ఏపీలో శాశ్వత హైకోర్టుకు స్థలం గుర్తించండి
posted on May 16, 2015 12:10PM

ఉమ్మడి హైకోర్టును విభజించాలని తెలంగాణ న్యాయవాదులు ఎప్పటినుండో కోరుతున్నారు. అయితే హైకోర్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు నిర్మించేంత వరకూ ఇక్కడే కొనసాగుతుందని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాశ్వత హైకోర్టు ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారో స్థలాన్ని గుర్తించి దానిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించాలని ధర్మాసనం వెల్లడించింది. తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో సంప్రదించి స్థలం ఎంపికపై సీజే ఓ నిర్ణయం తీసుకునే వీలుంటుందని, ఈ ప్రక్రియ ఆరునెలలో పూర్తి కావాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన అంశాలు
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి పరస్పర సంప్రదింపులతో హైకోర్టు భవనం, పరిపాలన భవనం, న్యాయమూర్తుల, అధికారుల గృహ సముదాయాలు, హైకోర్టు సిబ్బంది క్వార్టర్లు మొదలైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి.
* హైకోర్టు ఏర్పాటు కోసం నిధుల కేటాయింపు, విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
* శాశ్వత హైకోర్టు ఏర్పాటయ్యేవరకూ 1956 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 51 (3) ప్రకారం తాత్కాలికంగా హైకోర్టు బెంచీలను ఏర్పాటు చేసే విషయంలో ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో చర్చించి రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి.