వినాయకుడి జన్మ రహస్యం

Reason Behind Worshipping Lord Ganesha , Symbolism and Birth Story 2014 ,How Ganesha was born, History of Ganesh Chaturthi, Meaning Vinayaka Chavithi 2014

మన పురాణాల్లో వినాయకుని పుట్టుకకు రకరకాల కారణాలు కనిపిస్తాయి. ఒక కారణానికి, మరొక కారణానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రముఖ శైవాగమమైన ‘సుప్రభేదాగమము’లో వినాయకోత్పత్తి గురించి ఇలా వుంది. ఒకసారి వినాయకుడు తన తండ్రి అయిన శివుని దగ్గరకు వచ్చి..,‘దేవతలందరి వలె కాకుండా నా ఆకారం ఏనుగును పోలివుండడానికి కారణం ఏమిటి?’ అని అడిగాడు. అప్పుడు శివుడు -

ఆదౌ త్వహ ముమాసార్థం క్రీడార్థం హిమవద్వనే
కరేణుశ్చ గజేంద్రేణ సంభోగ మకర రోత్తతః
యదృచ్ఛయా తు తం దృష్ట్వా తదాకార మగా మహమ్
కరేణో రాకృతిం చోమా తదాక్రీడ మహం భృశం
తస్యాం తు గర్భ మదధా త్తస్మిస్కాలే త్వదుద్భవః

‘వినాయకా.., ఒకసారి నేను, పార్వతి కలిసి హిమాలయాలలో విహరిస్తూ, సృష్టికార్యంలో నిమగ్నమైవున్న ఏనుగుల జంటను చూడడం జరిగింది. పార్వతి నావైపు చూసింది. ఆమె మనస్సు నాకు అర్థమైంది. మేమిద్దరం ఏనుగుల రూపాలు ధరించి ఆనందించాము. నీ రూపం ఇలా ఉండడానికి కారణం అదే’ అని చెప్పాడు.

ఇక ‘లింగపురాణం’ పరిశీలిస్తే....
రాక్షసులంతా కలిసి శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేసి ఎన్నో వరాలు పొందారు. ఆ వరగర్వంతో వారు దేవతలను నానా హింసలు పెట్టి ఆనందిస్తూండేవారు. దేవతలంతా శివుని దగ్గరకు వెళ్లి తమ బాధలు చెప్పుకుని, కాపాడమని మొరపెట్టుకున్నారు. శివుడు వినాయకుని సృష్టించి, దేవతలకు సహాయం చేయమని పంపాడు.
ఇక ‘శివపురాణం’ పరిశీలిస్తే....
ఒకసారి జయ,విజయులు పార్వతీదేవిని దర్శించుకుని, ఆమెతో...‘తల్లీ, పరమేశ్వరునకు నంది, భృంగి వంటి ద్వారపాలకులు ఉండగా, నీకు ద్వారపాలకులు లేకపోవడం మాకు బాధగావుంది’ అన్నారు. ‘సమయం వచ్చినప్పుడు మీ కోరిక తీరుతుంది’ అని చెప్పి పార్వతి వారిని పంపింది. ఆ రోజులలో...గజాసురుడనే రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు.

‘నీవు నా హృదయంలో నివాసముండాలి’ అని కోరాడు గజాసురుడు. శివుడు గజాసురుని హృదయంలో ప్రవేశించాడు. అలా చాలా కాలం గడిచింది. శివుడు కనిపించక పార్వతి తల్లడిల్లి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీహరి గంగిరెద్దులవాని రూపం ధరించి, నందితో కలిసి గజాసురుని సందర్శించి అతని కొలువులో నంది చేత అత్యద్భుతంగా నాట్యం చేయించాడు. సంతసించిన గజాసురుడు  ఏం వరం కావాలో కోరుకోమని శ్రీహరిని అడిగాడు. ‘నీ హృదయంలో నున్న శివుడు మాకు కావాలి’ అని అడిగాడు శ్రీహరి.

