విజయసాయి వెన్నులో వణుకు మొదలయ్యింది.. అందుకే న్యాయవ్యవస్థ పై దాడి

రాజ్యసభలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరోనా పోరులో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల ఎండగట్టారు. అయితే ఆ తర్వాత మాట్లాడిన విజయసాయి.. కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడకుండా ఇతర విషయాలు ప్రస్తావిస్తూ.. కోర్టులని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాయని, తమ ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

ఈ క్రమంలో సబ్జెక్ట్ దాటి మాట్లాడుతున్నారంటూ.. విజయసాయిని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా విజయసాయి ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతూ పోయారు. ఈ సందర్భంగా కనకమేడల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా గురించి మాట్లాడకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి పార్లమెంటులో మాట్లాడటం దారుణమని, కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని కనకమేడల విమర్శించారు.

 

రాజ్యసభలో కోర్టులపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలోపే ఆర్థిక అవినీతి కేసుల విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీం కోర్టు నిర్ణయించడంతో విజయసాయి వెన్నులో వణుకు మొదలయ్యింది. అందుకే న్యాయవ్యవస్థ పై దాడి చేస్తున్నారు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. 

 

కాగా, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే విజయసాయి వెన్నులో వణుకు మొదలయ్యిందని బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.

 

"11 ఛార్జ్ షీట్లు,లక్ష కోట్ల దోపిడీ, సూట్ కేసు కంపెనీల సూత్రదారి, క్విడ్ ప్రో కో పిత, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన విజయసాయి రెడ్డి, వైఎస్ జగన్ లు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడటం వింతగా ఉంది." అంటూ ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న విమర్శించారు.