Previous Page Next Page 
శారద పేజి 2


    దీన్ని లోకంకూడా ఆమోదించదు. ఏ పనిచేసేటప్పుడైనా ముందుగా ఆలోచించాలి. ఈ మాట మా నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు. కానీ నేనెంత అసమర్ధురాలనో ఇప్పుడు తెలుసుకున్నాను. ఫలితాన్ని ముందుగా ఊహించాల్సివుంది."

    "నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని నమ్మవా?"

    ఈసారి చిన్నక్క ముఖం స్పష్టంగా కనబడుతుంది. ఆమె నీరసంగా నవ్వి అంది "నమ్మాను కాబట్టే ఇంత ప్రాధేయపడుతుంది. మన సంగతి ఎవరికీ తెలియనందుకు సంతోషిద్దాం."

    "కానీ నేను నిన్ను విడిచి వెళ్ళలేను."

    "అసలీ రాత్రివేళ ఇక్కడికెందుకు వచ్చావో చెప్పు?" అంది చిన్నక్క.

    "ఏదో ఒకటి తేల్చుకోవడానికి."

    "దానికి అర్ధం అడుగుతున్నాను."

    "నిన్ను విడిచి నేను బ్రతకలేను. కానీ నన్ను పెళ్ళి చేసుకోవడానికి మీ ఇంట్లో అంగీకరించరు. ఎందుకు భ్రమపడతావ్ శారదా? మరెవర్నో పెళ్ళాడి నువ్వూ సుఖపడలేవు. మనమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా!"

    చిన్నక్క మాట్లాడలేదు. నవ్వి ఊరుకుంది.

    "నవ్వుతావేం?"

    "ఈ విషమ పరిస్థితిలో కూడా మన ఇద్దరిలో స్వార్ధం ఎలా పనిచేస్తోందా? అని."

    "స్వార్ధమా? తెలిసే మాట్లాడుతున్నావా?" అన్నాడు కోపంగా వాడు.

    "ఏమీలేదు, నీ స్వార్థంకోసం నువ్వు నన్ను రమ్మంటున్నావు. నా స్వార్ధం కోసం నేను రానంటున్నాను"

    "అవును" అన్నాడు కసిగా వాడు. "త్యాగం అని భ్రమసి జీవితాంతం కుళ్ళితే ఫలితంలేని పొగడ్తలు దక్కుతాయి."

    "ప్రసాద్! ఇన్ని మాటలెందుకు? నా మానాన నన్నిలా బ్రతకనియ్యి. నేను పెద్దవారికి ఎదురుచెప్పలేను. రేపో మాపో నా పెళ్ళి అయిపోతుంది. ఇవాళ వచ్చినవ్యక్తితో పెళ్ళయిపోతుంది. కాపురానికి వెళ్ళిపోతాను. నువ్వూ ఎవరినైనా పెళ్ళి చేసుకోమని నేను సలహా ఇవ్వక్కరలేదు. నీ పాదాలు పట్టుకుంటాను. ఇహ వెళ్ళిపోవా?"

    "శారదా!" అని అక్కయ్య చేతులు పట్టుకున్నాడు. "ఇంత కఠినంగా మారిపోయావేం? ఆ ప్రేమమాటలన్నీ ఏమయిపోయాయి?"

    చిన్నక్క సున్నితంగా వాడిపట్టు విడిపించుకుంది. "పెళ్ళికాని స్త్రీ నోటినుంచి ప్రేమ మాటలు వెలువడితే అందులో అబ్బురమేముంది? కానీ నేడో రేపో గృహిణి కాబోతున్న యువతినుంచి ఇంకా అవే మాటలు ఆశించటం హేయం."

    "శ్రీరంగనీతులు బాగా నేర్చావే?"

    "నాకు ఇహ మాట్లాడే ఓపికలేదు. నామీద దయ వుంచి వెళ్లిపో!"

    "కానీ నీ చేతలకు తర్వాత పశ్చాత్తాపపడతావు. నన్ను చూడాలని తహ తహ పడేరోజు ఎప్పుడో ఒకసారి రాకపోదు."

    "రాదనే నా నమ్మకం" అంది చిన్నక్క ముఖం ప్రక్కకు త్రుప్పుకుని.

    "ఆడదాని నోటికి హద్దేమిటి?" అని వాడు కోపంతో నాలుగడుగులు వేసి "కానీ ఈనాడు నువ్వు నాకు చేసిన సత్కారాన్ని జీవితాంతం మరచిపోను. చివరకు నన్ను స్వార్ధపరుడిగా కూడా నిందించావు. నేను పడే బాధలో వెయ్యో వంతయినా అర్ధం చేసుకునివుంటే నువ్వీనాడు ఇలా మాట్లాడి వుండేదానివి కాదనుకుంటాను. సరే! ఏనాడైనా నేను కుర్రాడిగా, దౌర్భాగ్యుడిగా కనబడటంగానీ, వినబడటంగానీ తటస్థిస్తే అప్పుడుకూడా ఒక కన్నీటిబొట్టు రాల్చమాకు" అంటూ విసవిస నడిచి వెళ్ళిపోయాడు.

    "ఒక్కమాట" అంది చిన్నక్క హీనస్వరంతో.

    "ఏమిటి? ఇంకేదైనా కరుకుమాట మిగిలిపోయిందా?" అన్నాడు వెనుదిరిగి.

    చిన్నక్క సమాధానం ఇవ్వకుండా, తొందరగా మూలనున్న పెట్టెదగ్గరకు వెళ్ళి తెరిచింది. చీరెలు, బట్టలు అన్నీ వెదికి ఒక ఫోటోని వెలికితీసింది.

