ఆర్టీసీ సమ్మెను అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్న బీజేపీ!
posted on Nov 23, 2019 11:28AM
తెలంగాణలో ఇన్ని రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగినా ప్రభుత్వం ఆశించిన రీతిలో స్పందించలేదు. హై కోర్టు సైతం కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. దీంతో కార్మికులు సమ్మె విరమించక తప్పని స్థితి ఏర్పడింది. నిజానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు సహా సుమారు 50వేల మంది కార్మికులు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బిజెపి కేంద్ర పెద్దలు తమ సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని కార్మికుల్లో అత్యధికులు విశ్వశించారు. ఏదో ఒక సందర్భంలో కేంద్రం చొరవ తీసుకుంటుందని భావించారు. సమ్మెకు అర్థవంతమైన ముగింపు పలికేందుకు దోహద పడుతుందని చివరి క్షణం వరకూ వారు నిరీక్షించారు.
బిజెపి రాష్ట్ర నేతల మాటలు కూడా ఆర్టీసీ కార్మికులలో ధైర్యం నింపిన మాట నిజం. ఆర్టీసీ సమ్మె విషయాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక పంపుతున్నామని బిజెపి ముఖ్యనేతలు అడపాదడప ప్రకటన చేయడం గమనార్హం. ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉందని కేంద్రం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయలేదన్న ప్రచారం సైతం కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేయడానికి దోహదపడ్డాయి. నిజానికి ఆర్టీసీ కార్మికులు ఉద్యమానికి మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టటానికి త్రిసభ్య కమిటీని కమలం పార్టీ నియమించింది. మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డిలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చారు. త్రిసభ్య కమిటీ వేయడంతో ఆర్టీసీ కార్మికులు ఆశలు మరింత చిగురించాయి. ఈ కమిటీ సభ్యులు తమ సమ్మెకు మద్దతుగా ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవని మాట ఇపుడు ఆర్టీసీ కార్మిక వర్గాల్లో వినిపిస్తుంది. తమ మనోధైర్యం సన్నగిల్లిన ప్రతిసారి ఆర్టీసీ కార్మికులు మాత్రం కేంద్రంలో అధికారం ఉన్న బిజెపిని తలచుకుని ముందుకెళ్తారు. సరైన సమయంలో ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందిస్తుంది. సమ్మె తీవ్రతను అమిత్ షాకు వివరిస్తున్నామని రాష్ట్ర బిజెపి పెద్దల మాటలు పై పూర్తి విశ్వాసం ఉంచడం వల్లనే ఆర్టీసీ కార్మికులు 47 రోజుల పాటు సమ్యను కొనసాగించగలిగారు అన్నది పరిశీలకుల అభిప్రాయం.
ఇదిలా వుంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె ద్వారా కార్మిక వర్గాల్లో బలం పెంచుకోవాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. కార్మికుల సమ్మెకు పరిష్కార మార్గం చూపితే 50 వేల మంది కుటుంబాలకు దగ్గరకావచ్చని కూడా కమలనాథులు అంచనా వేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించిన బలమైన ఆర్టీసి జెఎసి నాయకులు సైతం కాషాయ కండువా కప్పుకుంటారని వారు అంచనా వేస్తున్నారని తెలుస్తోంది.