ప్రారంభంకానున్న రచ్చబండ.. నేను మాట ఇస్తే ప్రభుత్వం ఇచ్చినట్లే: సీఎం జగన్

 

రచ్చబండ కార్యక్రమం చేపడతానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాను ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వ హామీగానే భావించి..అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ శాఖల అధిపతులకు కార్యదర్శులకు స్పష్టం చేశారు.  ప్రభుత్వ పాలన విధానంపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు.  వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా జగన్ తెలిపారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలపై జరిపిన సమీక్ష సందర్భంగా ఆయన ప్రకటన చేశారు.  ప్రభుత్వం తిరిగి ఎన్నిక కావటమే మైలురాయిగా పనిచేయాలని.. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చినపుడే అది సాధ్యమవుతుందన్నారు. నవరత్నాల అమలే ఫోకస్ గా ఉండాలని వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా సంతృప్త స్థాయిలో చేస్తుందనేది ప్రజల్లో చర్చ కావాలన్నారు. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు ఎలా పెంచుకోగలం ఆలోచనల చెయ్యాలని ఆదేశించారు. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకోవాలన్నారు. దీనికోసం ఢిల్లీలో ఉన్న మన అధికారులను బాగా వినియోగించుకోమని సలహా ఇచ్చారు.

రచ్చబండ సమయంలో ప్రజల నుంచి వచ్చే వినతులపై హామీలిస్తాం వాటన్నింటిని అమలుచేయటంపై అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి హామీ అమలు కావాలి పనులు వెనువెంటనే మొదలుకావాల్సిందే.. మాట ఇస్తే అమలుచేయాల్సిందే.. తాత్సారం జరగకూడదు, ఇచ్చిన మాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదు. రచ్చబండ కోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని సెలవిచ్చారు. ఏదైనా పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోనే పనులు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్ష నాటికి జిల్లాల పర్యటనల్లో నేనిచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరారు.