అన్నాహజారే దీక్షలతో అవినీతి అంతం సాధ్యమేనా?
posted on Jan 31, 2015 10:09AM
.jpg)
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మళ్ళీ మరోమారు ఉద్యమానికి సిద్దం అవుతున్నారు. ఇదివరకు జనలోక్ పాల్ బిల్లు కోసం డిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేసి యూపీఏ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఆయన, ఈసారి జనలోక్ పాల్ బిల్లుతో బాటు విదేశాలలో ఉన్న నల్లధనం వెనక్కి రప్పించే అంశం కూడా జోడించి మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారు.
క్రిందటిసారి ఆయన డిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి ఆయనతో చర్చలు జరిపి లోక్ పాల్ బిల్లు ఆమోదించింది. కానీ అది అవినీతిని అరికట్టేవిధంగా లేదని, చాలా లోప భూయిష్టంగా ఉందని, ఆయన దానిని తిరస్కరించారు. కానీ ఎందువలనో అయన మళ్ళీ వెంటనే ఉద్యమించలేదు. తన ఉద్యమాన్ని దేశమంతా వ్యాపింపజేస్తానంటూ ఆయన దేశాటన చేసారు. నిజానికి ఆయన డిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేసినప్పుడే యావత్ దేశంలో ఒక చైతన్యం ఏర్పడింది. ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం కూడా ఏర్పడింది. కానీ అంత గొప్ప ఉద్యమం సృష్టించిన తరువాత ఆయన తన లక్ష్యం నెరవేరే వరకు కొనసాగించకుండా మధ్యలోనే నిలిపివేసి దేశాటనకి బయలుదేరడంతో ఆ ఉద్యమం దేశమంతా విస్తరించకపోగా చప్పున చల్లారిపోయింది. కారణం ఆయన చేస్తున్న ఉద్యమానికి ఒక దశాదిశా లేదని ప్రజలు భావించడం వలననే కావచ్చును.
తనతో ఉద్యమించేవారు రాజకీయాలకు, పదవులు, అధికారానికి దూరంగా ఉండాలనేది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ కారణంగానే ఆయన తన ఉద్యమం ద్వారా వచ్చిన గుర్తింపుని ఎన్నికలలో పోటీ చేసి సొమ్ము చేసుకోవాలనుకోలేదు. ఆయన ఆలోచనలు, ఆశయాలు చాలా గొప్పవి కావచ్చు, కానీ అవి నేటి పరిస్థితులకి సరిపోవు. వాస్తవిక పరిస్థితులని, వర్తమాన రాజకీయ తీరు తెన్నులని బట్టి ఆయన కూడా తన ఉద్యమ తీరుతెన్నులు మార్చుకొని ముందుకు సాగుతూ అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ వంటి నిజాయితీపరులయిన వారిని ఎన్నికలలో నిలబెట్టి వారిద్వారా తన అంతిమ లక్ష్యమయిన అవినీతి నిర్మూలన చేసి ఉండి ఉంటే ఈరోజు దేశ రాజకీయాలు మరొకలా ఉండేవేమో? కానీ ఆయన అందుకు నిరాకరించడంతో ఆయన శిష్యులు చాలా మంది ఆయనకు దూరమయ్యారు. ఎన్నికలలో పాల్గొని ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేరు కూడా. పైగా కిరణ్ బేడీ ఆయన వ్యతిరేకిస్తున్న బీజేపీలోనే చేరారు కూడా.
అయితే అందుకు వారిని కాక ఆయననే నిందించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్దతిలో రాజ్యాంగబద్దంగా అధికారం చేప్పట్టి అవినీతిని నిర్మూలించే అవకాశం ఉన్నప్పటికీ, అది చాలా నేరం అన్నట్లుగా ఆయన భావించడం, తన ఆలోచనలను తన శిష్యులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం వలననే వారు ఆయనకు దూరమయ్యారు. అడవుల్లో ఉండే మావోయిష్టులు సాయుధపోరాటాల ద్వారా సమాజంలో మార్పు సాధిస్తామని చెపుతుంటారు. కానీ దశాబ్దాలుగా పోరాడుతున్నా వారు సాధించింది ఏమీ లేదు. అన్నా హజారే చేప్పట్టిన ఉద్యమం సాగుతున్న తీరు కూడా ఇంచుమించు అలాగే ఒక దశాదిశా లేకుండా సాగుతోంది.
ఆయన మళ్ళీ ఇప్పుడు డిల్లీలో నిరాహారదీక్షలు చేసి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్దమవుతున్నారు. కానీ ఈ పని ఇన్ని నెలలుగా ఎందుకు చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పవలసి ఉంటుంది. త్వరలో డిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆయన మాజీ శిష్యులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ఇరువురిలో ఎవరో ఒకరు దానిలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కనుక ఆయన డిల్లీలో దీక్షలు చేసినట్లయితే వారికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిన వారవుతారు. కనుక అందుకే మళ్ళీ డిల్లీలో దీక్షలకు కూర్చోంటున్నారనే తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది తప్ప ఆయన కొత్తగా సాధించేదేమీ ఉండకపోవచ్చును. ఎందుకంటే ఈసారి దేశప్రజలు ఆయన ఉద్యమాన్ని ఇంతకు ముందులాగ పట్టించుకోకపోవచ్చును. ఒకవేళ పట్టించుకొన్నా మోడీ ప్రభుత్వం తనకు ఇబ్బంది లేకుండా నేర్పుగా వ్యవహరించి ముగింపజేయవచ్చును.
పదేపదే లక్ష్య సాధన చేయలేని ఉద్యమాలు చేయడం వలన ప్రజలకు వాటి మీద నమ్మకం పోతుంది. నల్లధనం, జన లోక్ పాల్ బిల్లు అంశాలు రెండూ కూడా చాలా సంక్లిష్టమయిన వ్యవహరాలు. వాటిని అన్నా హజారే ఉద్యమాల ద్వారా సాధించగలనని భావించడం సరికాదు.