జపాన్ విజిట్ సంతృప్తికరం... చంద్రబాబు..
posted on Dec 1, 2014 12:49PM
తన జపాన్ పర్యటన సంతృప్తికరంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జపాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. జపాన్‌లో తాను జపాన్ ప్రధానితోపాటు అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో వారితో విస్తృతంగా చర్చించానని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావారణాన్ని కల్పించాల్సి వుందని ఆయన చెప్పారు. జపాన్‌లో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, మన దేశం కూడా దానిని అనుసరించాల్సిన అవసరం వుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాను చేస్తున్న కృషి రాబోయే తరాల వారి కోసమేనని చంద్రబాబు అన్నారు. జపాన్‌లోని పలు ప్రాంతాలలో పర్యటించిన తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అనేక అంశాలను పరిశీలించామని తెలిపారు.