వందేళ్ల పార్టీ... వాడి‘పోయింది’...

 

 

 

ఎవరైనా చనిపోతే నూరేళ్లూ నిండాయంటూంటాం. కాంగ్రెస్‌పార్టీ కూడా ఇప్పుడు అదే పరిస్థితికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆవిర్భావదినోత్సవం జరుపుకుంటున్న ఆ పార్టీ నిజానికి జరుపుకోవాల్సింది ముగింపోత్సవాలే. వందేళ్ల చరిత్ర తమకుందంటూ గప్పాలు కొట్టుకునే ఆ పార్టీ... ప్రస్తుతం ఉన్నంత ఘోరమైన పరిస్థితిలో ఎప్పుడూ లేదనేది నిస్సందేహం. విచ్చలవిడిగా కార్పొరేట్‌, రాజకీయ అవినీతికి బాటలు పరిచి, అధికారవ్యవస్థను వ్యాపారుల చేతిలో కీలుబొమ్మగా మార్చి ప్రజలను కేవలం ఓటుబ్యాంకులుగా, ఒక కుటుంబాన్ని అధికారంలో ఉంచడానికి ఉపయోగపడే పావులుగా వాడుకుంటూ... వారసత్వరాజకీయాలే దేశానికి శరణ్యంగా మార్చింది. తద్వారా పరోక్ష రాజరికాన్ని దేశప్రజలపై రుద్దింది.

 

 

సరిగా గమనిస్తే ఈ మధ్యే కాదు... గత కొన్నేళ్లుగా ఆ పార్టీ ప్రాభవం నామమాత్రమైపోయిన వాస్తవం స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక పాలన పుణ్యమాని పుట్టుకొచ్చిన చిన్నా చితకా పార్టీలు ప్రజలకు మిగిలిన దిక్కుగా మారిన పరిస్థితికి కారణం వెదకాల్సిన కాంగ్రెస్‌... ఆయా ప్రాంతాల వారీగా పుట్టుకొచ్చిన పార్టీలతో అవసరార్థ పొత్తులు ఏర్పరచుకుంటూ ఏదో రకంగా అధికారంలో కొనసాగడానికి తపించింది. ఫలితంగా ఆ పార్టీ మరింతగా శుష్కించుకుపోయి ఇప్పుడు పూర్తిగా జీవఛ్చవమైంది. దేశంలోని సకల అవలక్షణాలకూ కారణమైన ఆ పార్టీ అధికారమే పరమావధిగా ఆడిన ప్రాంతీయ ఆటలు, వేసిన వెకిలి పన్నాగాలు ఇప్పుడు అదే పార్టీకి పెను శాపంగా మారి దాన్ని అంపశయ్య మీదకు చేర్చాయి.




అయినా ఇప్పటికీ ఆ పార్టీ  బుద్ధి తెచ్చుకోలేదని ఆంధ్రప్రదేశ్‌లో అది మొదలుపెట్టిన నీచ రాజకీయపు ఎత్తుగడలు స్పష్టం చేస్తున్నాయి. దశాబ్థాలుగా నానుతున్న సమస్యను తీర్చేస్తున్నట్టుగా నాటకమాడుతూ ప్రశాంతంగా జీవిస్తున్న తెలుగు ప్రజల మధ్య చిచ్చుకు కారణమైంది. ఒకో  ప్రాంతంలో ఒకో పార్టీని వెనుకనుండి రెచ్చగొడుతూ, తామనుకున్న నాయకుడిని దేశ ప్రధానిగా చేసేందుకు తహతహలాడుతోంది. ఇంత చేసినా ఆ పార్టీకి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ గౌరవం పెరగకపోవడం ప్రజల్లో దాని కుట్రల పట్ల పెల్లుబికుతున్న ఏహ్యభావానికి నిదర్శనం. అనుకున్నది సాధించడానికి తాను కూర్చున్న కొమ్మని సైతం నరుక్కోవడానికి వెనుకాడని ఆ పార్టీ నైజం ప్రజల చేత ఛీకొట్టేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ అధికారం ఎండమావేననేది కాంగ్రెస్‌కు తెలుస్తోందో లేదో కానీ... దేశాన్ని ఎన్నో రకాలుగా వెనుకంజ వేయించిన ఆ పార్టీని ఇక కోలుకోనివ్వబొమని జనం అంటున్నారు. హ్యాపీ బర్త్‌ డే టూ యూ కాంగ్రెస్‌.