ఆ విషయంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే..

 

జనసేన పవన్ కళ్యాణ్ కు అన్ని విషయాల్లో ఏమో కానీ కొన్ని విషయాల్లో మాత్రం బాగానే క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అదేంటంటే... పార్టీలోకి ఎవరిని తీసుకోవాలీ అన్న విషయంలో. దీనికి కారణం కూడా లేకపోలేదు. తన అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఎవర్ని పడితే వాళ్లని పార్టీలోకి తీసుకొని.. చుట్టు పక్కల వాళ్ల మాటలు విని చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఆ తప్పు పవన్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవర్ని పడితే వాళ్లని కాకుండా.. కాస్త సెలెక్టివ్ గా అందర్నీ ఎంపిక చేసుకుంటున్నాడు. ఆఖరికి కుటుంబసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాడంటేనే అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. తమ కుటుంబ సభ్యులు తన పార్టీల్లోకి రావడంపై కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

నిజానికి పవన్ కుటుంబ సభ్యులకు పవన్ అంటే ఎంత ఇష్టమో.. ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సందర్భంలో బాబాయ్ పిలవాలే గానీ, మైక్ పట్టుకుని జనసేన తరపున ప్రచారం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధం అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామెంట్ కూడా చేశాడు. ఇక అన్నయ్య నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనసేన తరపున బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ వార్తల నేపథ్యంలో.. ఈ విషయంపై పవన్ ను అడగ్గా... దానికి పవన్ నుండి సమాధానం లభించింది. ‘ఎవరైనా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తానని, అంతేతప్పా తన కుటుంబ సభ్యులను రమ్మని గానీ, ప్రచారం చేయమని గానీ అడగబోనని’ స్పష్టంగా చెప్పేశారు. ఒకవేళ పార్టీలోకి వస్తానని చెప్పినా, ఒకటికి పది సార్లు ఆలోచించుకోమని కోరుతానని, రాజకీయాల్లోకి రావడం అంటే చాలా నిబద్దతో కూడుకున్న వ్యవహారం అని, ఇష్టపడి రావాలి తప్ప బలవంతంగా తీసుకురాకూడదని అన్నారు. అంతేకాదు.. తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు.. వారినెందుకు ఇబ్బంది పెట్టడం అని తాను భావిస్తానని, ఇంతకుమించి తానేమీ చెప్పలేనని అన్నారు. దీంతో మొత్తానికి ప్రజారాజ్యం పార్టీలో జరిగింది ఓ ఎక్స్ పీరియన్స్ అయినట్టుంది. అందుకే పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో.. వద్దో అని క్లారిటీగానే ఉన్నారు అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఈ ఒక్క విషయంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే అంటున్నారు. రాజకీయాల్లోకి ఇష్టపడి రావాలి తప్పా, తాను ఆహ్వానించడం జరగదని చెప్పడం, పవన్ ఆలోచనా తీరుకు అద్దం పడుతోంది అని అంటున్నారు.