Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 3


    "తెలుగుదాన్నే"
    "కై అంటే అరవంలో అర్ధం తెలుసా"
    "చెయ్యండి"
    "నేను రాసింది - 'కై' అని కాదు. కాయ్ - తలకాయ్ అని రాశాను. నువ్వు 'తలకై' అని పాడుతున్నావు. అది తెలుగులో 'తలచెయ్యి' అని అర్ధం వస్తుంది. అది తప్పు - "ఏదీ ఒకసారి పాడు" అన్నారు.
    నా కెందుకో ఆ అవతారం చూస్తే చిరాకేసింది.
    "ఎందుకు సార్! టేకులో కరెక్ట్ గా పాడేస్తాను. మీరు లోపలికి వెళ్ళి వినండి" అన్నా.
    ఏమనుకున్నారో వెళ్ళిపోయారు. మానిటర్ అన్నారు.
    కరెక్టుగా పాడేశాను.
    "ఓ.కే. అలాగే పాడండని" లోపల్నుండి సౌండ్ ఇంజనీరన్నారు. "రెడీ ఫర్ ది టేక్" అని అరిచారు.
    తలుపులు మూసుకున్నాయి. బైట రెడ్ లైట్ వెలిగింది. "ఇంటర్ లాక్" అని ఇంజనీర్ పైన ఆపరేటర్స్ కి చెప్పారు.
    చలపతిరావు మమ్మల్నందర్నీ హెచ్చరించటంతోపాటూ ఉత్సాహపరచడానికి వచ్చి "అందరూ సరిగ్గా చక్కగా పాడెయ్యండి. ఒకే టేక్ లో ఓకే చేసేద్దాం". "పాడేస్తారా! టేక్ చేసేద్దాఁవా! త్వరగా ఇళ్ళకి పోవచ్చు". అనంరు.
    "అలాగే, కానీ చిన్నమాట" అన్నా.
    "ఏమిటీ?"
    మైకుముందే మాట్లాడేస్తున్నాను.
    అనుభవమూ చాలదు. తెలీదు కూడా.
    "ఇప్పుడొచ్చారే. ఎవరన్నయ్యా ఆ పిచ్చాయన? శివశివా! స్నానం అయినా చేసినట్లు లేదు. ఆ బట్టలు, అవతారం, మాటల్ని బట్టీ ఈ పాట ఆయన రాసినట్టుంది. ఆయన ఎవరట" - అని అడిగేశాను.
    వెంటనే అన్య మైకు ముందుకొచ్చి, ఒక చేత్తో దాన్ని మూస్తూ "ఓసి పెంకిపిల్లా! ఆయనెవరనుకుంటున్నావ్. మహాకవి శ్రీశ్రీ" అమ్మా అన్నారు. అంతేనండి. ఇక చూసుకోండి నా అవస్థ.
    పెద్ద పాండిత్యం లేకున్నా శ్రీశ్రీ పేరు నా నోట్లో ఊరిపోయిన పేరు. నాకాయన మీద చాలా అభిమానం, ఇష్టం కూడా వారి గేయాలు కంఠోపాఠం చేయకున్నా మరీ వుండరు. మా నాన్నగారు నేను కథాకాలక్షేపం చేస్తున్న రోజుల్లోనే నాచేత సాక్షి వాల్యూమ్స్, జ్ఞాన వాసిష్ట్యం, మహాభారతం, వేమన, సుమతీ వగైరా వగైరాలు చాలా చదివించారు. తెలుగులో కొంతవరకు ఫరవాలేదని అనుకోవచ్చు.
    శ్రీశ్రీ నాస్తికులైనా నా హృదయంలో దాచుకున్న దేవుడాయన. ఆయనే ఈయననేసరికి మతిపోయింది. కళ్ళు తిరిగాయి. కాళ్ళూ  చేతులూ గడగడ వణికిపోయాయి. నోట మాటరాలేదు. అసలే గాలి లేదేమో ముచ్చెమటలు పోసేశాయి. అక్కడే కుర్చీలో కూలబడిపోయాను.
