బాదంపప్పులు ఎందుకు నానబెట్టాలి

 

బాదంపప్పులంటే చాలా విషయాలే గుర్తుకువస్తాయి. ప్రొటీన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ... ఇన్ని పోషకాలు ఉన్న బాదంపప్పులని మించిన బలమైన ఆహారం లేదన్నది పెద్దల నమ్మకం. అదంతా అలా ఉంచితే... ఇంతకీ బాదం పప్పులని నానబెట్టి తినాలా, ఆపాటిన తినెయ్యాలా! అనే ధర్మసందేహం కలగక మానదు. మరి నానబెట్టిన బాదంపప్పుల వల్ల అధికలాభాలు ఏమన్నా ఉంటాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.

 

ఎందుకు!

- బాదం పప్పు పైన ఒక మందపాటి పొర ఉంటుంది కదా! ఇందులో ఆ పప్పుకి రక్షణగా ఉండేందుకు అవసరమయ్యే ఓ ఎంజైమ్ ఉంటుందట. గట్టిగా ఉన్న బాదంపప్పుని తినడం వల్ల అదే ఎంజైమ్ బాదంలోని పోషకాలు మన శరీరంలోకి చేరకుండా అడ్డుపడుతుంది. బాదం పప్పుని నానబెట్టి తినడం వల్ల, పప్పుని నమలగానే పొర విడిపోతుంది. బాదంలోని పోషకాలు ఒంటికి అందే అవకాశం చిక్కుతుంది.

 

- జీర్ణవ్యవస్థ అనగానే చిన్న పేగులు, పెద్ద పేగులు వంటి అవయవాలే గుర్తుకువస్తాయి. కానీ సగానికి సగం జీర్ణ ప్రక్రియ నోట్లోనే జరిగిపోతుందన్న విషయాన్ని గుర్తించం. నానబెట్టిన బాదంపప్పులని నమిలేటప్పుడు వాటికి మన నోటిలోని జీర్ణరసాలు తోడవుతాయి. ఇలా మెత్తగా ఉన్న బాదంపప్పులను జీర్ణం చేసుకోవడం శరీరానికి సులువుగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు బాదం పప్పులను పెట్టేటప్పుడు వాటిని నానబెట్టి తీరాలి. లేకపోతే వాళ్లు పప్పులను సరిగా నమలకుండానే తినే ప్రమాదం ఉంటుంది. అలా గట్టిగా ఉన్న పప్పులతో మేలు ఏమాత్రమూ ఉండదు సరికదా అజీర్ణం కూడా ఏర్పడవచ్చు.

 

ఎలా!

బాదంపప్పులను కనీసం నాలుగురెట్ల నీటిలో 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన పప్పులను నీటి నుంచి వేరు చేసి ఫ్రిజ్లో ఉంచితే ఓ వారం రోజుల పాటు నిలవ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు తాజాగా వాటిని నానబెట్టుకోవడమే మంచిదని చెబుతారు. ఇక బాదం పప్పులను మొలకెత్తించి తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయన్నది పెద్దల మాట. ఇందుకోసం 12 గంటలపాటు నానబెట్టిన బాదం పప్పులను ఒక గుడ్డలో కనుక మూటగట్టి ఉంచితే మరో 12 గంటల తరువాత తెల్లటి మొలక కనిపిస్తుంది. ఇలా ఓ రెండుమూడు రోజులు గడిచిన తరువాత మొలకెత్తిన పప్పులను తినవచ్చు.

 

పొట్టు తీసేస్తే!

బాదం పప్పు పై పొర మెత్తబడేందుకు ఇన్ని కష్టాలు పడేకంటే.... దాని పై పొరని ఒలిచేసి తినేస్తే పోలా అనిపించడం సహజం. అయితే దీని వల్ల అరకొర ప్రయోజనాలే అందుతాయంటున్నారు. బాదం పప్పులోని పీచుపదార్థం అంతా దాని పైపొరలోనే ఉంటుంది. ఇది పప్పు సరిగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడటమే కాకుండా మన పేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంపొందించి రోగనిరోధక శక్తినీ, జీర్ణశక్తినీ పెంపొందిస్తుందట.

- నిర్జర.