మణిపూర్లో హోళీని చూసితీరాల్సిందే!

హోళీ అనగానే రంగులే గుర్తుకువస్తాయి. ఆ రంగులతో పాటు పంచుకునే సంబరాలూ గుర్తుకువస్తాయి. కానీ హోళీ ముసుగులో ఆకతాయిలు హద్దులు దాటేస్తారనీ, తాగుబోతులు పీపాలు పట్టిస్తారనీ ఆరోపణ ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిన జరిగే హోళీ అనేక అపవాదులకు తావిస్తూ ఉంటుంది. కానీ వీటన్నింటికీ భిన్నంగా హోళీ అంటే ఇలా ఉండాలి అంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది మణిపూర్.

మణిపూర్లో హోళీని ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదురోజులపాటు చేసుకుంటారు. అక్కడ ఈ పండుగను ‘యాసంగ్’ అని పిలుస్తారు. హోళీకి ఐదురోజుల ముందర హోళికా దహనంతో ఆ యాసంగ్ సంబరాలు మొదలవుతాయి. దీనికోసం ఎండుగడ్డిన ఓ గుడిసె ఆకారంలో నిర్మించి దానికి నిప్పు అంటిస్తారు. యాసంగ్ పండుగ జరిగే అయిదు రోజుల్లోనూ రాష్ట్రమంతా క్రీడల పోటీలు నిర్వహించడం విశేషం. ఉదయం వేళల్లో కుర్రకారంతా ఆటల్లో మునిగిపోతే, పిల్లలేమో ఇళ్లిళ్లూ తిరుగుతూ చందాలు సేకరిస్తుంటారు.

ఇక యాసంగ్నాటి రాత్రివేళల్లో జరిగే నృత్యం గురించి చెప్పుకొని తీరాలి. యాసంగ్ సందర్భంలో మాత్రమే జరిగే ఈ నృత్యం పేరు ‘తబల్ చోంగా’. తబల్ అంటే వెన్నెల, చోంగా అంటే నృత్యం. పౌర్ణమి రోజుల్లో వచ్చే యాసంగ్ రాత్రుళ్లో యువతీయువకులు కలిసి ఈ నృత్యం చేస్తారు. మిగతా రోజులలో యువతీయువకులు కలిసి నృత్యం చేయడానికి అంగీకరించని పెద్దలు.... యాసంగ్ సమయంలో మాత్రమే తమ కనుసన్నలలో ఈ వేడుక జరిపే అనుమతినిస్తారు. ప్రకృతి ఒడిలో ఉండే మణిపూర్లోని కొండాకోనలు డప్పుల చప్పుడుకి ప్రతిధ్వనిస్తుండగా, పండు వెన్నెల కింద లయబద్ధంగా సాగే ఈ తబల్ చోంగా నృత్యాన్ని చూసేందుకు ఎక్కడెక్కడినుంచో పర్యటకులు వస్తారు.

మణిపూర్లో హోళీ అంటే కృష్ణుని పండుగే! అందుకనే ఈ అయిదు రోజులూ ఊళ్లన్నీ కృష్ణభజనలతో మారుమోగి పోతుంటాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ‘గోవిందజీ’ అనే ప్రముఖ కృష్ణమందిరం ఉంది. ఎప్పుడో మణిపూర్ రాజులు ఈ ఆలయాన్ని కట్టించారు. హోళీ సందర్భంగా ఈ ఆలయం కిటకిటలాడిపోతుంటుంది. భజన బృందాలూ, భక్తులూ యాసంగ్ సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించకపోవడం లోటుగా భావిస్తారు. ఇక హోళీ రోజున ఆలయంలో జరిగే రంగుల వేడుక గొప్పగా ఉంటుంది. ఆలయంలోని కృష్ణుని ఉత్సవవిగ్రహం మీద రంగులు చల్లుతూ, ఆ కృష్ణుని కూడా తమ సంబరంలో భాగం చేసుకుంటారు. హోళీ సందర్భంగా ‘గోవిందజీ’ ఆలయంలోని ముఖ్య దేవతలైన రాధాకృష్ణులతో పాటుగా జగన్నాథుడు, రాధ, సుభద్ర, బలరాముల విగ్రహాలకు విశేష పూజలు జరుగుతాయి.

ఎక్కడో దేశానికి ఓ మూలగా విసిరివేయబడినట్లు ఉంటే మణిపూర్ అంటే మిగతా దేశవాసులకు కాస్త చులకనే! పేదరికం, తీవ్రవాదంతో ఆ రాష్ట్రం ఎప్పుడూ అల్లాడిపోతుంటుంది. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వాలు చూపే అలసత్వంతో మణిపూర్ వెనుకబాటుతానానికి ప్రతినిధిలా కనిపిస్తుంది. కానీ అక్కడి ప్రజల సమయపాలననీ, శ్రమనీ చూసి నాగరికులంతా ముక్కున వేలేసుకోక తప్పదంటారు మణిపూర్ వెళ్లి వచ్చినవారు. అందుకు ఓ గొప్ప సందర్భం యాసంగ్! రంగులు చల్లుకోవడంలో అసభ్యత ఉండదు, రోడ్డు మీద తాగుబోతులు కనిపించరు, గుడి ప్రాంగణాలు మురికిపట్టి ఉండవు, పూజారులు సమయం ప్రకారం తమ పని చేసుకుపోతుంటారు... ఇలాంటి చోట జరిగే హోళీ నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!

- నిర్జర.

 


More Holi Purnima