    "రెడీ-రెడీ" అని అరుస్తున్నారు.
    నాకేమీ వినిపించినట్టులేదు.
    కళ్ళమ్మట నీళ్ళు నాకు తెలీకుండానే కారిపోతున్నాయి.
    "రెడీ రెడీ అని అరుస్తూ వుంటే మైక్ లో మీకేమీ వినిపించడం లేదా" అంటూ చలపతిరావుగారొచ్చారు. నన్ను హ్కోసి ఆశ్చర్యపోయారు.
    "సరోజా! ఏమయిందమ్మా ఎందుకేడుస్తున్నావు? ముఖం ఎందుకలాగైపోయింది ఏం జరిగింది చెప్పమ్మా" అన్నారు. చలపతిరావుగార్ని చూడగానే వెక్కి వెక్కి ఏడ్చేశాను! "ఆయనే శ్రీశ్రీ అని నాకు తెలీదన్నయ్యా! నోటికొచ్చినట్టు వాగేను. మైక్ లో నేను మాట్లాడింది విన్నారో ఏమో" అన్నాను.
    "సరేలే. చాదస్తం. శ్రీశ్రీ ఇలాంటివేమీ పట్టించుకోడు. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే రికార్డింగ్ అయినట్టే. లేలే. ముఖం కడుక్కురా" అని నన్ను తీసుకువెళ్ళి స్పెన్సర్ షోడా ఇచ్చి ముఖం కడుక్కోమన్నారు.
    "షోడాతో ముఖం కడుక్కోవడమా" అని అడిగేను.
    "అవును, ఫ్రెష్ గా ఉంటుంది త్వరగా".
    ఆయన చెప్పినట్టే చేశాను. ఎంత హాయిగా ఫ్రెష్ గా వుందో చెప్పలేను. జీవితంలో మొదటిసారిగా నాకు తెలియని విషయాన్ని తెలుసుకున్నాను. బాగుందనుకున్నా లోపలికి వచ్చాను.
    ఈ పళానా శ్రీ శ్రీ కాళ్ళమీద పడిపోతే బాగుండుననిపించింది. పోనీ
    కాళ్ళకయినా దండం పెడదామా అనుకున్నాను. అబ్బ ఇంతమందిలో ఛీఛీ వద్దు. ఏవఁయినా అనుకుంటారేమో! అయ్యో నమస్కారం అయినా చెయ్యలేకపోయానే అని విసుక్కున్నాను. తర్వాత క్షమాపణ కోరితే సరిపోతుందిలే అని సమర్ధించుకున్నాను. అయితే నేను శ్రీశ్రీ రాసిన పాట పాడుతున్నా  నన్నమాట. నాపాట శ్రీశ్రీ వింటున్నా రన్నమాట. అయితే ఇంకా బాగా పాడెయ్యాలి. మంచి పేరు తెచ్చేను కోవాలనిపించింది.
    "టేక్ వెళదామా" అన్నారు చలపతిరావుగారు.
    "ఒక టేక్ లో పాడేస్తాను. కానీ ఒక హెల్ప్. రికార్డింగ్ అయిపోగానే శ్రీశ్రీగారికి నన్ను పరిచయం చెయ్యాలి" అన్నాను.
    "నీ పిచ్చి పాడుగాను. సర్లే ముందు పాడు" అన్నారు.
    నావల్ల ఒక అరగంట వేస్ట్ అయిందేమో, ఒకే టేక్ లో అందరం పాడేశాం. రాణి - పిఠాపురం - మాధవపెద్ది వాళ్ళు ముగ్గురూ అనుభవం వున్నవాళ్ళే. ఎటూపోతే నేనే సరికొత్త. మాటదక్కింది. మరొక్క బిట్టు వుంది.
    సాయంకాలం 6 గంటలయ్యింది. టిఫిన్ బ్రేక్.
    బ్రేక్ టైమ్ లో చలపతిరావుగారు శ్రీశ్రీ ని పిలిచి....
