడొద్దని సూచించారు. నేతలు పార్టీని వీడటం ప్రత్యర్థులు సంక్షోభం సృష్టించడం టీడీపీకి కొత్తకాదని సీనియర్లకు అధినేత చెప్పినట్లు సమాచారం. స్వార్థ రాజకీయం కోసం నేతలు పార్టీ మారితే టీడీపీకి వచ్చే నష్టం ఏమీ లేదని ఫోన్‌లో చంద్రబాబు తేల్చిచెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం టీడీపీ పోరు కొనసాగిస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు నిశితంగా వివరించినట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీతో ఇంకా ఎవరెవరు ఎంపీలు టచ్ లో ఉన్నారు, కాకినాడలో టీడీపీ కాపు నేతల భేటీ వంటి అంశాలపైనా చంద్రబాబు సీనియర్ నేతలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సదరు నేతలతో వెంటనే మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం టీడీపీ నేతలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు, సమస్య పరిష్కారం అవుతుందని కళా వెంకట్రావు మీడియాకు వివరించారు.