కలియుగానికి కృష్ణుడు చెప్పిన జీవితపాఠం!

 

శారీరకంగా ఉండే బాధలు ఒకరకమైతే మానసికంగా కలిగే బాధలు మరొక రకం. అందులో భయం చాలా భయంకరమైనది. అందుకే మానవునికి మొదటి శత్రువు భయము అంటారు. కొంత మంది అన్నిటికీ భయపడుతుంటారు. లేనిపోనివి ఊహించుకొని భయంతో వణికి పోతుంటారు. ఈ భయం ప్రాపంచిక విషయములలోనే కాదు దేవుని విషయంలో కూడా ఉంటుంది. ఆ దేవుడికి పూలు పెట్టాము ఈ దేవుడికి పెట్టకపోతే ఆయనకు కోపం వస్తుందేమో. ఈయనకు హారతి ఇచ్చాము ఆయనకు ఇవ్వకపోతే ఎలాగా! ఈ గుడికి వెళ్లాము ఆ గుడికి వెళ్లకపోతే ఏమౌతుందో ఏమో! ఏం చేస్తే ఏ దేవుడికి ఏం కోపం వస్తుందో అని అనునిత్యం భయపడుతుంటారు కొందరు. ఏ పని చేస్తే ఏమౌతుందో అని భయంతో హడలిపోతుంటాడు. 

ఇవన్నీ అనవసర భయాలు, పరమాత్మకు కోపతాపాలు, ఇష్టాఇష్టాలు ఉండవు అని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానం కలిగిననాడు పరమాత్మ అంటే భయం ఉండదు. అందుకే ఇతరుల వల్ల ఎవడైతే భయం లేకుండా ఉంటాడో, వాడే నా భక్తుడు అని అన్నాడు పరమాత్మ. అంటే ఈ దుర్గుణము అయిన భయాన్ని ముందు వదిలిపెట్టాలి అని అర్థం.

మనం అన్యాయము, అక్రమము, అధర్మం గా ప్రవర్తించనపుడు ఎవరికీ భయపడనవసరం లేదు అనే నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. అలాగే ఎవరినీ మనం భయానికి లోను చేయకూడదు. ఎవరినీ భయపెట్టకూడదు. తన వాక్కుతో గానీ, శరీరంతో గానీ ఇతరులను భయందోళనలకు గురి చేయకూడదు. శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఇతరులను అకారణంగా హింసించకూడదు. అందరి మీదా అనవసరమైన అధికారం చలాయించకూడదు. అందరూ నాకు భయపడుతూ ఉండాలి. అందరూ నాకు లోబడి ఉండాలి. అందరూ నా చెప్పుచేతల్లో ఉండాలి అనే భావనతో ఉండకూడదు. ఒకవేళ అటువంటి భావనలు ఉంటే, వాటిని మనసులో నుండి తుడిచివెయ్యాలి. కాబట్టి మనం ఒకరికి భయపడకూడదు, మనం మరొకరిని భయపెట్టకూడదు.

సంతోషము, దుఃఖము, కోపము, భయము, ఉద్వేగము ఇవి మనసు లక్షణాలు. ఇవి మనలో ఒక్కోసమయంలో ఒక్కోవిధంగా విజృంభిస్తుంటాయి. వాటిని అదుపులో పెట్టుకోవాలి. క్రమక్రమంగా వాటికి స్పందించడం మానుకోవాలి. సంతోషం ఎక్కువయినా, దుఃఖము ఎక్కువయినా కష్టమే, ఆ సమయంలో మనలో ఉన్న విచక్షణా శక్తి పని చేయదు. ఆనందం అవధులు దాటినా, దు:ఖము ముంచుకొచ్చినా ఒక్కోసారి గుండె ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి భావోద్వేగాలు కలిగినపుడు ఎలాంటి స్పందన లేకకుండా సమభావనతో ఉండటం అలవాటు చేసుకోవాలి. అటువంటి వాడే నాకు ఇష్టమైన వాడు అని అంటున్నాడు. పరమాత్మ.

కొంత మంది మనలను ఎదురుగా పొగుడుతుంటారు. పక్కనే తిడుతుంటారు. కొంత మంది వాళ్ల కార్యాలు సాధించుకోడానికి పొగుడుతుంటారు. మరి కొంత మంది ఒకరోజు పొగుడుతారు మర్నాడే తిడతారు. ఈ సంవత్సరం లాభం వస్తుంది. మరు సంవత్సరం నష్టం వస్తుంది. ఏకాలానికి తగ్గట్టుగా ఆయాజబ్బులు వస్తుంటాయి. ఇవి అన్నీ చిరునవ్వుతో ఓపికగా భరించాలి. అలాగే అసూయ. ఇది ఇంకా భయంకరమైన జబ్బు. ఎదుటి వాటి ఉన్నతిని ఓర్వలేకపోవడం. అసూయ పడటం. ద్వేషం పెంచుకోవడం. ఇది ఘోరమైన పతనానికి దారి తీస్తుంది. ఎవడినీ క్షణం సేపు ప్రశాంతంగా ఉండనివ్వదు. మనసును అల్లకల్లోలం చేస్తుంది. దీనినే అమర్షణ అని కూడా అంటారు. ఈ అసూయాద్వేషాలను కూడా ప్రతి వాడూ సమూలంగా నాశనం చేయాలి. సాటి వారిని ప్రేమించడం, ఆదరించడం, ఎదుటి వారిలో ఉన్న గొప్పతనాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. కలియుగంలో ఉన్న మానవులకు పరమాత్మ చెప్పే జీవితపాఠం.

◆వెంకటేష్ పువ్వాడ.


More Good Word Of The Day