    "ఈవిడ పేరు సరోజ. మ్యూజిక్ పరీక్షలు ప్యాసయింది. తెలుగు బాగా చదువుకుంది. బాగా రాస్తుంది. వాళ్ళ నాన్నగారి చాదస్తం వల్ల 8వ క్లాసు మూడేళ్ళు చదివి మూడుసార్లు పాసయ్యింది. వేరే స్కూల్లో వెయ్యలేదు. విజయనగరం వాస్తవ్యులు. బ్రాహ్మలు. ఉపద్రష్ట సూర్యనారాయణగారమ్మాయి. దాసుగారి కథలు బాగా చెప్తుంది. చాలా టాలెంట్స్ వున్నాయోయ్ శ్రీశ్రీ! హేండ్ రైటింగ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. "మృదంగం వాయిస్తుంది. వీణ, భరతనాట్యం అన్నీ నేర్చుకుంది" అని పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చారు.
    అవన్నీ విన్న శ్రీశ్రీ "ఆహా" అని మాత్రం అన్నారు.
    చలపతిరావుగారు వెంటనే ఓ తెల్లకాగితం తీసి, "ఇప్పుడు నువ్వు పాడిన పాట దీనిమీద రాయి" అన్నారు;.
    తర్వాత నాకు తెలిసింది. నా దస్తూరి ఎలా వుంటుందో చూడడానికి రాయమన్నారని.
    "ఇదిగోనయ్యా శ్రీశ్రీ! దస్తూరీ కూడా బాగానే వుంది. మీ పిక్చర్స్ లో సెన్సార్ స్క్రిప్ట్ కో-పాటలకో అవకాశం వుంటే చూడండి" అన్నారు రిప్లయి ఏమీ రాలేదు.
    "నమస్కారమండీ!" అనేసి నేను థియేటర్ లోపలికి వెళ్ళిపోయాను. ఆ రోజు ఏమీ తినాలనిపించలేదు. కాఫీ మాత్రం తాగాను.
    శ్రీశ్రీతో మాట్లాడాలనిపించింది. కానీ బెల్లం కొట్టిన రాయిలా ఆయన నోరు విప్పందే! ఇవతలివారు అరగంటసేపు వాగితే "ఊ-అ-ఆహా" అని మాత్రం, అదికూడా అవసరం అయితేనే అంటున్నారు. అప్పటికీ, ప్రయత్నలోపం చెయ్యలేదు కానీ - ఆ హడావుడిలో అవకాశం చిక్కలేదు. రాత్రి 8 గంటలకి రికార్డింగ్ అయిపోయింది. అందర్నీ కార్లలో ఇళ్ళకి పంపుతున్నారు. మాకు ఓ పెద్ద కారిచ్చారు. నేనూ, రాణీ, మా అమ్మ, మాధవపెద్ది వెనక సీట్లో కూర్చున్నాం. ముందుసీట్లో పిఠాపురం - మరో ఆయన - కూర్చున్నారు. కారు స్టార్ట్ అయ్యేదాకా నేనా విషయం గమనించనేలేదు.
    "శ్రీశ్రీగారూ!" అనే మాధవపెద్ది పిలుపుతో గతుక్కుమన్నాను.
    
                             *    *    *
              

                          

    
    నా గుండెలో రైలు పరుగెడుతోంది. శ్రీశ్రీగారు కూడా నేను కూర్చున్న కారులోనే వున్నారా? అంటే మాతోపాటే వస్తున్నారన్నమాట. ఉక్కిరిబిక్కిరైపోయాను.
    ఒకవైపు సంతోషం! మరోవైపు గాభరా - భయం! ఈసారి మాత్రం ఛాన్సు వదలకూడదు.
    శ్రీశ్రీగార్ని పలకరించి, అలాగే మన విషయాలు కూడా కొన్ని చెప్పుకుందాం. ఇంటికి చేరుకొనేసరికి సునాయాసంగా అరగంట పైమాటే! కానీ - నోరు మెదపలేకపోతున్నానే!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS