ఎంపీల..ఘీంకారాలు...ఏం సాధించాలని?

 

 

 

ఆ పార్టీ అధ్యక్షురాలేమో రాష్ట్రాన్ని ముక్కలు చేసే విషయంలో మరో మాట లేదంటారు. ఆ పార్టీ ఎంపీలేమో ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వబోమంటారు. ఒకవైపు విభజన బిల్లు మీద చర్చ జరగాలంటారు. మరోవైపు ఆ బిల్లును రాష్ట్రపతి తిప్పి పంపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూంటారు. తాము రాజీనామా చేశామని అయితే స్పీకరు ఆమోదించకపోతే తామేం చేయగలమంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తారు. మిన్ను విరిగి మీదపడినా విభజనను ఆపి తీరుతామని నిబద్ధత ఒలకబోస్తారు. ఇవన్నీ చెప్పింది ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాంగ్రెస్‌ ఎంపీల గురించే. ఓ వైపు విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే వీరు మాత్రం తమ డాంబికాలతో జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. తాజాగా ఆదివారం వీరిలో ఓ 5గురు ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. తమ వాదన వినిపించారు. వీరి వాదనను ప్రణబ్‌ సావధానంగా విన్నారని, రాజ్యంగప్రకారం విభజన అనే విషయంలో సానుకూలంగా స్పందించారని వీరు బయటకు వచ్చి మీడియాతో చెప్పారు. అయితే కొంతకాలంగా ఈ కాంగ్రెస్‌ ఎంపీల ప్రకటనల్లోని డొల్లతనాన్ని అర్థం చేసుకుంటున్నారు కనుక జనం ఏమీ నమ్మలేదనుకోండి.


తొలిసారి డిసెంబరు 9న విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి పరిశీలిస్తే గత 3 సంవత్సరాలుగా తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడడంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల ప్రకారం నడుచుకోవడంలో వీరు విఫలమైన సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రాంత నేతలు ఒకటే మాట మీద ఉండి తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే ఊరుకోమని, పార్టీ మారడం తధ్యమని అధినేత్రిని పదునైన పదజాలంతో, చేష్టలతో హెచ్చరిస్తుంటే... వీరు మాత్రం స్వంత వ్యాపారాల్లో, లాబీయింగుల్లో, లాలూచీల్లో తలమునకలైపోయి తెలంగాణ విషయం మీడియా ప్రస్తావించినప్పుడల్లా ‘అధిష్టానం ఎలా చెబితే అలా ఓకె’ అంటూ పరోక్ష అంగీకారాన్ని చెబుతూ వచ్చారు. అదే విధంగా సీమాంధ్రలో జగన్‌ తమ పార్టీని చీలుస్తున్నా...చీల్చి చెండాడుతున్నా పట్టించుకోకుండా జగన్‌పార్టీ ఎదుగుదలకు మూగసాక్షులుగా నిలిచారు. అవినీతి కేసుల మీద జైలుపాలైన వ్యక్తిని విమర్శించడం మాని పరోక్ష మధ్ధతు తెలియజేస్తూ... చేజేతులా తమ పార్టీ నాశనాన్ని కొనితెచ్చుకున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన అధిష్టానం... ఎన్నికలవేళ ఎలాగోలా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మరో దారి లేక విభజనకు పచ్చజెండా ఊపేసింది.



    సరే... ఇంతవరకూ జరిగిందేదో జరిగింది. విభజన నిర్ణయం తర్వాతైనా సరిగా స్పందించారా అంటే అదీ లేదు. నిర్ణయం జరిగిన కొన్ని రోజుల తర్వాత అది కూడా ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగసిన తర్వాత... హడావిడిగా ప్రెస్‌మీట్లు పెడుతూ... తొలుత ఇది జస్ట్‌ కేవలం ప్రకటనే కదా అన్నారు. ఆ తర్వాత సీడబ్యూసీ తీర్మానమే కదా అన్నారు... ఆ తర్వాత బిల్లు రాష్ట్రపతికి వెళ్లాలికదా అన్నారు. ఆనక అసెంబ్లీకి రావాలి కదా... ఇప్పుడేమో తిరిగి రాష్ట్రపతి ఆమోదం పొందాలి కదా..... అంటూ జనాల్ని వెర్రివెంగళప్పలు చేద్దామనే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. పైగా ఇదంతా అయ్యాక అప్పుడు వచ్చి ఉద్యమిస్తారట. (ఇది అంటోంది కూడా అందరూ కాదు కొందరే) అయినా తమ పార్టీ రాజకీయం కోసమే ఈ విభజనకు పాల్పడిరదంటున్న నేతలు అధినేత్రిని పల్లెత్తుమాట అనకపోవడంలోని అంతర్యం ఏమిటి? అనైతికంగా ఓట్లు  సీట్లు తెచ్చుకోవడం, లాలూచీ పడడం ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్న వైనాన్ని పూర్తిగా బయటపెట్టడానికి జంకు దేనికి?



    కొద్దో గొప్పో వీరు చెప్పుకోగలుగుతున్నది అవిశ్వాసతీర్మానం గురించి మాత్రమే. అయినా స్వంత పార్టీ మీద అవిశ్వాసం పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని ఎవరూ ఆశించలేదు. ఇక ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎం.పీ సబ్బం హరి ఏమంటారంటే...‘‘మూడేళ్ల క్రితం అయితే విభజన సాఫీగా జరిగిపోయేదే’’నని. మరో ఎం.పి ఉండవల్లి ఏమంటారంటే... కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం వల్ల తమకు రాజకీయభవిష్యత్తు లేకుండా పోయిందని... ఈ మాటలు వింటుంటే... వీరు విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఉందా? లేకపోతే తమకు రాజకీయంగా నష్టం కాబట్టి తప్పదు కాబట్టి మాట్లాడుతున్నట్టు ఉందా? ఒకవైపు ఆమ్‌ఆద్మీ లాంటి పార్టీలను గెలిపిస్తూ... దేశవ్యాప్తంగా జనం తమ తెలివిడిని తాము నిరూపించుకుంటున్నా.... మన రాష్ట్రంలోని రాజకీయనేతలు మాత్రం ఇంకా జనం చెవుల్లో పూలు పెట్టగలమనే ధీమాతోనే ఉండడం నిజంగా... వారి అజ్ఞానానికి నిదర్శనం.