• Next
  • Yeluka Vacche Illu Bhadram 61

    This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

    ఎలుకవచ్చే ఇల్లు భద్రం 61

    ఇలపావులూరి మురళీమోహనరావు

    శాస్త్రిగారు మీద చొక్కా కూడా లేకుండా మోటార్ సైకిల్ పై వస్తున్నారు.

    ఇంటి ముందుకు రాగానే రోడ్డు దాటుతున్న పిల్లి ఒకటి శాస్త్రిగారి మోటార్ సైకిల్ కిందపడి పచ్చడైంది. సడన్ బ్రేక్ వేశాడు వెంకట్రావు. "అయేయ్యో శాస్త్రిగారూ..పిల్లి శ్రీకృష్ణుడి అవతారం మహాపాపం అన్నాడు వెంకట్రావు.

    పక పక నవ్వారు శాస్త్రిగారు. హెల్మెట్ ఉండటంతో వెంకట్రావును గుర్తించలేదు.

    "ఎవడండీ చెప్పిన ఆ సన్యాసి గాడిద? శతక కారుడేమన్నాడు? అతినీచము కడుదుష్టము అతి హేయము ఇంటిపీడ అది ఏదన్నన్ మతిగలిగిన ప్రతివాడూ గతి తప్పక చెప్పుగాద గండు బిడాలమే! అని గంట గొట్టి గంట సేపు చెప్పాడు. పిల్లి పొరబాటున మనవల్ల చస్తే ఈడ్చి ముళ్ళ కంపలో పడేయమన్నాడు" అంటూ శవాన్ని ఎడం చేత్తో ఎత్తి విసిరి అవతల పడేశాడు శాస్త్రిగారు.

    హెల్మెట్ తీశాడు వెంకట్రావు అంతే ! యాక్సిలేటర్ చివరి కంటా తిప్పి అలాగే పట్టుకున్నారు శాస్త్రిగారు.

    "ఓరి దుర్మార్గుడా శాస్త్రం నీకొకటి మాకొకటి? దొరక్కపోవురా. అప్పుడు చచ్చిన తరువాత కాదు బతికుండగానే నీ కండలను చీల్చి శనగపిండిలో కలిపి వేయిస్తాను" పళ్ళు కొరుక్కున్నాడు వెంకట్రావు బండి స్టార్ట్ చేసి.

    వెంకట్రావు ఇంటి ముందు గుంపులు గుంపులుగా ఉన్నారు జనం అంతా ఆ వీధిలోని వారు, కాలనీవారు.

    "ఏమండీ ...ఏమండీ కొంపమునిగింది...మనింటిని మా బాబాయి మనకు తెలియకుండా వీరందరికీ అమ్మేసి అడ్వాన్సులు పుచ్చుకున్నాడట. మాకు రిజిస్టర్ చెయ్యాలంటే మాకు రిజిస్టర్ చెయ్యాలని వీళ్ళంతా గొడవచేస్తున్నారు. నాకు చెమటలు పడుతున్నాయి. బీపీ పెరుగుతున్నది" రొప్పుతూ చెప్పింది సుందరి.

    వెంకట్రావు కళ్ళు అగ్నిగోళాలయ్యాయి.

    "ఏమిటండీ...ఇదంతా ఏంటి? ఇల్లేంటి? అమ్మడమేంటి? ఎవరమ్మారు? ఎలా అమ్మారు? ఎవరు కొన్నారు? ఎలా కొన్నారు? ఏంటిగోల? వెళ్లండి" అరిచాడు.

    "ఏవండోయ్. మర్యాదగా మాట్లాడండి సాక్షాత్తూ మీ మామగారు అమ్మారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు ఇంటినిండా వాస్తు లోపాలున్నాయంటే నేను కొన్నాను. పేకాటలో ఓడిపోయిన డబ్బులు కూడా అందులోనే జమకట్టాడు. మీరు ప్లేటు తిరగేస్తున్నారు." కోపంగా అన్నాడు ఆనందరావు.

    "నాకు పేకాటలో పదివేలు బాకీ పడ్డాడు నాకు అమ్మాడు" సుబ్బారావు అన్నాడు.

    "నాతో పేకాడి పాతికవేలు అప్పుపడ్డాడు. నాక్కూడా ఇల్లమ్మాడు. లక్షరూపాయలు బయానా తీసుకున్నాడు.

    " రంగారావు అరిచాడు. "ఇల్లు మీకే అమ్మాలన్నాడు మా అల్లుడు అని చెప్పి నా దగ్గర ఏబైవేలు పుచ్చుకున్నారు. మీ మామగారు ఆక్రోశించాడు సూర్యారావు. "వెంకట్రావు ఆవేశంతో రగిలిపోయాడు.

    "మామగాదు దోమగాదు. పెద్ద వెధవని పేరు పెట్టి పిలిస్తే బాగుండదని వరస కలిపి పిలిచా. నాలుగు రోజులింత పిండం పడేశా నేను పెట్టిన పిండం తిని నా అండపిండాలు పగలగొడతానని నేనూసహించలేదు. బిలీవ్ మి వాడికి మాకూ ఏ సంబంధం లేదు" పెద్దగా అన్నాడు వెంకట్రావు.

