మానవరూపంలో మృత్యువు.. లారెన్స్ బిష్ణోయ్!

రెక్కీ చేసెయ్... ప్రాణం తీసెయ్.. ఇదే, రెండుపదుల వయసులోనే ఫస్ట్ మర్డర్ చేసి.... హత్యల శాస్త్రంలో అక్షరాభ్యాసం చేసిన లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌సభ్యులకు చెప్పే నేరకమంత్రం. ముప్ఫై ఒక్క సంవత్సరం వయసు వచ్చేసరికి లారెన్స్ బిష్ణోయ్ మోడ్రన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. మర్డర్ చేయడం ఈజీనా, మంచినీళ్ళు తాగడం ఈజీనా అని అడిగితే... మర్డర్ చేయడమే ఈజీ అని మొహమాటం లేకుండా చెప్పే ఏడు వందలమంది కరడుగట్టిన సభ్యులతో దేశమంతటా గ్యాంగ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు సబర్మతీ జైల్లో వున్నాడు. అయినప్పటికీ తాను లేని లోటుని ఈ సమాజం ఫీల్ అవనివ్వడు. అందుకే తన గ్యాంగ్‌ సభ్యులతో బ్లాక్‌మెయిల్స్, మర్డర్స్ చేయిస్తూ మకుటంలేని మాఫియా మహారాజులా వెలుగుతున్నాడు. లారెన్స్  బిష్ణోయ్ జైలు నుంచి ఆదేశిస్తాడు.. బయట వున్న అతని గ్యాంగ్ మెంబర్స్ చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తారు.. అది మర్డరైనా.. మరేదైనా! అప్పుడెప్పుడో పాతతరం వాళ్ళకి దావూద్ ఇబ్రహీం.. హాజీమస్తాన్, ఛోటా రాజన్ లాంటి గ్యాంగ్స్.స్టర్స్ గురించి తెలుసు.. మూడు పదుల వయసులోనే మర్డర్లు, కిడ్నాపులు, బ్లాక్‌మెయిలింగ్స్ లాంటి ముప్పైకి పైగా కేసులని తన కీర్తికిరీటంలో ధరించిన మోడ్రన్ మొద్దుశ్రీను లారెన్స్ బిష్ణోయ్‌‌ గురించి తెలుసుకునే అవకాశం ఈనాటి కొత్తతరానికి కలుగుతోంది. ఆమధ్య జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిక్ హత్యతో తన మరణశాసనాలను హిస్టరీని అప్‌డేట్ చేసుకున్న లారెన్స్ బిష్ణోయ్ జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని తరిద్దాం.

లారెన్స్ బిష్ణోయ్ 1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పుట్టాడు. అతని తండ్రి హర్యానాలో పోలీస్ కానిస్టేబుల్. ఇంటర్మీడియట్ వరకు అబోహర్‌లో చదువుకున్న బిష్ణోయ్ ఆ తర్వాత చండీగఢ్ డీఏవీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదివాడు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. పట్టా అందుకున్నాడు. కాలేజీలో, యూనివర్సిటీలో వున్నంతకాలంలో లారెన్స్ బిష్ణోయ్ చదివింది తక్కువ... విద్యార్థి రాజకీయాలు నడిపింది ఎక్కువ. కాలేజీలో చదివే రోజుల్లో కాలేజీ ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థిని ముచ్చటగా మర్డర్ చేసుకున్నాడు. ఆ తర్వాత లుథియానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన మీద పోటీ చేస్తున్న అభ్యర్థి బుర్రకి బుల్లెట్ రుచి చూపించాడు. రెండు పదులు నిండీనిండకుండానే డజన్లకొద్దీ నేరాలు ఘోరాల చేసిన బిష్ణోయ్ మీద బోలెడన్ని  కేసులు నమోదయ్యాయి. బంగారానికి తావి అబ్బినట్టు.. అయ్యగారిది అసలే క్రిమినల్ బ్రెయిన్.. దానికి తోడు ‘లా’ కూడా చదివి చట్టానికి చుట్టమయ్యాడు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని స్వేచ్ఛగా తిరిగాడు. బెదిరింపులే పెట్టుబడిగా ఒకవైపు నేర సామ్రాజ్యాన్ని, మరోవైపు  వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అడపాదడపా జైలుకు వెళ్ళినా, దాన్ని కూడా తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించడానికే ఉపయోగించుకున్నాడు. జైల్లో వున్న కరడుగట్టిన నేరస్తులకు తన గ్యాంగ్‌లో మెంబర్‌షిప్ ఇచ్చేవాడు.. అలా ఏడువందలకు పైగా కర్కోటర్లతో బలమైన ముఠాని క్రియేట్ చేసుకున్నాడు. 

ఇంత ఘనమైన చరిత్ర వున్న బిష్ణోయ్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాని హత్య చేయడానికి తన ఫ్రెండ్ అయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌కి తీహార్ జైల్లోంచే సహకరించాడు. ఈ నేరంలో బిష్ణోయ్ హస్తం వుందని తెలిసినా, చట్టం గుట్టుమట్లు, లోటుపాట్లు బాగా తెలిసిన బిష్ణోయ్ మీద పోలీసులు ఏ చర్యా తీసుకోలేకపోయారు. 2023లో ఖలిస్తాన్ వేర్పాటువాది సుఖ్‌దూల్ సింగ్‌ గిల్ హత్యని, కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యని మేమే చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ సగర్వంగా ప్రకటించుకుంది. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, హీరో సల్మాన్‌ఖాన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖుల సన్నిహితుడు బాబా సిద్ధిక్‌ని హత్య చేయడం ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ కొత్త కలకలానికి తెర తీసింది. 

రెండు దశాబ్దాల నిశ్చబ్దం తర్వాత ముంబైలో మళ్లీ తుపాకీ మోత మోగింది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీలో నెత్తుటి ధారలు పారించిన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ బాబా సిద్ధిక్ హత్యతో ముంబైలో అడుగుపెట్టింది.  బాలీవుడ్ సెలబ్రెటీలకు సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని తామే చంపామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు ఆ గ్యాంగ్ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు సినీ నటుడు సల్మాన్ మీద కోపంతోనే బాబా సిద్ధిక్‌ని బిష్ణోయ్ చంపించాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ బిష్ణోయ్‌కి సల్మాన్‌ఖాన్ మీద ఎందుకు కోపం? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలి.

1999లో సల్మాన్ ఖాన్ నటించిన హమ్ సాథ్ సాథ్ హై సినిమా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం రాజస్థాన్‌లో జరిగింది. షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, తన సహనటులతో కలిసి అక్కడి అడవుల్లో విహరించే కృష్ణ జింకలను వేటాడాడు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ఆ తరువాత కేసు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇంతవరకు సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడలేదు. కృష్ణ జింకలను లారెన్స్ బిష్ణోయ్ సామాజిక వర్గం తమ కులదైవానికి ప్రతీకగా పూజిస్తుంది. కృష్ణ జింకలను పవిత్ర జంతువులుగా ఆరాధిస్తుంది. బిష్ణోయ్ సామాజివర్గానికి చెందినవారు చనిపోయాక కృష్ణ జింకలుగా పుడతారన్న బలమైన నమ్మకం వారిలో వుంది. కృష్ణ జింకల విషయంలో బిష్ణోయ్‌ల ప్రేమ ఏ స్థాయిలో వుంటుందంటే... ఎప్పుడైనా తల్లి కృష్ణజింక చనిపోయి దాని పిల్లలు అనాథలు అయితే, బిష్ణోయ్ సామాజికవర్గంలోని మహిళలు వాటిని తమ బిడ్డల్లాగా ప్రేమగా పెంచుతారు. బాలింతలుగా వున్న మహిళలు ఆ కృష్ణజింక పిల్లలకు చనుపాలు ఇచ్చి పెంచుతారు. అలాంటి పవిత్ర జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపాడని బిష్ణోయ్ సామాజిక వర్గంలో ఆగ్రహం వుంది. ఒక సందర్భంలో లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడాడు. నాకు సల్మాన్‌ఖాన్‌ని చంపాలన్న ఉద్దేశం లేదు.  మా బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన ముకం ముక్తి ధామ్ ఆలయానికి సల్మాన్ ఖాన్ వెళ్ళి క్షమాపణలు చెబితే మేం ఆయన్ని క్షమిస్తాం అన్నాడు. అయితే సల్మాన్ ఖాన్ సదరు ఆలయానికి వెళ్ళిందీ లేదు.. క్షమాపణ చెప్పిందీ లేదు. అందువల్ల సల్మాన్ మీద వున్న కోపం లారెన్స్ బిష్ణోయ్‌కి పెరిగిపోయి వుంటుందని, సల్మాన్‌కి షాక్ ఇవ్వడం కోసమే ఆయన సన్నిహితుడైన మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ని హత్య చేయించి వుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

బిష్ణోయ్ గ్యాంగ్ తమ ఉనికి చాటుకోవడం కోసం గతంలో ఒకసారి  సల్మాన్ ఇంటి దగ్గర ఫైరింగ్ చేసింది. ఆ తర్వాత ఓ బిగ్ టార్గెట్‌ను షూట్ చేయకపోతే భయం ఉండదని అనుకుని.. బాబా సిద్దిఖీని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో దావూద్ ఇబ్రహీం కూడా ఇలాగే బాలీవుడ్‌ను టార్గెట్ చేసేవాడు. పలువురి మీద దాడులు చేయించాడు. ఇలా బెదిరించే దావూద్ బాలీవుడ్ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతారు. తర్వాత మెల్లగా మాఫియా కబంధ హస్తాల నుంచి బాలీవుడ్ బయటపడింది. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ రూపంలో మరోసారి ముంబైలో మాఫియా తలెత్తుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలని దాటి ఇప్పుడు ముంబై మీద కూడా తన పంజా విసిరిన లారెన్స్ బిష్ణోయ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా తన బ్రాండ్ ఐడెంటిటీ చూపిస్తున్నాడు. లారెన్స్ తీహార్ జైల్లో వుంటూనే, కెనడాలో వున్న తన సోదరుడి ద్వారా అక్కడ నేర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. కెనడాలో ఖలిస్తానీ ఉద్యమం చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం వుందని కెనడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. బిష్ణోయ్ గ్యాంగ్‌ని భారత ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కెనడా ప్రభుత్వం నోరు పారేసుకుంది. అక్కడతో ఆగకుండా నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను కూడా చేర్చింది. ఇండియా మీద బురద చల్లడానికి బిష్ణోయ్ గ్యాంగ్ చేస్తున్న నేరాలను కెనడా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. 

రాజకీయ నాయకుడు ఎక్కడున్నా రాజకీయ నాయకుడే. తన ప్రయోజనం కోసం ఎన్ని నాటకాలైనా ఆడతాడు. కెనడా ప్రధాని ట్రూడో కెనడాలో ప్రజలతో పాటు సొంత పార్టీలో కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కెనడాలో వున్న సిక్కుల ఓట్లు కూడా చాలా కీలకం. కెనడాలో వున్న సిక్కుల్లో ఎక్కువ శాతం ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చేవారే. ఖలిస్తాన్ లీడర్ నిజ్జర్‌ని హత్య చేయించిన బిష్ణోయ్‌కి, ఇండియా ఏజెంట్లకి సన్నిహిత సంబంధాలు వున్నాయన్న అబద్ధాన్ని కెనడా ప్రభుత్వం అక్కడి సిక్కుల్లో బలంగా నాటగలిగింది. ఇండియా వ్యతిరేకించే ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా కూడా సిక్కుల్లో తమకు మద్దతు పెంచుకుంటోంది. ఒకవైపు ఖలిస్తాన్ ఉద్యమాన్ని సమర్థించడంతోపాటు, మరోవైపు నిజ్జర్ హత్య ఇండియా, బిష్ణోయ్ కలసి చేశారన్న అంశాన్ని ప్రచారం చేయడం ద్వారా కెనడా ప్రధాని రాజకీయంగా లాభం పొందాలని అనుకుంటున్నాడు.  తన రాజకీయ వ్యూహంలో లారెన్స్ బిష్ణోయ్‌ని ఒక పావులా వాడుకుంటున్నాడు. బిష్ణోయ్ చేయించిన హత్య పుణ్యమా అని ఇండియా - కెనడా దేశాల మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడింది. ఆ అగాథాన్ని కెనడా నాయకులు ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కెనడా చేసిన కవ్వింపు చర్యలకు ప్రతిచర్యగా భారత ప్రభుత్వం ఇండియాలో వున్న కెనడా ప్రతినిధులను దేశం విడిచి వెళ్ళమని ఆదేశించింది.  రేపో మాపో కెనడా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం వుంది. స్వదేశంలో ఆగడాలతో ఆగకుండా  ఇండియా - కెనడా మధ్య కూడా నిప్పు పెట్టిన లారెన్స్ బిష్ణోయ్ సబర్మతీ  జైల్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు.