తమిళ సీఎం రేసులోకి విజయ్...! ప్రశాంత్ కిషోర్ సర్వేలో తలైవాకి ఊహించని ప్రజామద్దతు

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయమున్నా ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం ఇప్నట్నుంచే కలలు కంటున్నారు. గత ఎన్నికల్లో తృటిలో చేజారిన అధికారాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్ ఆశలు పెట్టుకోగా, ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు రజనీకాంత్ సిద్ధమవుతున్నారు. మరోవైపు కమల్ హాసన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక, ప్రస్తుత అధికార పార్టీ అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పట్నుంచే పావులు కదుపుతోంది.

అయితే, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సర్వేలో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయట. ప్రశాంత్ కిశోర్ ను కమల్ హాసన్.... వ్యూహకర్తగా నియమించుకోవడంతో... తమిళనాట తన టీమ్ తో సర్వే చేయించాడు. ఈ సర్వేలో తలైవా విజయ్ పేరును కూడా చేర్చారట. అయితే, సర్వే వివరాలు చూసి ప్రశాంత్ కిశోర్ షాక్ అయ్యాడట. తమిళ ప్రజల్లో 28శాతం విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారట. సర్వేలో 28శాతం తమిళ ప్రజలు మద్దతు ఉన్నట్లు తేలడంతో ప్రశాంత్ కిశోర్... విజయ్ ని కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. సర్వే వివరాలను విజయ్ కి అందజేసి ఎన్నికల బరిలోకి దిగాలని సూచించాడట. అంతేకాదు, రాజకీయాల్లోకి వస్తే, మిమ్మల్ని గెలిపించడానికి తాను వ్యూహ రచన చేస్తాని ప్రశాంత్ కిశోర్ తెలియజేశాడట. అందుకు ఏడాది యాక్షన్ ప్లాన్ ను విజయ్ చేతిలో పెట్టాడట. 

తాను చెప్పినట్లు వింటే... తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి మీరేనంటూ విజయ్ కి ప్రశాంత్ కిశోర్ ఆశలు రేకెత్తించినట్లు సమాచారం. తమిళ ప్రజలు ప్రస్తుతం విజయ్ కి అనుకూలంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో యువకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లే.... తమిళనాడులో విజయ్ కూడా సీఎం అవుతారని అంచనా వేస్తున్నారట. అయితే, ప్రశాంత్ కిశోర్ చెప్పినవన్నీ ప్రశాంతంగా విన్న విజయ్... ఎలాంటి నిర్ణయాన్ని చెప్పకుండా పంపేశారట. ఎందుకంటే, మరో ఐదేళ్ల వరకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం విజయ్ కి లేదని అంటున్నారు.