    "ప్రసాద్!" అంది. ఆమెకంఠం తడబడుతోంది. "ఈ ఫోటో నీదే. ఇహ నేను దాచుకోలేను. తీసుకెళ్ళిపోవూ!"

    వాడిముఖం కళావిహీనమైపోయింది. నెమ్మదిగా దగ్గరకు వచ్చి గాద్గదిక కంఠంతో "నా ఫోటోమీద కూడా నీకసహ్యం జనించిందా?

    చిన్నక్క తల విదిలించింది. "ప్రశ్నకు నన్ను జవాబడగకు. నాకోర్కెను మాత్రం మన్నించు" అంది, అదే హీనకంఠంతో.

     చూస్తూ చూస్తుండగానే వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. "ఇటు తే" అన్నాడు. చిన్నక్క ఫోటో అందించింది. వాడు దాన్ని కసిగా ముక్కలు ముక్కలుగా చింపివేసి, "ఈ ముక్కలుచూసి సంతోషించు" అని అరిచి గబగబ అక్కడ్నుంచి తలుపులు తెరుచుకుని వెళ్ళిపోయాడు. వాడిమీద అసూయతో, అసహ్యంతో చిన్నహృదయం తల్లడిల్లిపోయింది. వీడెవడు? ముక్కూ మొహం ఎరుగనివాడు వచ్చి తన అక్కగారిని బెదిరించడానికి? చేసేదిలేక మళ్ళీవచ్చి కిటికీలోంచి చూశాడు. ఇదేమిటి, చిన్నక్క? ఛ! ఆ ఫోటో తుంపులన్నీ ఎందుకు ఏరి దగ్గరకు చేరుస్తోంది? ఓపిగ్గా చూస్తున్నాడు. వాటినన్నిటినీ ప్రోగుచేసి చేతుల్లోకి తీసుకుంది. అక్కున చేర్చుకుంది. అయ్యో! చిన్నక్క ఇంత విపరీతంగా ప్రవర్తిస్తుందే? తేరిపారజూశాడు. ఆమె కళ్ళల్లో నీటిబిందువులు. అతికష్టంమీద దుఃఖం ఆపుకుంటున్నట్లుగా వుంది. వాటిని అలాగే రెండు చేతుల్తోనూ తీసుకు వెళ్ళి గోడ అవతల జారవిడిచింది. తిరిగివచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ చేతుల్తో ముఖాన్ని కప్పుకుని మంచంమీద వాలిపోయింది.   

    రవికి ఏడుపు వచ్చింది. తన చిన్నక్క ఏడుస్తోంది. ఒక పాపాత్ముడు వచ్చి ఆమెను ఏడ్పించి వెళ్ళాడు. తను పెద్దయ్యాక వాడెప్పుడైనా కనబడితే చావచితకతన్నడం ఖాయం. కానీ వాడిని వెళ్ళగొట్టింది చిన్నక్కే కదా! ఎంచేత తిరిగి దురపిల్లుతోంది? ఎందుకనోగానీ వాడికి ఆ సమయంలో ఓదార్చడానికి ఆమె ముందుకుపోయి నిలబడకూడదని తోచింది. అది చాలా తప్పనీ, దానివల్ల ఎంతో అనర్ధకం వాటిల్లవచ్చుననీ భావించాడు. అంతేకాక ఆ చిన్న హృదయానికి ఇంకా ఏమిటోకూడా అర్ధమైనట్లు తోచింది. చిన్నక్కకు ఈ జరగబోయే పెళ్ళివల్ల ఏమీ సుఖం వుండబోదు. ఒక్క ఆమెకేకాదు, తనకూ వుండదు. పెళ్ళికొడుకు నల్లగా, సిద్దెగా వున్నాడు. వాడికి ఈమెను యిచ్చి పెళ్ళి చేయకూడదు. ఇలా ఆలోచించుకుని వాడు ఏమీ సవ్వడి చెయ్యకుండా క్రిందకువచ్చి తన ప్రక్కమీద పడుకున్నాడు. చాలా రాత్రివరకూ అటూఇటూ పొర్లుతూ అవస్థపడుతూనే వున్నాడు.

    ఆ మరునాడు చిన్నక్క మొహంలోకి చూచినప్పుడు ఎర్రబారి, నిగారించి వుండటం కనిపెట్టాడు. కానీ ఈ విషయం ఇంట్లో మరెవరూ గుర్తించలేదు. పోయి ఆమెను కౌగలించుకోవాలనిపించింది. తాను ఆమె రహస్యం ఒకటి తెలుసుకున్నాడు. అది ఒకరికి చెప్పేదికాదని గ్రహించాడు. ఏ వ్యక్తి అయితే ప్రపంచంలో అందరికన్నా చనువుగా మాట్లాడుతుందో ఆ వ్యక్తితోకూడా తను రహస్యం పసిగట్టానని చెప్పటం సభ్యతకాదని ఊరుకున్నాడు. కానీ తనకు అర్ధంకాని ఏదో అనుభూతులకు లోనుకావటం మొదలుపెట్టింది మనస్సు. అది ప్రేమ, జాలి, సానుభూతి... చిన్నక్కకు ఈ ఇంట్లో ఏదో ఘోరాన్యాయం జరుగుతుంది. నోరువిప్పి వెలువరించలేదు. తాను తల్లితోగానీ, తండ్రితోగానీ ఈ అన్యాయాన్ని చెప్పి ఎదిరించలేడు. "ఎదిరించాలి" అనుకున్నాడు చాలాసార్లు. ప్రశ్న పెదాలవరకూ వచ్చింది. "ఛా! వెధవా, నోర్ముయ్" అంటారేమోనన్న భయంకలిగి ఊరుకున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS