భారత్ క్రికెట్ కి మచ్చ తెచ్చిన మామా అల్లుళ్ళు

 

యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బి.సి.సి.ఐ.)కి ఐ.పి.యల్. మ్యాచులు ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయో అంతకంటే ఎక్కువ అపకీర్తిని కూడా మూటగట్టి ఇచ్చాయి. అందుకు ప్రధానంగా నిందించవలసిన వ్యక్తులు ఇద్దరే. ఇంతకాలం బి.సి.సి.ఐ.కి చైర్మన్ గా ఉన్న యన్. శ్రీనివాసన్ ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్. వారిరువురు కలిసి బి.సి.సి.ఐ. మరియు ఐ.పి.యల్. ఫ్రాంచైజీల మధ్య ఉన్న సన్నటి గీతను చెరిపివేసి, ఆ రెండూ ఒక్కటేననే విధంగా వ్యవహరించడంతో ఐ.పి.యల్.-6 సిరీస్ మ్యాచులలోజరిగిన స్పాట్-ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ వ్యవహారాల వలన బి.సి.సి.ఐ.కి చెడ్డ పేరు వచ్చింది.

 

బి.సి.సి.ఐ. చైర్మన్ గా కొనసాగుతున్న శ్రీనివాసన్ తన అల్లుడితో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ టీంలో భాగస్తుడిగా మారడాన్ని ఈరోజు సుప్రీం కోర్టు తప్పు పట్టేవరకు కూడా ఎవరూ తప్పుగా భావించకపోవడం చేతనే వారిరువురూ ఇంతగా రెచ్చిపోగలిగారు. అందుకే ఈరోజు జస్టిస్ ముద్గల్ కమిటీ నివేదికపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, బి.సి.సి.ఐ., దాని మాజీ చైర్మన్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురునాథ్ మేయప్పాన్ బి.సి.సి.ఐ.లో ఒక అంతర్గత బేరగాడుగా వ్యవహరిస్తుంటే, అతనిని నియంత్రించవలసిన శ్రీనివాసన్ నిమ్మకుండిపోయి తన బాధ్యతలను విస్మరించారని కోర్టు అభిప్రాయపడింది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వరించడంలో విఫలమయినందున శ్రీనివాసన్ను బి.సి.సి.ఐ.బోర్డు ఎన్నికలకు దూరంగా ఉండమని కోర్టు హెచ్చరించింది.

 

అంతే కాదు చెన్నై సూపర్ కింగ్స్ యజమానులు ఎవరెవరో, దానిలో ఎవరెవరికి ఎంత వాటాలున్నాయో, శ్రీనివాసన్ కు చెందిన ఇండియా సిమెంట్స్ సంస్థకు- చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు-ఆ మామా అల్లుళ్ళకీ మధ్య ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరిగాయో అన్నీ బయటపెట్టాలని కోర్టు ఆదేశించింది. ఇక ఎటువంటి తదుపరి విచారణ చేయకుండా వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ను రద్దు చేయమని ఆదేశించింది. ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా దోషు లందరిపై కటిన చర్యలు తీసుకోవలసిందిగా కోర్టు బి.సి.సి.ఐ.ని ఆదేశించింది. ఇకపై బి.సి.సి.ఐ.లో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరుగకుండా అవసరమయిన అన్ని చర్యలను తక్షణమే చేప్పట్టవలసింది కోర్టు ఆదేశించింది.

 

క్రికెట్ ఆటను ఒకమతంగా భావించే మనదేశంలో దానిని పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు దానికి మరింత మెరుగులు దిద్దుతూ, దేశంలో ఆ క్రీడను, ఆటగాళ్లను తయారుచేసుకోవలసిన బి.సి.సి.ఐ.బోర్డులో కనీసం బ్యాటు పట్టుకోవడం ఎలాగో కూడా చేతకాని రాజకీయనాయకులు, వారి ప్రాపకంతో అధికారం చేపడుతున్న శ్రీనివాసన్ వంటి అసమర్ధులు, అవినీతిపరులు, వారి వెనుకనే పరాన్నజీవుల వంటి గురునాథ్ మేయప్పన్ వంటి వారందరూ చేరి, బోర్డును చెదపురుగుల్లా తొలిచివేస్తుంటే కోట్లాది క్రికెట్ అభిమానులు నిస్సహాయంగా చూస్తుండి పోవలసివచ్చింది. కానీ విచిత్రమేమిటంటే మళ్ళీ ఆ గురునాద్ మేయప్పన్ చేసిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ నిర్వాకంవల్లనే, నేడు సుప్రీంకోర్టు కలుగజేసుకొని పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేసే అవకాశం కలగడం. క్రికెట్ ఆటను పర్యవేక్షిస్తున్న బి.సి.సి.ఐ. బోర్డులో బ్యాటు బాలు పట్టుకొని మైదానంలో క్రికెట్ ఆడిన వారికే చోటు కల్పించాలి తప్ప సిమెంట్ కంపెనీలు, సారా కంపెనీలు నడిపించుకొనే వ్యక్తులు కాదు. అప్పుడే క్రికెట్ ఆటకు పట్టిన ఈ చీడ వదిలే అవకాశం ఉంటుంది.