• Prev
  • Next
  • Yeluka Vacche Illu Bhadram 58

    This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

     

    ఎలుక వచ్చే ఇల్లు భద్రం 58

     

    ఇలపావులూరి మురళీమోహనరావు

    రాముడికి సీతేమౌతుంది అని అడిగినట్లుంది. ఇంత చెప్పినా మళ్ళా పేకాటను పిచ్చే అంటుంది. అమ్మాయి "నవ్వాడు వక్రతుండం. "పేకాట గురించి మీరో థీసిన్ రాయచ్చు. అయితే మామయ్యగారూ. ప్రస్తుతం మీకేదైనా ఆస్తి మిగిలిందా?" నవ్వుతూ అడిగాడు వెంకట్రావు.

    "ఇవిగో..నిమ్మకాయను నిలబెట్టగల ఈ మీసాలే ప్రస్తుతం నా ఆస్తి. ఏదో నాలుగూళ్ళలో వాస్తు చెప్పుకుంటూ బండీడుస్తున్నాను. చిన్నప్పుడే వాస్తు శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యనం చెయ్యడం ఇప్పుడు నా పాలిట వరప్రసాదమైంది." మీసాలను మెలిబెడుతూ అన్నాడు వక్రతుండం.

    "మరి ఇంటి సంగతేం చేద్దామంటారు?" అడిగాడు వెంకట్రావు.

    "అమ్మేసేద్దాం. ఇన్ని వాస్తులోపాల ఇంట్లో ఉండి నరకబాదలనుభవించేకన్నా నాలుగైదు వేలు పోసి అయినా అద్దేఇంట్లో ఉండటం ఉత్తమం. ఆ సంగతి నాకొదిలెయ్యండి" అన్నాడు వక్రతుండం.

    "ఇంతలో "సుందరీ..సుందరీ..." అని పిలిచింది ఆండాళమ్మ.

    "ఏమిటండీ..." పెరట్లోకి వెళ్ళి అడిగింది సుందరి.

    "ఇల్లు అమ్మకానికి పెట్టారా? అమ్మేట్లయితే మాకు చెప్పండి. మా తమ్ముడికి ఒక ఇల్లు కావాలట. మీ ఇల్లయితే మరీ హాయి. మాకు దగ్గర్లో తోడునీడగా ఉనతాడు" అన్నది ఆండాళమ్మ.

    సుందరి ముఖం ఎర్రబడింది.

    "ఇల్లు అమ్ముతున్నామా ? ఎవరు చెప్పారు మీకు?" కోపాన్ని నిగ్రహించుకుని అడిగింది.

    "అదే మీరు చెప్పుకుంటున్నారుగా.."

    "అంటే..ఇందాకట్నుంచీ గోడ దగ్గర నిలబడి మా మాటలన్నీ వింటున్నారా?"

    "అబ్బెబ్బే..అదేం లేదు సుందరీ. ఈ దువ్వెన నిండా మట్టిచేరింది. పిన్నీసుతో శుభ్రం చేస్తూంటే ఏదో ఇల్లు అమ్ముతున్నట్లుగా అర్థమైంది. మీరీ మధ్య చాలామంది వాస్తు పండితులకు ఇల్లు చూపిస్తున్నారుగా. అందువల్ల వాస్తు బాగాలేదని అమ్ముతున్నారనుకున్నాను."

    "ఇల్లమ్ముకోవలసిన ఖర్మ మాకేం పట్టలేదు. కావాలనుకుంటే మరో ఇల్లు కొనుక్కోగలం" అన్నది కోపంగా సుందరి.

    "కోప్పడకు సుందరీ. ఇరుగుపొరుగు వాళ్ళం ఆ మాత్రం ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా? మీరు మళ్ళా వాళ్ళను వీళ్ళను అడగడం, పేపర్లో ప్రకటనలివ్వడం. దేనికి శ్రమ? మేమైతే డైరెక్టు హ్యాండ్ క్యాష్ ఇచ్చి రిజిస్ట్రీ చేయించుకుంటాం." అన్నది ఆండాళ్ళమ్మ. వెంకట్రావుకు రగిలిపోయింది.

    "ఎంతకు కొంటారు?" అడిగాడు ఆవేశాన్ని అణుచుకుంటూ.

    "మూడు లక్షలకైతే మావాడు సిద్ధంగా ఉన్నాడు."

    "మేము ఆరు లక్షలు పోసి కట్టించాం."

    "నిజమే అనుకోండి. కానీ వాస్తులోపాలు చాలా ఉన్నాయి కదా ! వాటన్నిటినీ మేము బాగుచేయించుకుంటే అంత అవుతుంది."

    "సర్లెండి. మేము ఎవరికీ అమ్ముదల్చుకోలేదు."

    "దాన్దేముంది తమ్ముడూ. కానీ అమ్మేటప్పుడు మాత్రం మాకే చెప్పండి." లోపలకు వెళ్ళింది ఆండాళ్ళమ్మ.

    "పొరుగువాళ్ళు ఏదైనా అమ్ముకుంటున్నారంటే ఎంత సంతోషమో చూడండి దీనికి. వ్యవహారం మాట్లాడుకునేటప్పుడు చిన్నగా మాట్లాడుకోవాలి. అందుకే గోడకు చెవులుంటాయి అంటారు పెద్దలు" అక్కసుగా అన్నది సుందరి.

    "గోడకు చెవుల సంగతేమో కానీ దీని రెండు చెవులు మన గోదాలోనే ఉంటాయి. దీని చెవుల్లోని కర్ణభేరులు మహా సునితమైనవి. పోలీసుకుక్కలు ఆమడ దూరంలోని వాసనను సైతం పసిగట్టినట్లు మనం మనసులో ఆలోచించుకుంటున్నా దాని చెవులకు వినపడుతుంది" కోపంగా అన్నాడు వెంకట్రావు.

    "మీరు మాత్రం భలేగా సమాధానం చెప్పారు" మెచ్చుకుంది సుందరి.

    "మరి! నాకు కోపం వస్తే అంతే ! ఎటువంటి వారినైనా లెక్క చెయ్యను. నాకు ఆఫీసుకు టైమవుతున్నది. ఏమైతే అదౌతుంది. అంతగా ఏదన్నా అయితే మరో ఇంట్లోకెళ్ళి అద్దెకుందాం. ఇల్లమే ప్రసక్తి లేదు" అన్నాడు వెంకట్రావు.

    * * *

    వాకిట్లో నిలుచుని పేకముక్కల్ని కలుపుతున్నాడు వక్రతుండం.

    "సిటీ అంతా భ్రష్టుపట్టిపోతున్నది. నేనువచ్చి మూడుగంటలు దాటినా పేకాడటానికి ఒక్కవెధవా దొరకడం లేదు. ఏం చేస్తుంటారో ఏంటో అంట్ల వెధవలు" అనుకుంటున్నాడు. దూరంగా విజిల్ సౌండు వినిపించింది. అటువైపు చూశాడు. ఎదురింటి ఆనందరావు సైగలు చేస్తూ రమ్మంటున్నాడు.

    "ఏమిటీ అన్నట్లు చూశాడు వక్రతుండం."

    "ఒక్కముక్క వినిపోండి" అన్నాడు ఆనందరావు. వక్రతుండం చెవుల్లో అమృతం పోసినట్లయింది. "ఓ యస్.. ఒక్క ముక్కేం ఖర్మ. మూడు ముక్కలు, పదమూడు ముక్కలు, ఏదైనా సరే చేతులు ఒకటే దురదపుడుతున్నాయి. మూడు గంటల పాటు పేకాడకుండా నా జీవితంలో ఎన్నడూ గడపలేదు" వెళ్ళి అన్నాడు వక్రతుండం.

    నవ్వాడు ఆనందరావు.

    {ఇంకావుంది}

    {హాసం వారి సౌజన్యంతో}

  • Prev
  • Next