టీఆర్ఎస్ కు ఓటేయమంటున్న బీజేపీ.!!

 

తెలంగాణలో డిసెంబర్ 7 న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బరిలో ఎన్ని పార్టీలు ఉన్నా.. అధికారం కోసం టీఆర్ఎస్, మహాకూటమి మధ్యే అసలు పోరు అనేది వాస్తవం. అసెంబ్లీరద్దుకి ముందు వరకు తెలంగాణ ఎన్నికల ఫలితం ఏకపక్షమే అనుకున్నారంతా. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్.. టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిందో.. అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అధికారం కోసం టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగుతుంది. కొన్ని సర్వేలు కూటమిదే అధికారమని కూడా చెప్తున్నాయి. దీంతో బీజేపీ ఆలోచనలో పడింది.

తెలంగాణలో బీజేపీ అంతబలంగా లేకపోయినా ఒంటరిగా బరిలోకి దిగుతుంది. గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ అదంతా పైకి మాత్రమే. లోపల బీజేపీ వేరేలా ఆలోచిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యం మహాకూటమిని ఓడించడం. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవాలని టీఆర్ఎస్ ఎంతబలంగా కోరుకుంటుందో.. అంతకంటే బలంగా బీజేపీ కూడా కోరుకుంటోంది. బీజేపీకి కాంగ్రెస్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ప్రధాన శత్రువే. ఇప్పుడు టీడీపీ కూడా అదేస్థాయిలో శత్రువైంది. మరి అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వస్తానంటే బీజేపీ ఊరుకుంటుందా?. అందుకే కూటమికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేయడానికైనా సిద్దపడింది. ప్రస్తుతం బీజేపీ కొన్ని స్థానాల్లో ప్రచారం చేస్తూ కేడర్ కి భిన్న సంకేతాలు ఇస్తుందట. గెలుస్తుంది అనుకుంటేనే బీజేపీకి ఓటేయండి లేదంటే టీఆర్ఎస్ కి ఓటేయండి అని చెప్తుందట. దీనివల్ల కూటమిని ఓటమికి దగ్గర చేయొచ్చని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

నిజానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య పొత్తుందని ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ కావాలనే బలం లేని అభ్యర్థులను నిల్చోబెడుతుందని పలువురు ఆరోపించారు. ఆ ఆరోపణల్లో నిజమెంతో ఇంకా బయటికి తెలియలేదు కానీ.. కూటమిని ఓడించాలని బీజేపీ టీఆర్ఎస్ కి ఓటేయమని చెప్తుంది అంటూ కొత్త ఆరోపణలు మొదలయ్యాయి. ఒకవేళ నిజంగా బీజేపీ అలా చేస్తే మాత్రం బీజేపీకే నష్టమనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ సహకరిస్తే బీజేపీ మూడు, నాలుగు సిట్టింగ్ స్థానాల్లో గెలుస్తుందేమో.. కానీ మిగతా స్థానాల్లో కూటమి ఓటమి కోసం టీఆర్ఎస్ కి ఓటు వేయిస్తే అసలు తెలంగాణలో బీజేపీ మనుగడకే ప్రమాదం. అసలే బీజేపీకి అన్ని స్థానాల్లో బరిలోకి దిగడానికి బలమైన అభ్యర్థులు లేరనే అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న కాస్త ఓటుబ్యాంకు కూడా టీఆర్ఎస్ కి పడితే.. బీజేపీ ఓటు శాతం దారుణంగా పడిపోతుంది. దీనితో పార్టీ కేడర్ మనోధైర్యం దెబ్బ తినడంతో పాటు.. ప్రజలకు బీజేపీ మీద నమ్మకం పోతుంది. మరి భవిష్యత్తులో పార్టీకి జరిగే భారీ నష్టం గురించి ఆలోచించకుండా టీఆర్ఎస్ కు సహకరించి బీజేపీ రాంగ్ స్టెప్ వేస్తుందా?. చూద్దాం ఏం జరుగుతుందో.