బీజేపీ వల్లే వైసీపీకి 151 సీట్లు వచ్చాయా?... విష్ణు, కన్నా వ్యాఖ్యల మర్మమేంటి?

 

ఉచిత కరెంట్, రైతుల రుణాల మాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, 108... ఇలా అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు అందుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి 2009లో వచ్చిన సీట్లు 156... ఈ సంఖ్య సాధారణ మెజారిటీకి కేవలం ఆరంటే ఆరు సీట్లే ఎక్కువ. అవినీతి ఆరోపణలను పక్కనబెడితే... ఏదోఒక పథకంతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చిన వైఎస్ కు ఆనాడు ప్రజలు కేవలం పాస్ మార్కులు మాత్రమే వేశారు. ఈ మాట స్వయంగా వైఎస్సే ఒప్పుకున్నారు. అయితే, రాజన్న పాలనను తిరిగి తెస్తానంటూ, ప్రజల్లోకి వచ్చిన వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలచ్చిన సీట్లు 151... ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వైఎస్ ఆనాడు 294 స్థానాలకు 156 సీట్లు గెలిస్తే... ఇప్పుడు 175 స్థానాల్లో ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకున్నాడు. ఇది అసాధారణ విజయం. పైగా 100కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు 25వేలకు మెజారిటీ వచ్చింది. ఇది మరో సంచలనం. దాంతో ఆనాడు వైఎస్ కే సాధ్యంకాని విజయం... జగన్ ఎలా దక్కిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక విపక్షాలు అయితే, ఇదంతా ఈవీఎమ్ లా మాయాజాలం అంటూ ఆరోపించాయి. బీజేపీ సహకరించిందనే మాటలూ వినిపించాయి. అయితే, ఇందులో నిజముందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. 

బీజేపీ సపోర్టుతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారనే సంగతి గుర్తుపెట్టుకోవాలంటూ విష్ణుకుమార్ రాజు అన్నారు. మామూలుగా అయితే, వైసీపీకి 44 సీట్లు కూడా రావన్న విష్ణుకుమార్ రాజు.... అలాంటిది 151 సీట్లు వచ్చాయంటే అది బీజేపీ వల్లేనన్నారు. ఇక ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా, తమతో ఎన్నో చేయించుకున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. మొత్తానికి విష్ణుకుమార్ రాజు, కన్నా చేసిన వ్యాఖ్యలు... కొన్ని రూమర్లకు ఊతమిచ్చేలా ఉన్నాయి. మరి జగన్ కు బీజేపీ చేసిన సాయమేంటో... 151 సీట్లు ఎలా వచ్చాయో వాళ్లే చెప్పాలి.