Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 1


           కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత
                                                                        డాక్టర్ దాశరథి రంగాచార్య



                                    కృష్ణపక్షం

        వాగర్థా వివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే |
        జగతః పితరౌవందే, పార్వతీ పరమేశ్వరౌ ||

    ఇది ప్రార్థన. అర్థన అంటే అడగడం, కోరడం. ప్రార్థన చక్కగా, శుచిగా, శుభ్రంగా, పవిత్రంగా అర్థించడం. ఈ అర్థించడం ఎవరిని? ఉన్నవాణ్ణి - ఇవ్వగలవాణ్ణి. ఉన్నవాడు. ఇవ్వగలవాడు ఎవడు? సృష్టి, స్థితి, లయ కర్త పరాత్పరుడు. అంతా అతనిదే. ఈశా వాస్యమిదంసర్వం. అతడు చరాచర జగత్తుకు తల్లీ - తండ్రీ - 'త్వమేవ మాతాచ పితాస్త్వమేవ' బిడ్డ తల్లి రొమ్ము తంతుంది. ముఖం రక్కుతుంది. తల్లి కోపగించుకోదు. కొట్టదు. మురిసిపోతుంది. ముద్దాడుతుంది. అమృతం వంటి చనుబాలిస్తుంది. తనయ / తనయుడు లక్ష తప్పులు చేయును గాత. 'నాన్నా!' అంటే తండ్రి కరిగి పోతాడు. ఉన్నది సాంతం దోచి ఇస్తాడు.

    భగవానుడు ఈశ్వరుడు. సమస్తమూ అతనిదే! అతడు కరుణామయుడు - కరుణా సముద్రుడు - బిడ్డ ఆర్తనాదం వింటాడు. ఉరుకుతాడు.

    గజేంద్రుడు మొసలి వాతపడ్డాడు. సకల ప్రయత్నాలు చేశాడు. "నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ / రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా" అని మొత్తుకున్నాడు.

    అప్పుడు స్వామి ఎలా ఉన్నాడు. 'రామావినోది' అయి ఉన్నాడు. లక్ష్మీ దేవితో సరస సల్లాపాలలో ఉన్నాడు. విన్నాడు:- "విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యన గుయ్యాలించి సంరంభియై"

    సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
    పరివారంబును జీరడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
    తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీ కుచో
    పరి చేలాంచల మైన వీడడు గజప్రాణాన నోత్సాహియై

    స్వామి గజప్రాణం రక్షించాలానే ఆవేశంలో బయలు దేరాడు! ఎలా?

    లక్ష్మికి చెప్పడు. రెండు చేతుల్లో శంఖచక్రాలు ధరించడు. భృత్యులను పిలవడు. గరుడుని కోసం చూడడు. చెవుల మీద పడిన జుట్టును సవరించడు. లక్ష్మీదేవి చన్నుల మీద చెంగునైనా వదలడు.

    ఈ పద్యాన్ని గురించి ఒక కథ ఉంది. భక్త శిఖామణి పోతానామాత్యునికి ఈ పద్యం సందిగ్ధం అయింది. గంటం తాళ పత్రాలు వదిలాడు. నదీతీరానికి వెళ్తానని భార్యతో చెప్పాడు. వెళ్లాడు. అటువెళ్లాడో లేదో మరలి వచ్చాడు. గంటం అందుకున్నాడు. పద్యం పూర్తి చేశాడు. భార్యతో అన్నం పెట్టించుకున్నాడు. భోం చేశాడు. వెళ్లాడు. అప్పుడు పోతన పద్యం స్పురించిందని వచ్చాడు. భార్య చకితురాలయింది. 'ఇప్పుడే కదా పద్యం పూరించి, భోం చేసి వెళ్లారు' అన్నది. పోతన గబగబా పద్యం చదివాడు. అతనికి కన్నీరు మున్నీరయింది.

    'ఎంత అదృష్టవంతురాలవే! ఆ వచ్చిన వాడు రాముడు. నీకు దర్శనం ఇచ్చాడు! నీ చేత భోజనం చేశాడు!! నేనెంత పాపాత్ముణ్ణి!!! నాకు దర్శనం సహితం ఇవ్వలేదు' అని తల బాదుకొని ఏడ్చాడు.

    "సిరికింజెప్పుడు........." అంత మహత్తరం అయిన పద్యం!!!

    శ్రీనాథ మహా కవి పోతనకు బావ. అతడు ఈ పద్యం విన్నాడు. ఆ శ్రీహరి వట్టి చేతుల్తో గజేంద్రుని ఎలా రక్షిస్తాడు! బావా అని ఎగతాళి చేశాడు!

    శ్రీనాథుడు, పోతన భోజనాలు చేస్తున్నారు. పెరుగన్నంలో ఉన్నారు. బావిలో ఏదో పడిన చప్పుడు. శ్రీనాథుని కూతురు బావిలో పడ్డదని వార్త. శ్రీనాథుడు పెరుగన్నం చేత్తో బావి దగ్గరకు పరుగెత్తాడు. 'బావా! తాడూ బొంగరం లేకుండా ఎలా కూతురును రక్షిస్తావ' ని పోతన పరిహాసం చేశాడు. అప్పుడుగాని శ్రీనాథునికి తండ్రి యాతన - "సిరికింజెప్పుడు...." పద్యం అర్థం కాలేదు.

    బావిలో పడ్డది బండ. శ్రీనాథుని కూతురుకాదు.

    "సిరికిం జెప్పడు....." గురించి ఇంత కథ. అది అంత గొప్ప పద్యం. ఆపద్యం ఆపన్న ప్రసన్నులను గురించి జగత్పిత శ్రీమన్నారాయణుని ఆవేదన, ఆతురత, ఆత్రం వ్యక్త పరుస్తుంది.

    ఉన్నవాడు, ఇవ్వగలవాడూ పరాత్పరుడే. కావున భగవానుని ప్రార్థించి ఏ కార్యమైనా ప్రారంభించాలి.

    ఏకార్యం ప్రారంభించడానికైనా, సాగించడానికైనా, పూర్తి చేయడానికైనా ఏకాగ్రత అవసరం. మనసు మరొక చోట ఉన్నవాడు కార్యం సాధించ జాలడు. అతడు విఫలుడు అవుతాడు. క్రుంగుతాడు. కూల్తాడు. కార్యారంభంలో ప్రార్థన ఏకాగ్రత ప్రసాదిస్తుంది. ఏకాగ్రతతో కార్యం సఫలం అవుతుంది. జీవితం విజయవంతం అవుతుంది.

    "వాగర్ధావివ......" శ్లోకం 'కవికుల గురువు' 'సకల కవికుల శిరోరత్నం' కాళిదాస మహాకవిది. ఆకసం వంటిది ఆకాశమే - సూర్యుని వంటివాడు సూర్యుడే. కాళిదాసు వంటివాడు కాళిదాసే! 'ఉపమా కాళిదాసస్య' కాళిదాసుదే ఉపమాలంకారం. అతనికి ఉపమానంలేదు! అంతటి కవీశ్వరుడతడు.

    కాళిదాసు 'రఘువంశం' 'కుమారసంభవం' 'మేఘసందేశం' 'ఋతుసంహారం' కావ్యాలు సృష్టించాడు. 'మాళవికాగ్నిమిత్రం' అ'అభిజ్ఞాన శాకుంతలం' 'విక్రమోర్వశీయం' అనే నాటకాలను రచించాడు.

    'అభిజ్ఞాన శాకుంతలం' అతిలోక సుందరి. "కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా, తత్రాపి చతుర్దోంకః తత్రశ్లోక చతుష్టయం"

    కావ్యాలలో నాటకం రమ్యం. నాటకాల్లో శంకుంతల. అందులో నాలుగవ అంకం. అందులో నాలుగుశ్లోకాలు!

    ఆ నాలుగు శ్లోకాలూ వివరించాలనే ఆతురత ఉంది. కండూతి ఉంది. కాని ఇది సందర్భంకాదు.

    గోయత్ అనే జర్మన్ విద్వాంసుడు శాకుంతలం చదివి గంతులు వేశాట్ట! శాకుంతలం చదివి, ఆనందించడానికే సంస్కృతం నేర్చినవారున్నారు. అంత అందం కాకున్నా అది అన్ని భాషాల్లోనూ ఉంది. మీకు చదవాలనిపించవచ్చు. కాని మీకు దొరకదు. మనం సాంస్కృతిక బానిసలం. మనకు అమెరికా ఇంగ్లీషు పుస్తకాలు తప్ప దొరకవు! ఆ పుస్తకాలే హస్తభూషణం!

    శాంతారాం నలుపు తెలుపులో గత శతాబ్దపు నాలుగవ దశకంలో శకుంతల పిక్చర్ తీశాడు హిందీలో. మళ్లీ ఏడవదశాబ్దంలో అనుకుంటా "స్త్రీ" అని కలర్ పిక్చర్ తీశాడు. అదీ శాకుంతలమే. అద్భుతంగా తీశాడు. శాంతారాంకు భారత సంప్రదాయం ప్రాణం. అతని పిక్చర్లన్నీ భారత సంప్రదాయ ప్రదర్శనలే!

    మా బాల్యంలో ఆంధ్ర, సంస్కృత గ్రంథాలు తప్ప ఇంగ్లీషు పుస్తకం ఉంటుందనే ఎరగం. ఇంగ్లీషు వాడు అర్ధశతాబ్దంలో సంస్కృతం - భారత సంస్కృతిని మాయం చేయడంలో నూటికి వేయి పాళ్లు విజయం సాధించాడు! మనను వెధవాయలను చేశాడు!! మనం వెధవలమనీ ఎరక్కుండా చేశాడు!!!

    కవికుల గురువు కాళిదాసుకు వాల్మీకి మహర్షి ఆరాధ్యుడు. కాళిదాసుకు తెలియకుండానే రామాయణంలోని అనేకానేక శ్లోకాలు కాళిదాసు కావ్యాల్లో చేరాయి. కాళిదాసు రఘువంశం రచన ప్రారంభించాడు. రఘువంశం - రాముని వంశ చరిత్ర. కాళిదాసు భయపడుతున్నాడు!

    మందః కవియశః ప్రార్థీ, గమిష్యా మ్యపహాస్యతామ్ |
    ప్రాంశు లబ్ధే ఫలే లోభా, దుద్బాహురివ వామనః ||

    నేను మందబుద్ధిని. వాల్మీకి అంతటి కీర్తి ఆశిస్తున్నాను. నేను నవ్వుల పాలవుతున్నాను.

    అందుకు కాళిదాసు 'ఉపమ' ను ఆశ్వాదించండి. మీ ముందు బొమ్మ నిలుస్తుంది.

    అది పొడవు చెట్టు. దానికి పళ్లున్నాయి. పొడుగు వానికి మాత్రమే అందుతాయి. పొట్టివాడు చేతులెత్తి ఎగురుతున్నాడు! నవ్వుల పాలుకాడా?

    పొడవు చెట్టు రామాయణం. ఆజానుబాహువు వాల్మీకి. వాడి ఫలములు యశస్సు. వాటిని వాల్మీకి అవలీలగా అందుకో గలడు. వాల్మీకి ముందు కాళిదాసు వామనుడు. పొట్టివాడు. అతడు ఆ ఫలాలు అందుకోవాలను కుంటున్నాడు! చేతులెత్తి ఎగరుతున్నాడు!

    ఇది వాల్మీకి ముందు కాళిదాసు వినయ విధేయత.

    వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే!
    జగతః పితరౌ వందే, పార్వతీ పరమేశ్వరౌ!!

    తాత్పర్యం ఆనందించండి.

    పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వారే జగత్తుకు పితరులు - తలిదండ్రులు. వారి దాంపత్యం ఎలాంటిది? మాట, అర్థం కలసిపోయినంతటిది. ప్రతిమాటకూ అర్థం ఉంటుంది. ప్రతి అర్థానికి ఒకమాట ఉంటుంది. ఈ రెండూ పాలు, తేనె లా కలసే ఉంటాయి. విడదీయరాదు. శివస్వామి అర్ధనారీశ్వరుడు. తనమేననే పార్వతిని ధరించాడు !

    వాగర్థావివ సంపృక్తులైన జగతః పితరులగు పార్వతీ పరమేశ్వరులను - రఘువంశ కావ్యాదిలో - ప్రార్థిస్తున్నాను. ఏం కావాలని ప్రార్థిస్తున్నాడు? తన ప్రతిమాటా అర్థవంతం కావాలని. వాక్యం అర్థవంతం అవుతే గాని కావ్యం కాదు. "వాక్యం రసాత్మకం కావ్యం"  

    కాళిదాసు పలు చోట్ల వాల్మీకిని అనుసరించాడని చెప్పాం. ఈ సందర్భాన్ని పరిశీలిద్దాం:-

    వాల్మీకి సహితం - కాళిదాసు వలెనే - రామాయణం రచించడానికి వెనకాడాడు. అప్పుడు బ్రహ్మ అంటున్నాడు:-

    "నతే వాగవృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి
    కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్"

    కావ్యంలో ఎక్కడా నీవు చెప్పింది అబద్ధం కాదు. పుణ్యం, శ్లోకబద్ధం, మనోహరం అయిన రామాయణం రచించు.

    వాల్మీకికి బ్రహ్మ 'అబద్ధం కాని వాక్యం' వరం ఇచ్చాడు. కాళిదాసు అదేవరం 'వాగర్థప్రతిపత్తయే' అర్థిస్తున్నాడు.

    రామాయణంలో సీత తనకూ, రామునికి గల అనన్య సంబంధాన్ని ప్రవచిస్తున్నది:-

    "అనన్యా రాఘవేణాహం - భాస్కరేణ ప్రభాయధా"

    నేనూ, రాముడు సూర్యుడు - కాంతివలె అనన్యులం.

    "వాగర్థావివ......" మీద "అనన్యా.........." ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

    వేదం

    గోభి ర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి స్సత్యవాదిభిః|
    అలుబ్దై ర్దానశీలైశ్చ సప్తభిర్దార్యతే మహీ ||

    గోవులు, విప్రులు, వేదాలు, పతివ్రతలు, సత్యవచనులు, లుబ్ధులు కానివారు, దానశీలురు ఈ ఏడుగురి వల్లనే భూమి నిలిచి ఉంది.

    'భూమి వ్రేలాడు తున్నది' అని యజుర్వేదం ప్రవచించింది. భూమి నిరాధారంగా నిలిచి ఉంది. గాలిలో తేలియాడు తున్నది. రాలకున్నది. నిలిచి ఉన్నది. అట్లా ఎట్లా ఉన్నది! "శ్రీమహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య" శ్రీమహా విష్ణువు ఆజ్ఞాపించాడు. భూగోళం ఆకాశంలో, గాలిలో, ఏ ఆధారం లేకుండా నిలిచి ఉంది! ఇది భౌతికం.

    ఈ భూమండలం మీదనే సకల ప్రాణిజాలం నివసిస్తున్నది. అగ్ని, వరుణ, వాయు దేవుల సహితంగా నరుడు మహీతలం మీదనే నివసిస్తున్నాడు. వేదం వారికోసం ఒకసమాజం, ఒక జీవన విధానం ఏర్పరిచింది. ఇవి నిరంతరం సాగాలంటే 'ధర్మం' అవసరం. ధర్మం కొనసాగాలంటే ఏడింటి అవసరాన్ని శ్లోకం వివరించింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS