7ఏళ్ల పాప గూగుల్లో జాబ్ కావాలంది! మరి సుందర్ పిచై ఏమన్నాడు?

 

గూగుల్ కంపెనీలో జాబ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం వుండదు చెప్పండి? ఎవ్వరైనా ఎగిరి గంతేస్తారు! కాని, ఆ అమ్మాయి తనకి గూగుల్ లో పని చేయాలని వుందంటూ ఉత్తరం రాసింది. దానికి ఏకంగా గూగుల్ సీఈవో, మన సుందర్ పిచై స్పందించాడు! ఆయన జాబ్ కావాలన్న ఆ అమ్మాయితో ఏమన్నాడో తరువాత తెలుసుకందాం కాని... అసలు ఉద్యోగం అడిగిన ఆ గడుసరి ఎవరో తెలుసా? క్లోయ్ బ్రిడ్జ్ వాటర్ అనే ఏడేళ్ల బ్రిటీష్ గడుగ్గాయ్! ఆ వయస్సులోనే తనకు గూగుల్ లో ఎంప్లాయిగా చేరాలని వుందంటూ కోరిక బయటపెట్టింది. అందుకు, తన స్వహస్తాలతో లేఖ రాసిన గూగుల్ సీఈవో సుందర్ ఎంతో సుందరంగా స్పందించాడు!

 

 

 

క్లోయ్ బ్రిడ్జ్ స్టోన్ ఏడేళ్ల పాప. బ్రిటన్ లోని హెర్ ఫోర్ట్ నగరంలో వుంటోంది. అయితే, తనకు తండ్రి కొనిచ్చిన ట్యాబ్లెట్ చూసి తెగ మురిసిపోయింది. దాంట్లో కనిపించిన స్లైడ్స్ క్లోయ్ కి భలే నచ్చేశాయి. వాటన్నిటికీ మూలం గూగుల్ అని తెలుసుకున్న క్లోయ్ తన స్వదస్తూరీతో ఒక లెటర్ రాసింది. డియర్ గూగుల్ బాస్... అంటూ సుందర్ పిచైను సంబోధించిన ఆ పాప తరువాత తన ఇష్టాలు, కోరికలు అన్నీ చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడూ స్విమ్మింగ్ చేసే తాను భవిష్యత్ లో ఒలంపిక్స్ కి వెళ్లి సత్తా చాటుతానని చెప్పింది. అలాగే, గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేయటం తన లక్ష్యమని క్లోయ్ ప్రకటించింది.

 

ఏడేళ్ల పాపకి గూగుల్ గురించి ఎలా తెలిసింది అనే డౌట్ రావటం సహజమే. గూగుల్ కార్పోరేట్ ఆఫీస్ ఇమేజెస్ చూసి ముచ్చటపడిన ఆ అమ్మాయికి తండ్రి ఓ సారి గూగుల్ లో పని చేయటం బావుంటుందని చెప్పాడట. అప్పట్నుంచీ అక్కడ ఉద్యోగం చేయాలని కలలు కంటోంది. ఆ చిన్నారిని ఎంకరేజ్ చేయటానికి తండ్రి యాండీ బ్రిడ్జ్ స్టోన్ ఓ గూగుల్ సీఈవోకి ఓ లెటర్ రాయమన్నాడు. వెంటనే తనకు వచ్చిన భాషలో, భావంతో లెటర్ రాసేసింది క్లోయ్ బ్రిడ్జ్ స్టోన్. దాన్ని అందుకున్న సుందర్ పిచై లైట్ గా తీసుకోక తన బిజీ షెడ్యూల్ లో కాస్త సమయం వెచ్చింది రిప్లై రాశాడు. స్వయంగా ఆయన సైన్ చేసిన లేఖలో బాగా చదువుకుని గూగుల్ కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేస్తే తప్పక జాబ్ ఇస్తామని చెప్పాడు! అంతే కాదు, క్లోయ్ కోరుకున్నట్టు ఒలంపిక్స్ కి వెళ్లాలని ఆకాంక్షించాడు!

 

 

సుందర్ పిచై సైన్ చేసిన లెటర్ రావటంతో అటు కూతురు, ఇటు తండ్రి ఇద్దరూ ఉబ్బితబ్బిబైపోయారు! నెట్లో కూడా ఆ చిన్నారి రాసిన లేఖ, సుందర్ పిచై రాసిన లెటర్ రెండూ వైరల్ అయ్యాయి!