గుత్తా లేఖపై జైరామ్ రమేష్ స్పందన

 

రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మొదటి నుండి పోరాడుతున్న వారిలో ఒకరు. నల్గొండ కాంగ్రెస్ యంపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధాని మోడీకి లేఖ వ్రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మొదట కాంగ్రెస్ పార్టీయే ప్రజలకు హామీ ఇచ్చిందని, దాని కోసం రాష్ట్రంలో, పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు పోరాటం చేస్తుంటే, ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధానికి లేఖ వ్రాయడం చాలా పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ గుత్తా లేఖ వ్రాయడం వ్యక్తిగతమని దానితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని సర్ది చెప్పుకొన్నారు. గుత్తా సంగతి కాంగ్రెస్ అధిష్టానం చూసుకొంటుందని రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు.

 

ఇంతవరకు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన యంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వహస్తాలతో ప్రధానమంత్రికి వ్రాసిన లేఖ వలన ఇప్పుడు కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగానే ఆయన చేత ఈ లేఖ వ్రాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ ఇప్పుడు ఎదురు దాడి చేయవచ్చును . ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పుడు, ఆ పార్టీ తమను ఏవిధంగా ప్రశ్నిస్తోందని బీజేపీ ఎదురు ప్రశ్న వేయవచ్చును. లేదా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతునప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ఎందుకు పోరాడుతోంది? ఒకవేళ మోడీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోతే అప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదేవిధంగా అడ్డు తగులుతారా? అని బీజేపీ ఎదురు ప్రశ్నిస్తే కాంగ్రెస్ వద్ద సరయిన సమాధానం ఉండదు.