తెలంగాణా రాష్ట్రానికి దక్కిన అవార్డులు...

 

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మిషన్ భగీరథ, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళారు. అలా తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి మరో పురస్కారం దక్కింది. జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జాతీయ జల మిషన్ ప్రకటించిన అవార్డుకు మిషన్ భగీరథ ఎంపికైంది. జాతీయ జల మిషన్ అవార్డుల జాబితా వచ్చింది.

తెలంగాణ రాష్ర్టానికి పలు అవార్డులు దక్కాయి. పది విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. తెలంగాణ సాగు నీటి సమాచార వ్యవస్థ రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ మిషన్ భగీరథ పథకం పురస్కారాలకు ఎంపికయ్యింది. తెలంగాణ జల వనరుల సమాచార వ్యవస్థ కేటగిరి 1ఏ లో ఎంపికైంది. అలాగే భూగర్భ జలాల నిర్వహణ పగడ్బందీగా నిర్వహిస్తున్న తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖకు క్యాటగిరి 3 కింద ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ 4 క్యాటగిరీ కింద అవార్డుకు ఎంపికైంది. కేంద్ర జల సంఘం కేంద్ర భూగర్భ జల బోర్డు స్టడీ చేసి ఈ పురస్కారాలను ప్రకటించారు. సెప్టెంబర్ ఇరవై ఐదవ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఈ అవార్డులను ప్రధానం చేశారు.

జాతీయ స్థాయిలో మిషన్ భగీరథకు అవార్డు రావడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషికి గుర్తింపు లభించినట్టు అయిందన్నారు. తెలంగాణలో మహిళలు తాగు నీటి కోసం పడే కష్టాలను తొలగించటంతో పాటు ప్రతి ఒక్కరికి సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ పథకాన్ని చేపట్టిందన్నారు.

దేశం లోని ప్రతి ఇంటికీ తాగు నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆగస్టు పదిహేనున ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాగు నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ బృహత్తరమైన మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏజెన్సీ ప్రజలు కలుషిత నీటిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రూపకల్పన చేశారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. గోదావరి జలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా అందించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టారు.