• Prev
  • Next
  • Yeluka Vacche Illu Bhadram 60

     

    This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

    ఎలుక వచ్చే ఇల్లు భద్రం 60

    ఇలపావులూరి మురళీమోహనరావు

    ఆఫీసులో కూర్చున్నాడన్న మాటేకాని వెంకట్రావు మనసు మనసులో లేదు. కూర్చున్నా నిలుచున్నా ఫైలు తెరిచినా మరో పనిచేస్తున్నా తను కుంటి వాడైనట్లు, గుడ్డివాడైనట్లు, సుందరికి క్షయ, కుష్టులాంటి వ్యాధులు సోకినట్లు పరమ నికృష్టపులోచనలు మదిని తొలుస్తూనే ఉన్నాయి.

    ఆ సమయంలోనే తన కొలీగ్సు వాసు లోపాలతో తామనుభవిస్తున్న కష్టనష్టాలు ఏకరువు పెట్టడం వాస్తు మార్పులు చసి తామా బాధ నివారణ పొందిన వైనం, రకరకాల పత్రికలలో ఫలానా వారి వాస్తు సలహాలు పొంది తాము సాధించిన విజయాలు వివరిస్తుండటం లాంటివి వెంకట్రావును బుర్రను తినేస్తున్నాయి.

    ఈశాన్యం మూలనున్న చెట్టును నరకగానే అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చిందని ఒకడు, నైరుతిమూల ద్వార బంధాలు తొలగించాగానే తనకు ప్రమోషన్ వచ్చిందని మరొకడు, కాంపౌండ్ వాల్ కొంచెం ఎత్తు లేపగానే బిజినెస్ బ్రహ్మాడంగా వృద్ధి చెందినదని ఒకడు...ఇలాంటి అనుభవాలు వెంకట్రావును తీవ్రాలోచనలో పడవేశాయి.

    ఇల్లు అమ్మడమా లేక వాస్తు పండితులు సూచించిన మార్పులు చెయ్యడమా తేల్చుకోలేక పోతున్నాడు. "ఏవండోయ్ వెంకట్రావు గారూ ఇవాళ్టి పేపర్ చూశారా?" అడిగింది భారతి.

    "ఆ...ఏ పేపరు చూసినా ఏమున్నది గర్వకారణం ! అన్ని పేజీలు స్కాములు, స్కీములు వార్తల మాయం" ముభావంగా అన్నాడు వెంకట్రావు. పక పక నవ్వింది భారతి.

    "ఏమిటి అంత మూడీగా ఉన్నారు? కవిత్వం కూడా తన్నుకొస్తున్నది. వద్దుబాబూ వద్దు. నా చెవులు శుభ్రంగా పనిచేస్తున్నాయి" అన్నది.

    "అంటే నా కవిత్వం చెవిటి వాళ్ళముందు చెప్పమనా మీ ఉద్దేశ్యం?" నవ్వాడు వెంకట్రావు.

    "వద్దులెండి. అందరూ బాగుండాలని నా ఉద్దేశ్యం. అన్నట్లు అసలు విషయం. ఈ మధ్య మీ ఇంటిని ఎవరో వాస్తు పండితులకు చూపించారు కదూ ఎవరు వాళ్ళు?"

    "ఓ! వాళ్ళా! అబ్బో...ఉద్దండ పండితులు. వాస్తుభూషణం అని ! మహాజ్ఞాని. త్రికాలవేది. మనోనేత్రంతో మా ఇల్లు చూసి లోపాలు చెప్పాడు. అటువంటి వారి దర్శనం దొరకడమే గొప్ప అదృష్టం."

    "అవునవును, ఇక వారి విశ్వరూప దర్శనం దొరికితే ఎంత మురిసిపోతారో మీరు?"

    "దేనికైనా అదృష్టం ఉండాలి."

    "ఆ అదృష్టం ఇవాళ యవద్దేశానికీ కలిగింది. మీరు కూడా చూసి తరించండి" పేపర్ ఇచ్చింది భారతి.

    మొదటిపేజీలో వాస్తుభూషణం, వాస్తు విభూషణా చార్యులను సంకెళ్ళు వేసి పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యం చూసి పక్కనే బాంబు పడ్డట్లు ఎగిరి పడ్డాడు వెంకట్రావు. వాస్తు పేరుతో ఘరానా వంచన ! ఇద్దరూ మోసగాళ్ళ అరెస్ట్ !! వాస్తు నిపుణుల పేరుతో గత పది సంవత్సరాలుగా నగర ప్రజలనే కాక యవద్దేశాన్నీ వంచిస్తున్న ఇద్దరూ తోడుదొంగలను నగర పోలీసులు నేడు అరెస్టు చేశారు. వాస్తు భూషణం, వాస్తు విభూషణాచార్యులు అనే పేర్లతో చలామణీ అవుతున్న ఈ ఇద్దరూ గతంలో క్రూర హంతకులు. పది సంవత్సరాల క్రితం విజయవాడలో ఒక భూస్వామి ఇంట్లో దోపిడీ చేసి అడ్డువచ్చిన ఆరుగురు కుటుంబ సభ్యులను తెగనరికి ఆచూకీ తెలియకుండా పోయిన కత్తుల శంకర్ పేరు పాఠకులకు గుర్తుండే ఉంటుంది.

    ఆ తరువాత కూడా పలు దోపిడీలు హత్యలు కొనసాగించిన శంకర్ రాను రాను పోలీసుల నుంచి ముప్పు అధికం కావడంతో నగరానికి వచ్చి వాస్తు నిపుణుడిగా అవతారం ఎత్తాడు.

    వాస్తుపట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ఆసరాచేసుకుని నోటికొచ్చిన సలహాలివ్వ సాగాడు. యాదృచ్చికంగా ఫలించడంతో క్లయింట్ల సంఖ్యా పెరగడంతో పాటు రాబడి కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దాంతో దోపిడీలు, హత్యలకంటే ఈ వృత్తి బాగుందని నిర్ణయించుకున్న శంకర్ వేషభాషలు పూర్తిగా మార్చి బంజారాహిల్స్ లో అతి చవకగా రెండెకరాల భూమిని సంపాదించి ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు.

    పెట్టుడు గడ్డాన్ని మీసాలను పెట్టుకుని ముఖాన్నెవరూ గుర్తించకుండా దట్టంగా విభూది, గంధం పట్టించేవాడు. తన అనుచరులలో కొందరికీ శిక్షణనిచ్చి క్లయింట్ల మాదిరిగా తిప్పిస్తూ తన గురించి వారు గొప్పగా మాట్లాడేటట్లు పకడ్బందీగా ప్లాన్ చేసేవాడు. వారంతా క్యూలలో క్లయింట్ల వెనుక నిలబడి వాస్తుభూషణం మహత్యాలను చిలవలు పలవలుగా వర్ణిస్తూ క్లయింట్లకు విశ్వాసం కలిగించేవాడు.

    అంతటితో ఆగక సాయంత్రం వేళల్లో రోడ్డు పక్కన బండిపెట్టుకుని మిరపకాయ బజ్జీలమ్మె కొందరు యువకులను చేరదీసి తన ఆశ్రమం ఆవరణలోనే క్యాంటీన్ పెట్టించి జర్మనీకి చెందిన పెసర్దోస్ కంపెనీ వారిదని ప్రచారం చేసి ఆహారపదార్థాలను విపరీతమైన ధరలకు అమ్మించేవాడు.

    జర్మనీలోనే కాదు. అసలు ప్రపంచంలోనే పెసర్దోస్ అనే కంపెనీ లేదని పోలీసుల విచారణలో తేలింది. అసలు క్లయింట్లు అయిదుగురుంటే నకిలీ క్లయింట్లు నలభైమంది ఉండేవారు. తాను చాలా బిజీగా ఉన్నట్లు నమ్మిస్తూ అర్జెంటుగా రావాలంటే అధిక మొత్తం ఫీజుగా గుంజేవాడు. క్లయింట్లలో సామాన్య ప్రజలే కాక పెద్ద పెద్ద అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు కూడా ఉండటం విచిత్రం.

