వందేళ్ల తర్వాత హోలీ రోజే చంద్రగ్రహణం.. హోలికా దహనం ఎందుకు జరుపుకుంటారు...
గ్రహణం అంటేనే వెలుగును కప్పివేసే చీకటి అని గుర్తు వస్తుంది. సాధారణంగా గ్రహణం అంటే చెడ్డ కాలం అని కూడా అంటారు. అందుకే గ్రహణం సమయంలో ఎవరూ బయటకు వెళ్లొద్దని, గ్రహణాన్ని చూడవద్దని చెబుతారు పెద్దవారు. 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఖచ్చితంగా హోలీ పండుగ రోజే వచ్చింది. దాదాపు 100 సంవత్సరాల తరువాత ఇలా హోలీ రోజు చంద్ర గ్రహణం వచ్చిందని పండితులు చెబుతున్నారు. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగల సందర్భంగా రావణుడి బొమ్మను దహనం చేయడం అందరికీ తెలిసిందే.. అదే విధంగా హోలీ పండుగ సందర్భంగా హోలికా దహనం చేస్తారు. అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది? దీని గురించి తెలుసుకుంటే..
తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గున మాసంలో పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ యేడాది హోలీ పండుగ, చంద్ర గ్రహణం కలిసి వచ్చాయి. మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు ఇవి రెండూ సంభవిస్తున్నాయి. హోలీ అంటే రంగుల పండుగ. జీవితాలు కొత్త రంగులతో నిండుకోవాలని, జీవితంలో సంతోషం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పయసుతో పని లేకుండా అందరూ హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే హోలీ రోజున హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అంతేనా హోలికా దహనం కూడా ఈ రోజు చేస్తారు. ఈ రోజు కాముని దహనం, డోలికోత్సవం మొదలైన వాటిని ఎంతో సంబంరంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో మధుర, బృందావనం, బర్సానా గ్రామ ప్రజలు చాలా సంతోషంతో జరుపుకునే పండుగ ఇది. శ్రీకృష్ణుడితో ముడిపడిన ఈ రంగుల పండుగను వీక్షించడానికి దేశంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు తరలి వస్తారు.
డోలికా ఉత్సవం..
డోలికా ఉత్సవం హోలీ పండుగ రోజు జరుగుతుంది. ఈ రోజు బృందావనంలో చాలా వైభవంగా హోలీ జరుపుకుంటారు. రంగురంగుల పువ్వులు, రంగులు ఒకరి మీద ఒకరు చల్లుకోవడమే కాకుండా కోలాటం ఆడతారు. దీన్ని దాండియా అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు హోలీ రోజు బృందావనం వాసులతో ఎంతో సంతోషంగా ఈ వేడుకను జరుపుకునేవాడట. అందుకే ఇప్పటికీ అక్కడ హోలీ పండుగను చాలా వైభవంగా జరుపుతున్నారు.
హోలికా దహనం..
ఈ హోలిక గురించి తెలుసుకోవాలి అంటే కృతయుగం నాటికి వెళ్లాలి. కృత యుగంలో రఘునాథ అనే మహారాజు ఉండేవాడు. ఆయన తన రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలించే వాడు. అయితే ఆ రాజ్యానికి హోలిక అనే ఒక రాక్షసి వచ్చి చిన్న పిల్లలను ఎత్తుకుపోవడం, చంపి తినడం, ఇబ్బంది పెట్టడం చేసేది. ఈ విషయం రాజుకు తెలిసింది. ఎలాగైనా ఆ హోలిక ముప్పు తప్పాలని ఆలోచిస్తుంటే అప్పుడే నారద మహర్షి రాజు దగ్గరకు వస్తాడు. రాజు తన రాజ్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న హోలిక గురించి నారద మహర్షికి చెప్పగా.. నారద మహర్షి రాజుతో.. రాజా.. ప్రతి సంవత్సరం పాల్గుణ మాసం వస్తుంది కదా.. ఈ పాల్గుణ మాసంలో పూర్ణిమ రోజున హోలికను పూజిస్తే ఆ హోలిక మిమ్మల్ని, మీ రాజ్య ప్రజలను ఏమీ చేయదు అని చెప్తాడు. అందులోనూ సాయంత్రం సమయంలో హోలిక పూజ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. అప్పటి నుండి సాయంత్రం మొదట రాత్రి సమయంలో హోలికా దహనం, పూజ జరుగుతున్నాయి.
హోలీ పండుగ రోజు రంగుల నీళ్లు, రంగులు చల్లుకోవడాన్ని వసంతం అంటారు. వసంత ఋతువు ప్రారంభానికి సూచికగా ఇలా రంగులు చల్లుకుంటారని కూడా చెబుతారు. అందుకే దీన్ని వసంత మహోత్సవం లేదా కామ మహోత్సవం అని కూడా పిలుస్తారు. మరొక విషయం ఏమిటంటే.. హోలీ రోజున హోలికా దహనం మాత్రమే కాకుండా కాముని దహనం కూడా చేస్తారు. హోలీ రోజు శ్రీకృష్ణుడిని ఊయలో వేసి ఊయల ఊపుతారు. దీన్నే డోలీకోత్సవం అని అంటారు. హోలీ రోజున రాధాకృష్ణులు ఎంతో సంబరంతో రంగులు చల్లుకుని, ఒకరికి ఒకరు ఊయల ఊపుకునేవారు అంట. అందుకే హోలీ రోజు ఊయల ఊగడం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది.
*రూపశ్రీ.