    "ఏవండోయ్ వెంకట్రావుగారూ...ఆయన పదిరోజుల నుంచీ మీ ఇంట్లో ఉండటం, మామయ్యగారూ అని మీరు, బాబాయ్ అని సుందరీ పిలుస్తుండటం రోజూ మా చెవులారా వింటూనే ఉన్నాం. ఇప్పుడు మామ కాదంటారేం" ఏ సంబంధం లేనివాడు ఇన్నాళ్ళనుంచి మీ ఇంట్లో ఎలా ఉంటున్నాడు? డబ్బు ఆయన చేతికిచ్చి దాటవేయించారు" కోపంగా అన్నది ఆండాళ్ళమ్మ.

    "ఎక్కడ ఆ గాడిద కొడుకు? వాడి తిత్తి తీస్తాను ఎక్కడే మీ బాబాయ్. ఛీ..ఛీ..ఆ దున్నపోతు జూదంలో సొంత ఇళ్ళూ వాకిళ్ళు అమ్ముకోవడం అయిపోయి ఊళ్ళో వాళ్ళ మీద పడ్డాడన్నమాట." సుందరిని చూసి అరిచాడు వెంకట్రావు.

    "ఏమో మరి. పొద్దుట్నించి కనిపించడం లేదండీ" చెప్పింది సుందరి.

    "వెంకట్రావుగారూ. అందంతా మాకు తెలియదు. మర్యాదగా మా డబ్బు మాకు కక్కండి లేకపోతే చీటింగ్ కేసు పెట్టాల్సొస్తుంది" హెచ్చరించాడు మరొకాయన.

    "బాబూ..మా ఇంటివాస్తు దివ్యంగా ఉంది. మూఢనమ్మకాల బారిన పడి ఒక దశలో ఇల్లు అమ్ముకోవాలనుకున్న మాట నిజం. కానీ నాకు వాస్తు చెప్పిన వాడు దొంగ ముండాకొడుకన్న విషయం తెలిసిన తరువాత నా కలాంటి నమ్మకాలు పోయాయి. ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది పదండి మీతోపాటు నేను కూడా పోలీసు స్టేషన్ కు వస్తాను" అన్నాడు వెంకట్రావు.

    "అవసరం లేదు" అన్నమాట వినిపించింది.

    అందరూ అటువైపు చూశారు మీసాలు మెలిదిప్పుతూ కనకలింగం, అతని చంకలో పిల్లిలా వణుకుతూ వక్రతుండం.

    "పాతగోతాం భుజాన వేసుకుని బస్టాండుళో తెచ్చాడు. ఎవడినైనా మర్డర్ చేసి పార్శిల్ తీసుకెళ్ళుతున్నాడేమోనని అనుమానం వచ్చి పట్టుకున్నా విప్పి చూస్తే నోట్ల కట్టలు. నాలుగు ఉతకగానే చెప్పాడు నిజమోకాదో అని లాక్కొచ్చాను" చెప్పాడు కనకలింగం.

    "ఆ డబ్బు మాదే వాడిని కొట్టండి నరకండి చంపండి" అరిచారు అందరూ.

    "నో ఆపనిచెయ్యడానికి మేమున్నాం చట్టం మీ చుట్టం కాదు కోర్టుకొచ్చి మీ మీ డబ్బులు తీసుకెళ్ళండి అయ్యా బాబూ పదిహేనేళ్ళుగా హెడ్ కానిస్టేబుల్ పదవిలో వేలాడుతున్నాను. మీకు పుణ్యం ఉంటుంది కొంచెం మీరంతా నన్ను యస్సై పోస్టుకు రెకమెండ్ చెయ్యండి" దణ్డం పెట్టాడు కనకలింగం.

    "యస్సై ఏం ఖర్మ మిమ్మల్ని యస్పీ చెయ్యాలని స్టేషన్ ముందు ధర్నా చేస్తాం పదండి" అన్నారందరూ ఆనందంతో.

    "అయ్యా కనకలింగం గారూ తమరనుమతిస్తే ఒక్క మనవిచేస్తా" అన్నాడు వక్రతుండం తలవంచుకుని.

    "ఏంట్రా? నాయిల్లు కూడా అమ్మేస్తావా?" అన్నాడు కనకలింగం లాఠీ ఎత్తి "కాదు బాబూ. కాదూ. అందరూ వినండి బాబూ పేకాటవల్ల నేను పతనమై పోయాను ఈగతి పట్టాను కనుక మీరెవ్వరూ జన్మలో పేక ముక్కల వంక చూడద్దు అలాగే దొంగబాబులు, దొంగస్వాములు వంటివారి బారిన పడొద్దు. ఎవడైతే డబ్బు నాశిస్తాడో వాడు స్వామేకాదు ఇది నా సందేశం" అన్నాడు వక్రతుండం. అందరూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు.

    వెంకట్రావు సుందరిని గిరగిర తిప్పాడు సంతోషం పట్టలేక.

    "ష్ ఇది పబ్లిక్ ప్లేసు బెడ్ రూమ్ లో వాస్తు అద్భుతంగా ఉంటుంది." అంటూ నవ్వింది సుందరి.

    ( సమాప్తం )

  • Next