అంధగాడు సినిమా పోస్టర్ ను చించేసిన నారాయణ...ఎందుకో తెలుసా..?

 

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణకు చిర్రెత్తుకొచ్చింది.. అందుకే రాజ్ తరుణ్ నటించిన అంధగాడు సినిమా పోస్టర్ ను చించేశారు. ఇంతకీ మంత్రిగారికి... పోస్టర్ కు లింకేటబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... ఒంగోలు నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందస్తు సమాచారం లేకుండా  నగర సుందరీకరణ పనుల నిర్వహణను పర్యవేక్షించడానికి డీఎంఏ కన్నబాబుతో కలిసి వచ్చిన ఆయన ఎక్కడికక్కడ గోడలపై పోస్టర్లు అంటించి ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే నేరుగా కారు దిగి కొన్నింటిని తొలగించారు. అందులో రాజ్ తరుణ్-హెబ్బాపటేల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అంధగాడు' సినిమా పోస్టర్‌ కూడా ఉంది. ఈ పోస్టర్ ను స్వయంగా ఆయనే చించేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా పోస్టర్లు కన్పించకూడదని ఆయన కమిషనర్‌ను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఈనెల 5 నుంచి పోస్టర్‌ రహిత రాష్ట్రంగా ప్రకటించినట్లు ఆయన చెప్పారు. నిబంధనలు అతిక్రమించి అంటించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు.