చంద్రుడిపై ఎకరం ధర ఎంతో తెలుసా..

చంద్రుడిపై ఇల్లు కట్టుకోని భూమి చూడాలనుందా

మైనింగ్ చేసి హీలియం వెలికితీసి డబ్బులు సంపాదించే ఆలోచన ఉందా

పరిశోధనా సంస్థలకు మీ స్థలం లీజుకు ఇవ్వాలని ఉందా

ఈ ఆలోచనలు ఉంటే మీరు తక్షణమే చంద్రడిపై జాగ కొనాల్సిందే.. మరి అక్కడ ఎకర స్థలం ఎంతో తెలుసా.. అంతేకాదు రెండుకు మించి ఎకరాలు కొనేవారికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ చంద్రుడిపై స్థలం సొంతం చేసుకున్న మొదటి బాలీవుడ్ హీరో. ఆస్ట్రేలియాలో ఉండే ఆయన అభిమాని ఒకరు షారూక్ బర్త్ డే గిఫ్ట్ గా చంద్రుడిపై ప్లాట్ కొని బహుమతిగా ఇచ్చారట. ఇక ఇటీవల మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా చంద్రుడిపై ప్లాట్ కొన్నారు. ముంబాయికి చెందిన మరో వ్యాపారి కూడా చంద్రుడిపై స్ఠలం కొన్నాడు. సుశాంత్ అభిమాని ఒకరు గత నెల చంద్రుడిపై జాగను సొంతం చేసుకున్నాడు.

 

ఎవరు అమ్ముతున్నారు..
భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. సూర్యమండలంలోని  ప్రధాన గ్రహల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు 173 ఉన్నాయని శాస్త్రవేతలు చెబుతారు. వీటిలో అత్యధికంగా బృహస్పతి చుట్టూ 67,  శని  గ్రహం చుట్టూ 62 ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడిని చేరుకోవడానికి దశాబ్దాలుగా నాసా అంతరీక్ష నౌకలు పంపిస్తోంది. అనేక దేశాలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 12మంది చంద్రుడిపై కాలు మోపి ఆ తర్వాతి తరం వారు కాలనీలు కట్టుకోవడానికి వీలైన వాతావరణం కోసం అన్వేషణ కొనసాగించారు. సమీప భవిష్యత్ లో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం చేయాలన్న సంకల్పంతో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలు జరిగాయి. చాలా దేశాలు చంద్రుడిపై పాగా వేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.  అంతరీక్షంలోని ఇతర గ్రహాలను నివాసయోగ్యంగా చేసుకోవాలన్న ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.  ఈ నేపథ్యంలో అంతరిక్ష వనరుల అన్వేషణ, వినియోగ చట్టం అమలులోకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ ఆఫీస్ న్యూయార్క్ లో ఉంది.

 

కాలనీలుగా..
చంద్రుడిపై మచ్చగా కనిపించే ప్రాంతంలో లూనా సోసైటీ ఇంటర్నేషనల్ కాలనీలుగా డివైడ్ చేసింది. వాటికి ఆకర్షణీయమైన పేర్లు కూడా పెట్టి ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఎకరాల చొప్పున స్థలాన్ని విక్రయిస్తున్నారు. డ్రీమ్ సరస్సు,, ప్రశాంత సముద్రం, బే ఆఫ్ రెయిన్ బోస్ ఇలాంటి పేర్లతో కాలనీలుగా చంద్రుడిపై ఆవాసాలు ఏర్పర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల వారు ఈ స్థలాలను ఇప్పటికే కొనుగోలు చేశారు.

 

ధర తక్కువే.. కొనుగోలు విధానమే కష్టం..
చంద్రుడిపై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 1999లో అంతర్జాతీయ లూనార్ రిజిస్ట్రీ లాండ్స్(ఐఎల్ఎల్ఆర్)ను రూపొందించారు. ఇది స్వతంత్య్ర సంస్థ.

ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు అంటార్కిటికా ఖండం మినహా మిగతా ఆరుఖండాల్లోని వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు, సంపన్నులు పన్నెండు న్నర లక్షల ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. లూనార్ సోసైటీలో సభ్యత్వం కోసం చెల్లించాల్సిన ఫీజుమొత్తాన్ని డాలర్ల రూపంలోనే చెల్లించాలి. స్థలం సొంతదారులకు పట్టాలను కూడా ఈ సంస్థ అందిస్తోంది.

హ్యాపీనెస్ సరస్సు  సమీపంలో ఎకరం ధర 28.95 డాలర్లు. మూడు ఎకరాలు కొంటే 25శాతం, ఐదు ఎకరాలు కొంటే 33శాతం, పది ఎకరాలు కొంటే 173డాలర్లు మాత్రమే. అంటే పది ఎకరాలు కొనేవారికి 40శాతం రాయితీ ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో టూరీజం, పరిశోధనలకు మంచి డిమాండ్ ఉంటుందని సంస్థ నిర్వహకులు ప్రకటిస్తున్నారు. ఏయో ప్రాంతాలు వేటికి బాగా పనికి వస్తాయో కూడా వివరిస్తున్నారు. అంతేకాదు ఆయా  ప్రాంతాల్లో ధరలు కూడా వేరువేరుగా ఉన్నాయి. చాలా మంది తమకు ఇష్టమైన వారికి బహుమతులుగా కొనిస్తున్నారట.

మరికొన్ని దశాబ్దాల్లో అచ్చం మన భూమి మీద మాదిరిగానే చంద్రుడి మీద ఇల్లు కట్టుకుని "భూమి అమ్మ రావే.. బందరు లడ్డు తేవే" అని పాడుకునే రోజు వస్తుందేమో..!