Previous Page Next Page 
శారద పేజి 3


    ఒక్క విషయంమాత్రం మనసులో తొలిచివేయటం ప్రారంభించింది. చిన్నక్కది దగాపడిన జీవితం. ఈ రహస్యం కనిపెట్టిన ఏకైకవ్యక్తి తాను. ఆమెను కాపాడే శక్తి తనకు లేదు. కానీ దీనికి ప్రత్యుపకారం ఏనాడో ఒకనాడు చేసితీరాలి ఆమెకు. ఈ సంఘటన తర్వాత ఆమె అంటే వాడికి గల ప్రేమ అతిశయించటంలో అబద్ధం ఏమీలేదు.

    ఆ బాలుడి హృదయంలో చిన్నక్క శాశ్వతంగా స్థానం ఏర్పరచుకుంది.

                                           2

    ఓ రోజు సాయంత్రం ఆరుగంటల వేళప్పుడు ఓ యువతీ యువకుడు దగ్గర దగ్గరగా కూర్చుని మద్రాసుబీచ్ లో కబుర్లు చెప్పుకుంటున్నారు.

    "రవీ!" అందా యువతి. సాయంకాలం తేజస్సు ఆమె ముఖమండలం మీద ఎర్రగా, శోభగా మెరుస్తోంది.

    "రేపు వెళ్ళిపోవటం ఖాయమేనా?"

    ఆ యువకుడు సముద్ర తరంగాలవంక దృష్టిసారించి "ఈ కెరటాలు మన ఇద్దరినీ సమీపించకపోవటం ఎంత నిజమో రేపు నేను ఊరికి వెళ్ళటం అంత తథ్యం" అన్నాడు.

    "అటువంటి ఉపమానాలు మానివెయ్యి రవీ! నీ మాటలన్నీ ఎక్కడో గుండెల్ని ఛేదిస్తాయి. ఇది ఏమి మనస్తత్వమో నీది" అంది యువతి నిష్ఠూరంగా.

    రవి నవ్వాడు. "నీకు కోపం తెప్పించటం నాకు ఎంత సరదానో తెలుసా? చీకటిపడగానే కలువ కన్యలకు దర్శనం ఇవ్వటం జాబిల్లికి ఎంత సరదానో అంత!"  

    "మళ్ళీ వెంటనే వెన్నెలను చిగురింపజేస్తావు."

    "వెన్నెలనిచ్చేది చంద్రుడు. రవికాదు" అతను పెద్ద పెట్టున నవ్వాడు.

    ఆమె ముఖం ముడుచుకుని కూర్చుంది. యువకుడు ఆమెవంక సుందరంగా తిలకిస్తూ కూర్చున్నాడు. అట్లా చుట్టూనీళ్ళూ మధ్య భూమీ వున్న ద్వీపంలా చుట్టూ రొద, మధ్య నిశ్శబ్దంలా వాళ్ళు మరో సత్యాన్ని రుజువు చేస్తూ గడిపారు.

    "హల్లో శశీ!"

    ఇద్దరూ తలలు ఎత్తి చూశారు. మరో యువకుడు చిరునవ్వుతో పరికిస్తున్నాడు.

    "రావోయ్ చంద్రుడా!" అని ఆహ్వానించబడ్డాడు.

    "తప్పు. చంద్ర్ అని పిలవాలి."

    "ఆ ద్రు కూడా ఎందుకు? ఒక్క అక్షరంతోనే పిలుస్తాను. చైనాలో యిలానే చుయ్ అనీ, చయ్ అనీ పిల్చుకుంటారు."

    "సిమిలీలు మానవోయ్ మహానుభావా!"

    "అది సరే! పాస్ అవుతావా?" అన్నాడు రవి.

    "క్లాసు ఎక్స్ పెక్ట్ చెయ్యటంలేదు."

    చంద్రమోహనరావు తల ఊపాడు. తమ సంభాషణలో శశి కల్పించుకోకపోవటం గమనీయాంశం.

    "శశీ!" అన్నాడు చిన్నగా.

    శశి తల ఎత్తి చూసింది.

    "అలా బొమ్మలా కూర్చున్నావే?"

    "నేను ఎలా కూర్చుంటే ఏం లెద్దూ?" అని ఆమె నిర్లక్ష్యంగా తల ప్రక్కకి త్రిప్పి మరోవైపు చూడసాగింది. చంద్రమోహన్ కొంచెం చిన్నబుచ్చుకోవటం చూసి రవి ఖిన్నుడయ్యాడు.

    "అదేం మాట? మాకుకావాలి!" అని సమర్ధించాడు.

    "ఒక సిమిలీ వదిలెయ్యి."

    "స్త్రీల విషయం పురుషులకెలా అవసరమో అలాగ."

    ఒక నిముషం ఆశ్చర్యంగా ఎవరూ పెదవి కదల్పలేదు. తరువాత ముగ్గురూ ఒకేసారి ఫకాలుమని నవ్వారు.

 

    ఓ అరగంట గడిచాక శశి లేచి నిలబడింది. "నా మనసంత బాగాలేదు, సెలవిప్పిస్తారా?"

    "నాదేం లేదు, చంద్రుడి ఇష్టం."

    ఆమె మళ్ళీ కోపంతో బుస్సుమనడం ఎవరూ గమనించలేదు.

    "వెళుతున్నాను. గుడ్ నైట్!" అని చరచర అక్కడినుంచి నడిచి వెళ్ళిపోయింది. స్నేహితులిద్దరూ వంటరిగా మిగిలారు.

    "శశికి కోపం వచ్చినట్లుందే?"

    "ఆడవారికోసం కొంత అలంకారం, ఫాలభాగానికి కుంకుమలా. అయినా చంద్రం ఒకమాట చెబుతాను విను భాయ్! స్త్రీలు నిరసించినా, కోపగించుకున్నా శిలా విగ్రహంలా చలనంలేనివాడే ధీరుడు."

    చంద్రానికి ఈ ప్రసంగం అంత నచ్చక "నాకూ మనసేం బాగాలేదు. ఎ సినిమాకైనా వెడదం పద" అంటూ లేచాడు. రవి అతన్ని అనుసరించాడు.

    ఆ రాత్రి రవి ఇంటికి జేరేసరికి పదిగంటలు దాటింది. ఇంటి తలుపులు వేసివున్నాయి. ఇంటివారితో చెప్పకుండా వెళ్ళినప్పుడు పడే అవస్థకన్నా మరొకటి లేదు. అతనికి వెంటనే కన్నీళ్ళు గుర్తుకొచ్చాయి. ఫలితం అలవాటయినదే అయినా తలుపులు గుద్ధి, బాది చాలా అలసిపోయాడు. లోపలినుంచి యింటి యజమాని పెట్టే గుర్రు మాత్రం అతనికి స్పష్టంగా వినిపిస్తూనే వుంది. చాలాసేపు ప్రయత్నించి ఇహ లాభంలేక, వెనక్కి తిరిగాడు. రోడ్డుమీదకు వచ్చేసరికి రిక్షాలు కనబడ్డాయి. ఒకదాంట్లో ఎక్కి "పోనియ్యవోయ్!" అన్నాడు. ఎక్కడికో అడగకుండానే రిక్షాకూడా బయల్దేరింది. కొంతదూరం పోయాక రిక్షావాడికి కూడా అనుమానం వచ్చింది ఎటు పోవటమా అని. "ఎక్కడికి బాబూ?" అనడిగాడు.

    రవి క్షణంసేపు ఆలోచించాడు. తర్వాత ఏదో నిర్ణయం అతనిలో బలపడింది. "రాయపేట  పోనియ్యి" అన్నాడు. రిక్షా శరవేగంతో పరిగెడుతోంది. లోపల అతను నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ముఖమంతా కందగడ్డ అయిపోతుంది. మనస్సు అల్లకల్లోలం అయిపోతుంది. ఉద్రేకంతోనూ, ఉద్వేగంతోనూ అంతరంగం మిడిసిపడుతుంది. చాలా నిముషాలు గడిచాక ఎన్నో సందులూ, గొందులూ దాటాక, ఓ ఇంటిముందు ఆపాడు. దిగి డబ్బులిచ్చి పంపేశాక నెమ్మదిగా తలుపు తట్టి "రాగిణీ!" అని పిలిచాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS