నన్ను తల్చుకుంటున్నావా?

షిరిడీలో ప్రతి ఆదివారం సంత జరుగుతూ ఉండేది. అలాంటి ఓ ఆదివారం రోజున బాబా మసీదులోని తన దర్బారులో సేదతీరి ఉన్నారు. బాబా చుట్టూ శ్యామా, బూటీ, కాకాసాహెబ్‌ దీక్షిత్‌లాంటి మహామహులైన భక్తులు పరివేష్టించి ఉన్నారు. సాయి సచ్చరిత్రను అక్షరబద్ధం చేసిన హేమాడ్‌పంతు ఆ సమయంలో బాబా కాళ్లను ఒత్తుతూ ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఇంతలో...

‘నీ కోటుకు శనగగింజలు అంటుకున్నాయి చూడు’ అని హేమాడ్‌పంతుతో అన్నాడు శ్యామా. నిజంగానే హేమాడ్‌పంతు తన కోటుని తట్టగా కొన్ని శనగగింజలు రాలాయి.

దానికి బాబా ‘ఇతనికి తానొక్కడినే తినే గుణం ఒకటి ఉంది. ఇవాళ సంత కదా! అక్కడ నుంచి శనగలు కొనుక్కుని తింటూ ఇక్కడికి వచ్చాడు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఇందులో ఆశ్చర్యం ఏముంది?’ అన్నారు కవ్విస్తూ.

బాబా మాటలకు హేమాడ్‌పంత్‌ ఉడుక్కుంటూ ‘బాబా! నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అలాంటప్పుడు ఆ దుర్గుణాన్ని నాపై ఎందుకు మోపుతావు. ఇప్పటివరకు నేను షిరిడీలో సంతను చూడలేదు. ఇక శనగలు కొనుక్కుని తినే ప్రసక్తి ఎక్కడిది? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ తిని ఎరుగను’ అంటూ సంజాయిషీ ఇచ్చాడు.

ఆ మాటలకు బాబా ‘నిజమే! నీ దగ్గర ఉన్నవారికి పెట్టకుండా ఏమీ తినవు. కానీ తినేముందు నన్ను స్మరిస్తున్నావా? నేను నీ చెంత లేనా? ఏదన్నా తినే ముందు నాకు అర్పించుకుంటున్నావా?’ అంటూ సూటిగా అడిగారు.

బాబా ప్రశ్నకు హేమాడ్‌పంతు దగ్గర జవాబు లేదు. చాలామంది ఆహారాన్ని తీసుకునేముందు భగవంతుని తల్చుకోవడం మర్చిపోతారు. అలా తల్చుకుంటేనే భగవంతుడు ప్రసన్నం అవుతాడని కాదు. ఆ తలపు మనిషిలోని వినమ్రతను సూచిస్తుంది. మనిషి ఆకలి తీరే ఆహారం లభించడం ఒక వరం. ప్రాణం, ఆ ప్రాణాన్ని నిలిపేందుకు ఆహారం రెండూ కూడా దైవబలంతోనే చేకూరుతాయి. కాబట్టి కనీసం మొదటి ముద్దను నోట పెట్టుకునే ముందైనా భగవంతునికి కృతజ్ఞతలు అర్పించుకోవడం మంచి భక్తుని లక్షణం. హేమాడ్‌పంతుకు ఆ విలువని తెలియచేసేందుకు బాబా ఈ లీలను జరిపించి ఉంటారు.


More Good Word Of The Day