అమరావతి పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. అందుకేనా..!

ఒక పక్క రాజధాని విశాఖకు తరలించేందుకు ముహూర్తాలు సిద్దం చేస్తున్న సమయంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయన అధికారం చేపట్టిన నాటి నుండి అమరావతిలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది సేపటి క్రితం అధికారులతో సమావేశమైన సీఎం జగన్ అమరావతిలో ప్రస్తుతం ఏయేదశల్లో నిర్మాణాలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని పూర్తిచేసే కార్యాచరణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేసారు. దీని కోసం నిధుల సమీకరణకు ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఆన్ లైన్ లో ప్రజలు ఫ్లాట్ లు కొనుక్కున్న హాపీ నెస్ట్‌ బిల్డింగులను కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

 

ఇది ఇలా ఉండగా రాజధాని తరలింపు బిల్లుల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం రేపటిలోగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన నేపథ్యంలో ఒక పక్క అమరావతి రైతులు.. స్టే ఆర్డర్ ను కొనసాగించాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటిషన్లు వేశారు. రేపు ఆ పిటిషన్లతో పాటు.. ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ ను కూడా పరిశీలించాక హైకోర్టు స్టే ఆర్డర్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తు సరిగ్గా ఒక రోజు ముందు అమరావతిలోని నిర్మాణాలపై సమీక్షను నిర్వహించింది. సుమారు 15 వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం మధ్యలో ఆగిపోయినవాటిని పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అయితే సరిగ్గా మూడు రాజధానుల ప్రకటనకు పది రోజుల ముందు కూడా ఇలాంటి సమీక్షే చేసిన సీఎం అపుడు కూడా ఇవే ఆదేశాలిచ్చారు. ఇప్పుడు మాత్రం మరిన్ని వివరాలతో మీడియాకు రిలీజ్ చేశారు. 

 

ఇప్పుడు ఇదే విషయాన్నీ ప్రభుత్వం రేపు అఫిడవిట్ లో పేర్కొనే అవకాశం ఉంది. అమరావతిని తాము నిర్లక్ష్యం చేయడం లేదని లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగుతుందని అంటే కాకుండా ఇక్కడ అభివృద్ధి పనులు ఆపలేదని కేవలం వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడుతున్నామని పేర్కొనే అవకాశం ఉంది దాని కోసమే ఈ హడావిడి సమీక్ష సమావేశం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ రేపు విశాఖకు వెళ్లటం సాధ్యం కాకపోతే ఈ ఆదేశాలు చూపి అమరావతికి మేము అన్యాయం చేయడం లేదు చూడండి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. దీంతో ప్రస్తుతం ప్రజలందరి దృష్టి రేపు హైకోర్టులో జరిగే వాదనల పైన అలాగే కోర్టు ఇచ్చే తీర్పు పైనే ఉంది.