చంద్రబాబుపై మార్షల్స్ దౌర్జన్యం... ఏపీ అసెంబ్లీలో రణరంగం

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీ మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారు. జీవో 2430పై నిరసన తెలుపుతున్న చంద్రబాబు అండ్ టీడీపీ ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ బయట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న బాబు, టీడీపీ సభ్యులపై చేయి చేసుకున్నారు. ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా చంద్రబాబును మార్షల్స్ చేయి పట్టుకుని లాగేశారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చీఫ్ మార్షల్స్ కు అంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదని... కానీ ప్రతిపక్ష నేతతో ఇంత దురుసుగా వ్యవహరించడం మాత్రం దారుణమన్నారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఇదొక మాయని మచ్చ అన్నారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ చేయి వేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమను అసెంబ్లీ లోపటికి వెళ్లకుండా గేటు దగ్గరే అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్లకార్డులు, బ్యానర్స్, నల్ల బ్యాడ్జీలు వద్దని చెబితే తీసేశామని, కానీ పేపర్స్ కూడా తీసుకెళ్లొద్దని ఆదేశించడమేంటని అచ్చెన్న ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో చిన్న తెల్లకాగితం ఉండటంతో 40 నిమిషాలపాటు బయటే నిలబెట్టారని... ప్రతిపక్ష నేతతో వ్యవహరించే పద్ధతి ఇదేనా అంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు.

అయితే, అచ్చెన్నాయుడు ఆరోపణలను మంత్రి బుగ్గన ఖండించారు. అసెంబ్లీలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురాకూడదని టీడీపీ హయాంలోనే రూల్స్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. అంతేకాదు, టీడీపీ సభ్యులే రౌడీయిజం చేశారని, మార్షల్స్ ను తోసివేశారని బుగ్గన కౌంటరిచ్చారు. తమపై దాడి చేశారని టీడీపీ సభ్యుల తీరుపై మార్షల్స్ ఫిర్యాదు చేశారని బుగ్గన అన్నారు. అసెంబ్లీ సజావుగా సాగుతుంటే... టీడీపీ కావాలనే నానా యాగీ చేస్తోందని మండిపడ్డ బుగ్గన.... తెలుగుదేశం హయాంలో ఒక్క బిల్లుపై కూడా చర్చ జరగలేదని గుర్తుచేశారు.

బుగ్గన వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన అచ్చెన్నాయుడు.... రూల్స్ ఎప్పట్నుంచో ఉన్నాయని, కానీ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోకి ప్లకార్డులు తీసుకురాలేదా? బెంచీలు ఎక్కి అరవలేదా? అంటూ ప్రశ్నించారు. వైసీసీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని రాలేదని, బెంచీలు ఎక్కలేదని నిరూపిస్తే... ఇప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ అచ్చెన్న సవాలు విసిరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతోను, టీడీపీ ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన చీఫ్ మార్షల్ ను సభకు పిలిపించి స్పీకర్ మాట్లాడాలని, లేదంటే తాము సభలో ఉండలేమని అన్నారు. అయితే, స్పీకర్ తమ్మినేని విచిత్రంగా స్పందించారు. ప్రతిపక్షం ఇష్టానికి వదిలేస్తున్నట్లు తెలిపారు.