మంత్రి నారాయణ రికార్డ్.. దేశంలోనే ధనిక మంత్రి


అప్పుడెప్పుడో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరును బట్టి ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు మంత్రి నారాయణకు చివరి స్థానం వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఓ విషయంలో నారాయణ మొదటి స్థానం సంపాదించారు. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు.. దేశ వ్యాప్తంగా సాధించి రికార్డ్ బద్దలు కొట్టారు. ఇంతకీ ఏ విషయంలో నారాయణ ప్రథమస్థానంలో నిలిచారబ్బా అనుకుంటున్నారా.. అదేంటంటే.. దేశంలోని అత్యంత ధనవంతులైన మంత్రుల జాబితాలో పి.నారాయణ ప్రథమస్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు.  ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంత్రుల ఆదాయంపై సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం..  నారాయణ మొత్తం ఆస్తి విలువ రూ.496 కోట్లుగా తేలింది. దీంతో ఆయన దేశంలోనే ధనిక మంత్రిగా ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ రూ.251 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏపీకి చెందిన మరో 20 మంది మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.