సభ ఎలా జరుగుతుందో ఏంటో?

 

Jagan Samaikya Sankharavam, Samaikya Sankharavam, telangana state, hyderabad, ysr congress

 

 

హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైసీపీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభ ఎలా జరుగుతుందో ఏంటోనన్న టెన్షన్ ఆ పార్టీ శ్రేణులను పట్టి పీడిస్తోంది. వరదల కారణంగా సీమాంధ్ర నుంచి వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం వుంది. దాంతోపాటు వైసీపీ నాయకత్వం కూడా అక్కడే వుండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండంటూ సీమాంధ్ర కార్యకర్తలకు ఆల్రెడీ పిలుపు ఇచ్చింది. పైపైకి పిలుపు ఇచ్చినా బస్సుల్లో, రైళ్ళలో కార్యకర్తల్ని హైదరాబాద్‌కి భారీగా తరలించే ఏర్పాట్లు చేసింది.

 

అయితే వైసీపీ సమైక్య శంఖారావ సభ విషయంలో గుర్రుగా వున్న తెలంగాణ వాదులు ఈ సభకు ఆటంకం కలిగించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు వస్తున్న 50కి పైగా బస్సులను వరంగల్ జిల్లా వర్ధన్నపేట, జనగాం దగ్గర తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు, తెలంగాణ వాదులకు మద్య వాగ్వివాదం జరిగింది. అక్కడ బస్సుల్ని ఇంకా తెలంగాణ వాదులు వదల్లేదని తెలుస్తోంది. సభ సమయం మించిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఉపయోగం ఏంటన్న ఆలోచనలో బస్సుల్లోని వారు వున్నారు.



తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఇదేవిధంగా వైసీపీ బస్సులను తెలంగాణ ఉద్యమకారులు నిలిపివేసినట్టు  తెలుస్తోంది. ఇక రైళ్లలో బయల్దేరిన కార్యకర్తల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే వుంది. భారీ వర్షాల కారణంగా దాదాపు అన్ని రైళ్ళూ ఆలస్యంగా నడుస్తున్నాయి. దానివల్ల రైళ్ళలో వచ్చే కార్యకర్తలు సభకు సమయానికి చేరుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.



ఒంగోలు నుంచి, చిత్తూరు నుంచి వైసీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ళు హైదరాబాద్‌కి చేరుకున్నప్పటికీ, వైజాగ్‌లో ఏర్పాటు చేసిన రైలు భారీ వర్షం కారణంగా చివరి నిమిషంలో రద్దు కావడంతో ఉత్తరాంధ్ర నుంచి రావాల్సిన కార్యకర్తలు ఇక రాలేనట్టేనని అర్థమవుతోంది. ఒంగోలు, చిత్తూరు నుంచి వచ్చిన రైళ్ళలో కార్యకర్తల సంఖ్య చాలా తక్కువగా ఉండటం పార్టీ నాయకత్వానికి నిరాశను కలిగించినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమైక్య శంఖారావ సభ ఎలా జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నాయకత్వంలో ఏర్పడింది.