రూపాయి డాక్టర్ ఇకలేరు

గుండెపోటుతో మరణించిన డాక్టర్ జిజియా

 

నామమాత్రపు ఫీజుతో లక్షలాది మందికి వైద్యసేవలు అందించిన డాక్టర్ జిజియా గుండెపోటుతో మరణించారు. ఆరు దశాబ్దాలుగా పాలకొల్లులో వైద్యసేవలందించిన ఆమె ఒక రూపాయి డాక్టర్ గా ఎంతో పేరు పొందారు. కొద్దిరోజుల క్రితం వరకు ఆమె ఫీజు ఒక్కరూపాయి నే. ఇటీవలే పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఫీజు ఐదురూపాయలు చేశారు. లాక్ డౌన్ సమయంలో సైతం వైద్యసేవలు అందించిన ఆమె కొన్నిరోజుల కిందట హైదరాబాద్ వచ్చారు. నిన్న(ఆగస్టు 11, మంగళవారం)గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.

 

డా. చలసాని జిజియా గారి నాన్నగారు విశాఖపట్నంలో 1940లలో స్థిరపడ్డారు. ఆమె అన్నయ్య డా. శిరిపురపు మల్లిఖార్జున రావు  తూర్పుగోదావరి జిల్లా DMHOగా కూడా పనిచేశారు. జిజియా గారు మద్రాస్ లో  వైద్య విద్య ను అభ్యసించారు. కృష్ణా డెల్టాలో ఆమె మొదటి మహిళా వైద్యురాలు. ప్రముఖ వైద్యులు డా. సౌభాగ్యాలక్ష్మి, మంగపతిరావు, విజయావాడ మాజీ మేయర్ డా. జంధ్యాల శంకర్, హృద్యోగ నిపుణులు కీశే. డా. వెంకయ్య చౌదరి గారు జిజియాగారికి సహాధ్యాయులే.

 

డాక్టర్ జిజియా బహుముఖ ప్రజ్ఞాశాలి.  వైద్యసేవ ఆమె వృత్తి అయితే సంగీత, సాహిత్య, చిత్రలేఖనం ఆమె ప్రవృత్తి.  వైద్య సేవలు అందించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటే ఆమె ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా చిత్రాలు వేసేవారు, రచనలు చేసేవారు. నాటి గృహాలక్ష్మి నుంచి అనేక పత్రికలలో వారి కవితలు, రచనలు ప్రచురించబడ్డాయి. కవయిత్రి, రచయిత్రిగా ఎంతో పేరు సంపాదించారు. అంతేకాదు సంగీతం లో ప్రావీణ్యురాలు. వారి కుమారుడు తెలుగుజాతి ఉద్యమకారుడు, రచయిత చలసాని శ్రీనివాస్. తెలుగురాష్ట్రాల్లో అందరికి సుపరిచితులే. రెండో కుమారుడు ఇండియన్ అర్ధో డెంటిస్ట్స్  సొసైటీ అధ్యక్షులు.

 

ఆమె మరణం వైద్యరంగానికే కాదు సాహిత్యలోకానికి తీరని లోటని పలువురు సంతాపం ప్రకటించారు.