Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అప్పుడే తలైవాని ముఖ్యమంత్రిని చేసేస్తోన్న తమిళ జనం!
posted on: Feb 18, 2017 11:20AM

జయలలితని తమిళనాడు జనం గర్వంగా ఏమని పిలిచే వారో తెలుసుగా... పురుచ్చి తలైవీ! తలైవీ అంటే నాయకురాలు అని అర్థం! మరి జయ తలైవీ అయితే ... తలైవా ఎవరో తెలుసుగా... రజినీకాంత్! ఆయనని ఇంత కాలం కోలీవుడ్ తలైవాగా భావించే వారు ఫ్యాన్స్! అంటే , తమిళ సినిమా ప్రపంచానికి మకుటం లేని మహారాజు అని వాళ్ల ఫీలింగ్! కాని, తాజాగా తలైవీ జయలలిత నిష్క్రమణతో తమిళనాడు అల్లకల్లోలం అయిపోయింది. పన్నీర్, శశికళ, పళని అంటూ రోజుకో పేరు హల్ చల్ చేస్తోంది చెన్నై రాజకీయాల్లో. మరి ఈ అనిశ్చితికి పరిష్కారం ఏంటి?
ఒకవైపు అసెంబ్లీలో పళని స్వామి మెజార్టీ ఎమ్మెల్యేలు తన వెంట వున్నారని చెబుతున్నాడు. మరో వైపు పన్నీర్ తనకూ మద్దతుందని గొంతు చించుకుంటున్నాడు. డీఎంకే సారథి స్టాలిన్ అయితే మధ్యంతరం వచ్చేస్తే బావుండునని కాచుకుని కూర్చున్నాడు. ఇన్నిటి మధ్యా తమిళ ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది తలైవా పైనేనట! కేవలం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకోవటమే కాదు పోస్టర్లు ప్రింట్ చేసి గోడల మీదకి ఎక్కించేస్తున్నారు. తళతళ మెరిసే ఖద్దరు పంచె, షర్టుతో తలైవా ముఖ్యమంత్రిగా నడుస్తోంటే ఆయన వెనుక జెడ్ ప్లస్ సెక్యురిటీ ఫాలో అవుతున్నట్టు పోస్టర్లు వేశారు! నెక్ట్స్ సీఎం రజినీకాంతేనని కూడా వాటిపై రాశారు!
అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో పళని స్వామి గెలవటం పెద్ద కష్టమేం కాదు. కాని, కర్ణాటక జైలు నుంచి తమిళనాడును ఏలటం చాలా మంది తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి శశిలాగే జయ జైలుకి వెళ్లి వుంటే ప్రజాగ్రహం తీవ్రంగా వుండేది. ఎన్ని బస్సుల అద్దాలు పగిలేవో ఎవరమైనా ఊహించవచ్చు. కాని, చిన్నమ్మ జైలుకి వెళితే జనం ఏ మాత్రం ఆగ్రహానికి లోను కాలేదు. అంటే, ఒక విధంగా ఆమెను జయలలిత అభిమానులు కూడా ఇష్టపడుతున్నట్టు కనిపించటం లేదు. కాబట్టి శశికళ ఆశీర్వాదంతో పరిపాలించనున్న పళని స్వామిది మూణ్ణాళ్ల ముచ్చటే అంటున్నారు కొందరు విశ్లేషకులు. అదే జరిగి మధ్యంతరం అనివార్యం అయితే బీజేపి బలంతో తలైవా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే అవినీతి మరకలు పడ్డ డీఎంకే పైన కూడా తమిళులకి పూర్తి నమ్మకం లేదు కాబట్టి!
ఇంతకీ జనం కోరుకుంటున్న విధంగా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా? ఒక సారి జయ తాలూకూ రోబోగా పన్నీర్, మరోసారి శశికళ తాలూకూ రోబోగా పళని... ఈ రోబోల పాలనకి వెండి తెర రోబో ముగింపు పలుకుతాడా? ఇవీ కాలమే సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు! కాని, నిజంగా సీఎం అవ్వదలుచుకుంటే.. అంతటి సత్తా వున్న గ్లామర్ గాడ్ మాత్రం రజినీయే! ఇక ముందు ముందు ఇండియాలో సినిమా స్టార్స్ కు సీఎంలు అయ్యే ఛాన్స్ లు కష్టమే! అలాంటి ఫాలోయింగ్ వున్న సూపర్ స్టార్స్ ఈ తరంలో ఏ సినిమా రంగంలోనూ వచ్చిన దాఖలాలు లేవు...