 

వచ్చినవాడు శ్రీహరి అని గుర్తించాడు గజాసురుడు. ‘దేవాధిదేవా..నిన్ను జయించడం ఎవరికీ సాధ్యంకాదు. నీ కోరిక ప్రకారమే శివుని అప్పగిస్తాను, కానీ నాదో కోరిక’ అన్నాడు గజాసురుడు. ‘ఏమిటి’ అని అడిగాడు శ్రీహరి. ‘నా చర్మాన్ని శివుడు ధరించాలి, నా ముఖం త్రిలోక పూజితం కావాలి’ అని అడిగాడు గజాసురుడు. ‘తథాస్తు’ అన్నాడు శ్రీహరి. నందీశ్వరుడు గజాసురుని పొట్ట చీల్చాడు. శివుడు గజాసుర గర్భస్థ చెరనుంచి బయటపడ్డాడు. శివుడు కైలాసం వస్తున్నట్లు పార్వతికి వర్తమానం అందింది. చాలా కాలం తర్వాత భర్తను కలుస్తున్న శుభతరుణం.

అందంగా అలంకరించుకోవాలనే సంకల్పంతో అభ్యంగన స్నానానికి సంసిద్ధురాలై తన శరీరానికి పసుపు, చందనంతో కలిపిన మిశ్రమాన్ని పూసుకుని నలుగు పెట్టుకుంటూ..ప్రాణనాథునితో కలిసి తాను రచించబోయే ప్రణయ ప్రబంధాన్ని తలచుకుంటూ తన మేని నలుగుతో ఓ చక్కని బొమ్మను చేసింది.

అమ్మ మేని నలుగుముద్ద రూపుదాల్చె పసిడిబొమ్మ
ఆదిశక్తి ఆశలకు ఆకారమై..సకలవేద చయముకు సాకారమై

ఆ బొమ్మను చూడగానే ఆమెలో మాతృత్వం పొంగిపొరలింది. ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ బొమ్మ సజీవాకృతిని దాల్చి, చిరునవ్వులు చిందిస్తూ పార్వతి ముందు నిలిచింది. ముద్దల మూటగట్టు ఆ బాలుని మాతృప్రేమతో కౌగిలించుకుని, ముద్దులుపెట్టి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి పంపింది. (ఆ పసుపుముద్దే తొలినాటి వినాయకుని రూపం. అందుకే మనం ఏ పని ప్రారంభించినా ముందుగా పసుపు వినాయకుని పూజించడం మన సాంప్రదాయాల్లో ఆచారమైంది.)

పార్వతి ప్రణయసామ్రాజ్యాన్ని పాలించాలనే ఆతృతతో అంతఃపురద్వారం దగ్గరకు వచ్చిన శివుని అడ్డగించాడు పార్వతి సృష్టికి ప్రతిరూపమైన ఆ బాలుడు. ఇద్దరి మద్య వాద ప్రతివాదాలు జరిగాయి. విసుగు చెందిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఖండించి లోపలకు వెళ్ళాడు. మాటల సందర్భంలో ఆలుని మరణవార్త తెలుసుకున్న పార్వతి అలిగి శివునికి దూరంగా జరిగింది. దేవతలంతా ఎంత వెతికినా ఆ బాలుని శిరస్సు కనిపించలేదు.

అప్పుడు శ్రీహరి వచ్చి, తాను గజాసురునికి ఇచ్చిన వరం సంగతి చెప్పి, ఆ గజాసురుని శిరస్సు ఆ బాలుని మొండానికి అతికించి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసాడు. ఆనాటి నుంచి ఆ బాలుడు ‘గజముఖుడు’ అయ్యాడు. ఆ రోజు భద్రపద శుద్ధ చవితి. అదే వినాయకుని జన్మదినం.దేవతలందరూ గజముఖునకు అనేక వరాలిచ్చారు. తన కుమారుడు పునర్జీవితుడైనందులకు పార్వతి సంతోషించింది.

 

 


More Vinayakudu