    ఇదిలా ఉండగా గుంటూరు జంట హత్యల కేసులో నిందితుడైన గంటు భీముడు కూడా నాలుగు సంవత్సరాల క్రితం వాస్తుభూషణాచార్యులుగా అవతారమెత్తి, ప్రజలను మోసం చేస్తూ వాస్తు భూషణంతో జత కలిశాడు. గత సంవత్సర కాలంగా వీరి కార్యకలాపాలపై నిఘా ఉంచిన పోలీసులు ఒక ఇరానీ హోటల్లో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసుకు 'మర్యాద' చేసిన తరువాత నిందితులు తమ నేరాలను అంగీకరించారు.

    హత్యలు, దోపిడీలలో ఉన్న రిస్కు మూలంగా ఆ వృత్తులను వదిలిపెట్టి ప్రజలలోని బలహీనతలను సొమ్ము చేసుకోవడానికే వాస్తు పండితులుగా అవతారమెత్తినట్లు విలేకరులకు తెలిపారు. నిజానికి వాస్తు విషయాల గురించి తమకేమి తెలియదని, నోటికొచ్చిన సలహాలు ఇస్తుండేవారమని, పొరబాటున అవి నిజమైతే తమ గురించి వారే ప్రచారం చేసేవారని చెప్పారు. నిందితులిద్దరినీ వచ్చేనెల ఇరవై నాల్గవ తేదీ వరకూ రిమాండ్ లో ఉంచాలని మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు." నిర్ఘాంతపోయాడు వెంకట్రావు.

    మేధావులనుకునే వారు కూడా ఇలాంటి వారి వలలో చిక్కి మోసపోవడం పట్ల చింతించాడు. వారి మాటలు నమ్మి ఇల్లు కూలగొట్టనందుకు సంతోషించాడు. వెంకత్రావులో కొత్త ఉత్సాహం వచ్చింది. పేపర్ తీసుకుని మేనేజర్ గదిలోకి దూరాడు.

    "ఏంటోయ్ వెంకట్రావ్, చాలా హుషారుగా కనిపిస్తున్నావ్? ఏమంటున్నది మా అమ్మాయి? అల్లరీ ఆగం మానేసిందా?" నవ్వుతూ అడిగాడు మేనేజర్ తను వెంకట్రావుకు అంటగట్టిన పిల్లి పిల్లను తల్చుకుని.

    "చేసిన అల్లరి చాలుసార్..ఇక పుట్టింటికి పంపించాలనుకున్నాను" అన్నాడు వెంకట్రావ్.

    "మైగాడ్..అంతపని చెయ్యకు. మా ఆవిడ చెప్పుచ్చుకు కొడుతుంది. దాన్ని వదిలించు కోవడానికి శతకష్టాలు పడ్డాను. కావాలంటే మరో రెండు ఇంక్రిమెంట్లు శాంక్షన్ చేస్తాను" దణ్డం పెట్టాడు మేనేజర్.

    "దాని పీడ ఎప్పుడో వదిలించుకున్నాను సార్. ఇప్పుడు మరో అతిపెద్ద పీడనుంచి బయట పడ్డాను." వాస్తు భూషణం విషయం చెప్పాడు వెంకట్రావు.

    "ఈజిట్!" సంభ్రమంగా అన్నాడు మేనేజర్.

    "యస్సార్..కొంత ఖర్చయినా గుణపాఠం నేర్చుకున్నాను."

    "వెరీగుడ్..వెంటనే మీ ఆవిడకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. విషాద వార్తలు ముందు తల్లితోను, సంతోష వార్తలు ముందు భార్యతోను చెప్పాలి. వాస్తులో లోపాలున్నాయని ఈ విషయం ఋజువు చేస్తున్నది." వెంటనే సుందరికి రింగ్ చేశాడు వెంకట్రావు.

    "మీరు వెంటనే ఇంటికి రండి. ఇక్కడంతా గోలగోలగా ఉన్నది" అన్నది సుందరి.

    "మళ్ళీ ఏం గోల?" ఆందోళనగా అడిగాడు వెంకట్రావు.

    "మనిల్లు రిజిస్టర్ చెయ్యమని దాదాపు వందమంది వచ్చి గొడవ చేస్తున్నారు. ఇల్లు అమ్ముతున్నామని చెప్పి మా బాబాయి పదిమంది దగ్గర అద్వానులు తీసుకున్నాడట" చెప్పింది సుందరి.

    "రాస్కెల్ ...అదేమైనా వాడి తాతగాడి ఆస్తనుకున్నాడా? లేక మనిల్లు చూపించి ఎక్కడైనా పెకాడాడా? వాడి మక్కెలు విరగదంతాను. ఇప్పుడే వస్తున్నాను" ఫోన్ పెట్టాడు వెంకట్రావు.

    "వాట్ హేపెండ్?" పైపు వెలిగించి గుప్పు గుప్పున మేఘాలను సృష్టిస్తూ అడిగాడు మేనేజర్. జరిగింది చెప్పాడు వెంకట్రావు.

    "అంతపని జరిగిందా? అయితే నువ్వు తక్షణమే వెళ్ళు. అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి. యస్సైతో మాట్లాడి పంపిస్తాను" అన్నాడు మేనేజర్.

    "యస్సార్" వెళ్ళబోయాడు వెంకట్రావు.

    "వన్ మినిట్ వెంకట్రావ్..పబ్లిక్ ఏరియాస్ లో స్మోకింగ్ చెయ్యకూడదని ఈ మధ్య సుప్రీం కోర్టు రూలింగిచ్చింది. కనుక ఆఫీసులో ఎవ్వరూ సిగరెట్లు, బీడీలు, చుట్టాలు తాగరాదని నోటీసు తయారు చేసి అంటించమని భారతితో చెప్పు" చెప్పాడు మేనేజర్ మరో మేఘాన్ని సృష్టించి.

    "ష్యూర్ సర్... మీ అగ్గిపెట్టె లోంచి రెండు పుల్లలివ్వండి. సిగరెట్ తాగి పది నిముషాలైంది. నాలిక పీకుతున్నది" అన్నాడు వెంకట్రావు.

    "రెండు పుల్లలేం ఖర్మ. కావాలంటే అగ్గిపెట్టె తీసుకో మరోటి నా దగ్గరుందిలే" అగ్గిపెట్టె ఇచ్చాడు మేనేజర్.

    "థ్యాంక్యూ సార్" అని బయటకొచ్చి సిగరెట్ పీల్చి మేఘాలను వదిలాడు వెంకట్రావు. ఎంతో రిలీఫ్ గా ఉందిపుడు.

    "భారతిగారూ...స్మోకింగ్ ఈజ్ స్ట్రిక్ట్ లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద ఆఫీస్ యాజ్ పర్ రూలింగ్ బై సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా విత్ ఇమ్మిడియట్ ఎఫెక్ట్ అని నోటిస్ ప్రిపేర్ చేసి వెంటనే నోటీస్ బోర్డ్ లో పెట్టమని చెప్పారు మేనేజర్ గారు" అన్నాడు మరో దమ్ములాగి. బయటకొచ్చి హెల్మెట్ పెట్టుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడు. వాయువేగంతో వెళ్తున్నాడు. సరిగ్గా శాస్త్రిగారింట ముందుకు రాగానే జరిగిందా సంఘటన.

    {ఇంకావుంది}

    {హాసం వారి సౌజన్యంతో}

  • Prev
  • Next