ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం..!!

 

రాజకీయ నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో తెలియని పరిస్థితి.ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే పార్టీ మారే వారు కొందరు,టికెట్ రాలేదని అసంతృప్తితో పార్టీ మారేవారు కొందరు,ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీ కి జంప్ అయ్యే వారు కొందరు.ఎలా అయితేనేం తమకు అనుకూలంగా ఉన్న స్థానం కోసం పార్టీలు మారుతూనే ఉంటారు.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం త్రిముఖ పోరు నడుస్తున్నదనే చెప్పుకోవాలి.నిన్న మొన్నటి వరకు టీడీపీ, వైసీపీ మధ్య నాయకుల మార్పులు జరిగాయి.కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూకుడు పెంచటంతో ఈ రెండు పార్టీల్లో టికెట్ రాదు అని భావించిన కొందరు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే పలువురు నేతలు ఈ పార్టీల నుంచి జనసేనలో చేరగా తాజాగా వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ జనసేనలో చేరనున్నట్లు సమాచారం.

గతంలో సునీల్ కాకినాడ పార్లమెంట్ స్థానానికి  వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.కొంత కాలంగా సునీల్ టీడీపీ లో చేరతారంటూ వార్తలు వచ్చాయి.ఒకవేళ సునీల్ టీడీపీ లో చేరితే కాకినాడ పార్లమెంట్ స్థానం కేటాయించాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.అయితే కొన్ని రోజుల క్రితం జనసేన అధినేతని కలిసిన ఫోటోలు వైరల్ అవ్వటంతో సునీల్ ఆ పార్టీలో చేరుతున్నట్టు భావించారు.కానీ సునీల్‌ కాకినాడ పార్లమెంటు టిక్కెట్టుతో పాటు తన బంధువు ఒకరికి జగ్గంపేట జనసేన టిక్కెట్టు ఇవ్వాలని షరతు పెట్టినట్టు తెలుస్తోంది.సునీల్‌ షరతుపై జనసేన నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో సునీల్‌ టీడీపీలో చేరకపోతే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి రాజప్ప పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా జిల్లాలో పార్టీ కేడర్‌ని కలుపుకునిపోవడంలో చంద్రబాబు మన్ననలు పొందారు. రాజప్ప అయితే కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలుపొందడం సునాయాసం అవుతున్నది పార్టీ అధిష్ఠానం యోచనగా కనిపిస్తోంది. స్థానికేతరుడైన రాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి 2014లో పోటీచేసి హోంమంత్రి అయ్యారు. ఈ దఫా పెద్దాపురం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండు వస్తోంది.రాజప్ప కూడా దీనిని సమర్థిస్తున్నారు. ’నేను ఎంపీగా వెళ్తే... పార్టీ మారకుండా ముందు నుంచీ నమ్మకంగా ఉన్నవారికే టిక్కెట్టు ఇప్పిస్తాను’ అని ఇప్పటికే రాజప్ప కొందరికి భరోసా కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.