బస్సు ప్రమాద దోషి ప్రభుత్వమే!

 

 

 

నలభై ఐదు నిండు ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలసిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా ఆ దుర్ఘటన మిగిల్చిన విషాదం మాత్రం ఇంకా రాష్ట్రాన్ని విడిచిపెట్టలేదు. ఆ ప్రమాదం గురించి వింటేనే మనసు బాధతో బరువెక్కుతోంది. ఇక ఆ ప్రమాదం కారణంగా తమవారిని కోల్పోయిన వారి పరిస్థితిని ఊహిస్తే మరింత బాధ కలుగుతోంది. బస్సు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి సంబంధించిన వివరాలను మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉంటే, ప్రమాదానికి కారకులైనవారి మీద ఆగ్రహం పెరిగిపోతోంది.

 

ఎన్నో బాధ్యతలు, జీవితం మీద ఎన్నో ఆశలు, ఎన్నో లక్ష్యాలు, వాటికోసం నిర్విరామ కృషి చేస్తున్న బంగారం లాంటి మనుషులు ఈ ప్రమాదంలో మాడిపోయారు. ఎవరి నిర్లక్ష్యానికో వాళ్ళు మూల్యం చెల్లించారు.  ఈ ప్రమాదానికి బాధ్యులుగా, దోషులుగా బస్సు యజమాని, డైవర్లని నిలబెడుతున్నప్పటికీ ఈ ప్రమాదంలో అసలైన దోషి ప్రభుత్వమే! రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసే నిబంధనలు చాలా వున్నాయి. కానీ, వాటిని సక్రమంగా అమలు చేసే అధికారులే లేరు. అధికారులను నియంత్రించగలిగే ప్రభుత్వమే లేదు. లంచం ఇస్తేచాలు ఏ పనైనా జరిగిపోయే ఈ దేశంలో ప్రభుత్వ వ్యవస్థల నుంచి మంచి పనితీరును ఆశించడం దురాశే అవుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికారుల తీరు చూస్తుంటే వారిమీద వున్న అసహ్యం మరింత పెరుగుతోంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రైవేట్ బస్సులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేశారు. తామేదో ఘనకార్యం చేసేస్తున్నట్టు బస్సుల్లో వున్న లోపాలను పసిగట్టారు. కొన్ని బస్సులని సీజ్ చేశారు. కొన్ని బస్సులకు జరిమానాలు విధించారు. ఇప్పుడు ఘోర ప్రమాదం జరిగింది కాబట్టి ఈ హడావిడి. ఆ తర్వాత అంతా మామూలే. 45 మంది ప్రాణాలను పణంగా పెట్టిన తర్వాత అధికారులు చేస్తున్న  ఈ హడావిడిని ఎవరూ హర్షించరు. ఈ సిన్సియారిటీని ప్రతిరోజూ ప్రదర్శిస్తే మొన్న 45 నిండు ప్రాణాలు బలయ్యేవి కావు. ఈ రెండుమూడు రోజుల్లో అధికారులు ప్రైవేట్ బస్సులకు సంబంధించిన చాలా కొత్త విషయాలు కనుక్కున్నట్టు అమాయకంగా చెబుతున్నారు.




ప్రైవేట్ ట్రావెల్స్ అతిక్రమిస్తున్న నిబంధనల్లో కొన్ని ఇవి.. 1. ఒకే నంబరుతో  వివిధ రూట్లలో రెండు మూడు బస్సులు తిరుగుతాయి.  అంటే ఒక బస్సుకే పన్ను కట్టి చాలా బస్సులు నడుపుతారు. 2. పర్మిట్, ఫిట్‌నెస్ లేకపోయినా బస్సులు నడుస్తాయి. 3. అనుమతి తీసుకున్న సీట్లు, బెర్తుల సంఖ్య కంటే ఎక్కువ ఏర్పాటు చేస్తారు. దానివల్ల బస్సులో లోడ్ పెరుగుతుంది. 4. బస్సులలో ఇద్దరు డ్రైవర్లు వుండాలి. కానీ ఒక్కరే ఉంటున్నారు. అలసిపోయిన డ్రైవర్లు ప్రమాదానికి కారణమవుతున్నారు. 5. బస్సుల్లో వాణిజ్య వస్తువుల రవాణా జరుగుతుంది. ఈ వస్తువులలో ప్రమాదకరమైన వస్తువులు కూడా వుంటాయి. 6. బస్సుల్లో ఎక్కే, దిగే ప్రయాణికుల  వివరాలు నమోదు చేయడం లేదు. 7. పండుగల సమయంలో అయితే ప్రైవేట్ బస్సులలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తారు. 8. అనేక బస్సుల వేగానికి పరిమితి వుండటం లేదు. వీటన్నిటినీ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తారు. అలాంటి అధికారులను ప్రభుత్వం కూడా చూసీ చూడనట్టు వదిలేస్తుంది.