బీజేపీ తంటాలు చూతము రారండీ!

 

 BJP will change its Telangana stand, Telangana, Samaikyandhra, Narendramodi, 2014 elections

 

 

నిన్న మొన్నటి వరకూ స్టేట్‌లో భారతీయ జనతాపార్టీ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుంది. విభజనవాదం ముదరడానికి తనవంతు సహకారాన్ని అందించింది. కేంద్రం తెలంగాణ ఇవ్వబోతున్నట్టు ప్రకటించే వరకూ బీజేపీ ఒకేమాట మీద నిలబడింది. ఆ తర్వాతే బీజేపీలో రెండో కోణం బయటపడింది. అప్పటి వరకూ నోరు మెదపకుండా వున్న సీమాంధ్ర బీజేపీ నేతల్లో కదలిక బయల్దేరింది. వాళ్ళు సమైక్యవాదాన్ని వినిపించకపోయినా, తెలంగాణ రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రులకు న్యాయం జరగాలని నినదించడం మొదలుపెట్టారు.

 

 

బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణకి అనుకూలంగా వుంది కాబట్టి ‘సమైక్యం’ అనడం లేదుగానీ, సీమాంధ్ర బీజేపీ నాయకులలో రాష్ట్రం విడిపోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇదిలా వుంటే, తెలంగాణ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచనలోనే మార్పులు వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగినప్పటి నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం మోడీకి ఇష్టం లేదన్న ‘మెసేజ్’ రాష్ట్రంలో బాగా వ్యాపించింది.



తెలంగాణ రావడం వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదన్న వాస్తవం బీజేపీ అగ్రనాయకత్వానికి అర్థం కావడం వల్ల మెల్లగా తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ ఏదో ఒక మెలికపెట్టి బిల్లు పాస్ కాకుండా చేసే అవకాశం కూడా వుందన్న అభిప్రాయలు వెలువడ్డాయి. దాంతో తెలంగాణ బీజేపీ నాయకులలో ఆందోళన మొదలైంది. తెలంగాణ విషయంలో బీజేపీ మెత్తబడటం లేదన్న సందేశాన్ని ఇవ్వడం కోసం తంటాలు పడుతున్నారు.




ఆదివారం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి మొత్తం పరిస్థితి వివరించి మీరే ఏదైనా చేయాలని మొరపెట్టుకున్నారు. దాంతో రాజ్‌నాథ్ ‌సింగ్ అలాంటి అనుమానాలేవీ పెట్టుకోవద్దని, తెలంగాణ బిల్లుకి బీజేపీ నూటికి నూరుశాతం మద్దతు ఇస్తుందని అభయం ఇచ్చారు. ఇది చాలదన్నట్టు తెలంగాణలో బీజేపీ మీద నమ్మకం పెరగాలంటే సుష్మా స్వరాజ్‌ని నిజామాబాద్ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేయిస్తే తెలంగాణలో బీజేపీ పరిస్థితి బాగుంటుందని తెలంగాణ బీజేపీ నాయకులు రాజ్‌నాథ్ సింగ్‌ని కోరారు. దీన్ని కూడా పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ బిల్లుకి మద్దతు ఇస్తే తెలంగాణలో బీజేపీకి 10 పార్లమెంటు సీట్లు వచ్చేలా చేసే బాధ్యత తమదని తెలంగాణ బీజేపీ నాయకులు రాజ్‌నాథ్‌సింగ్‌కి వాగ్దానం చేశారట. తెలంగాణలో పట్టు నిలుపుకోవడం కోసం బీజేపీ నాయకులు ఇంకెన్ని తంటాలు పడాలో ఏంటో!