బ్యాంకులు, ప్రభుత్వాలు... మధ్యలో సామాన్యుడు!

 

బాలు.. ఇంట్లో చిల్లిగవ్వ లేదు. ఆమధ్య నాలుగైదు ఏటీఎంలు తిరిగి తెచ్చుకున్న అయిదువేలు ఖర్చయిపోయాయి. ఎలాగొలా మళ్లీ ఏటీఎం దగ్గరకి వెళ్లాలనుకుంటూ ఉండగానే ఓ వార్త కంటికి కనిపించింది. మే 30, 31న జాతీయ బ్యాంకులలో పనిచేసే పదిలక్షలమందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారన్నదే ఆ వార్త. తమ డిమాండ్లకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదన్నదే వారి ఆరోపణ. సరే! అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. వాటిని వ్యక్తపరిచే హక్కూ ఉంటుంది. కానీ కోట్లాది మంది బడుగు జీవులకి జీతాలు చేతికందే వేళ సమ్మెకి దిగడం ఎంతవరకు మానవత్వం!

 

ఇప్పటికే ఏ సంస్థలకీ లేని విధంగా బ్యాంకులకు వరుసపెట్టి సెలవలు వచ్చేస్తుంటాయి. వాటికి తోడు శనివారాలు సెలవనీ ప్రకటించేశారు. బ్యాంకు దాకా వెళ్తే కానీ ఆ రోజు బ్యాంకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. వెళ్లాక పని జరుగుతుందో లేదో అనుమానం. ఇలాంటి పరిస్థితి మధ్య బ్యాంకు ఉద్యోగులకి, తమ అసంతృప్తిని తెలియచేసేందుకు సమ్మె తప్ప మరో మార్గం కనిపించలేదా! ఈ దేశంలో పని మానేయడం ఒక్కటే, అసంతృప్తిని తెలియచేసే మార్గంగా స్థిరపడిపోయిందా!

 

చాలా ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ప్రభుత్వరంగంలో వేతనాలు, సౌకర్యాలు, ఉద్యోగ భద్రతా ఎక్కువే! తమ డిమాండ్లను సాధించుకునేందుకు అక్కడ యూనియన్లు కూడా చాలా బలంగా ఉంటాయి. కానీ బ్యాంకులు ఇలా చటుక్కున సమ్మెకి దిగిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరోవైపు ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా ప్రవర్తించినా చెల్లిపోతుంటుంది. అక్కడ సమ్మె చేసే ధైర్యం కానీ, దానికి మద్దతు పలికే నైతిక బలం కానీ చాలా తక్కువగా ఉంటాయి. మన దేశంలో... ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కనిపించే ఈ వ్యత్యాసం చాలా దారుణం!

 

ఇక తమ సంస్థలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సిబ్బంది ఎందుకు దాన్ని సమ్మెతో సవరించే ప్రయత్నం చేయరన్నది సామాన్యులకి కలిగే మరో ప్రశ్న. ఒకప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్‌ వ్యవస్థ మూలస్తంభంగా నిలిచేది. ప్రపంచవ్యప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినా, మన దేశం స్థిరంగా ఉండటానికి కారణం ఆ వ్యవస్థే! కానీ నేషనలైజేషన్‌ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడూ లేనంత దుర్బలంగా ఉందని ఎవరో నిపుణుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి పెద్ద నోట్ల రద్దు లాంటి ప్రభుత్వ నిర్ణయాలతో పాటు యాజమాన్య వైఫల్యం కూడా ఓ కారణమే! ఈ వైఫల్యాల మీద ఏనాడూ బ్యాంకు దిగువ సిబ్బంది తగినంత గొంతుకని వినిపించనేలేదు!

 

సామాన్యుల దగ్గర ఒకప్పటి షావుకారులాగా రూపాయికి రూపాయి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు... బడాబాబుల దగ్గర సాగిలపడుతున్నాయి. ‘ఇస్తే ఇవ్వండి లేకపోతే మొండి బకాయిలలో రాసుకుంటామని’ ఆఫర్ చేస్తున్నాయి. దీనికి NPA (non performing assets) అని ఓ ముద్దు పేరు పెడుతున్నాయి. DENA బ్యాంకులో ఈ NPAలు ఇచ్చిన అప్పులలో నాలుగో వంతు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. NPAలను స్పష్టంగా చూపించాన్న రిజర్వ బ్యాంక్‌ సూచనే ఇందుకు కారణం అయినప్పటికీ... గత ఐదేళ్లలో బడా బాబులకి ఇచ్చే రుణాలలో అవినీతి పెరిగిపోయిందన్నది జగమెరిగిన సత్యం.

 

బ్యాంకు ఉద్యోగులకి మాత్రం ఇవేవీ పట్టలేదు. NPAలతో సంబంధం లేకుండా తమ జీతాలు పెంచాలని వాళ్లు కుండబద్దలు కొట్టేశారు. తగినంత పెంచనందుకు నిరసనగా సమ్మెకు దిగేశారు. ఈ సమ్మె వల్ల ఉద్యోగులకి లాభం జరిగితే మంచిదే! కానీ ప్రజలకి జరిగిన నష్టానికి ఎవరు ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నించినా సమాధానం వస్తుందా!