• Prev
  • Next
  • Yeluka Vacche Illu Bhadram 57

    This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

    ఎలుక వచ్చే ఇల్లు భద్రం 57

    ఇలపావులూరి మురళీమోహన రావు

    "అంటే మీరు రియలెస్టేట్ బిజినెస్ చేసేవారా?"

    "రియలెస్టేటా నా బొందా? అన్నీ సొంతిళ్ళే అమ్ముకున్నాడు" చెప్పింది సుందరి.

    "సొంతిళ్ళా? ఎన్నిళ్ళున్నాయి మీకు? దేనికమ్మారు?" ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్రావు.

    "దేనికా? పేకాటకు" నిష్టూరంగా అన్నది సుందరి.

    "చూడమ్మాయ్..అలా అనకూడదు.పేకాట అనేది నిమిత్త మాత్రం. అసలు కారణం పరువు ప్రతిష్టలు. చూడండి అల్లుడుగారూ.. నేను ఇరవై నాలుగు గంటలూ పేకాటాదే మాట నిజం. పేకాట కోసం అరడజను వారసత్వంగా వచ్చిన ఇళ్ళు, అరవై ఎకరాల పొలం, నూటిరవై సవర్ల బంగారం అమ్మిన మాట నిజమే. ఒకసారి డబ్బులన్నీ అయిపోయి ఒకడికి ఐదురూపాయలు అప్పుపడ్డాను. అంత మాత్రానికి వాడు మా వంశం గురించి అనరాని మాట అన్నాడు. పరువుకోసం ప్రాణాలిచ్చే వంశం మాది. అందుకే అయిదు రూపాయల కింద ఎకరం పొలం రాసిచ్చేశాను. ఈ నాటికి ఆ సంఘటనను మా ప్రాంతంలో ఒక విశేషంగా చెప్పుకుంటారు" నవ్వుతూ చెప్పాడు వక్రతుండం.

    "అబ్బో అయితే మీకు పేకాట పిచ్చి చాలా ఉందే" అన్నాడు వెంకట్రావు.

    "అదే మనదేశా దౌర్భాగ్యం. క్రికెట్టును, హాకీని, బరువులెత్తడం, దించడం లాంటి వాటిని ఆటలంటారు. ఇంకా అందంగా క్రీడలు అంటారు. పేకాటను మాత్రం పిచ్చి అంటారు. మనవాళ్ళకసలు టేస్టులేదు. నన్నడిగితే పేకాట అనేది ఎ గేమ్ ఆఫ్ స్కిల్. పదమూడు ముక్కల్లో ఎంత టెన్షన్?! ఏం ముక్కలొస్తాయో తెలియదు. అవతల వాడికి ఏం కావాలో ఊహించి గ్రహించి వాడికి కావలసింది వెయ్యకూడదు."

    "అయితే అనుభవం బాగానే సంపాదించారు."

    "పేకాటలో నాది అరవై ఏళ్ళ అనుభవం. కార్డు వెనుక నుంచి చూసి అదేం కార్డో చెప్పగలను. నా జీవితంలో నేను కొన్న పేక సెట్లు నిజంగా భద్రపరచాలంటే వుడ్ కార్పొరేషన్ వారి గోడౌన్లు కూడా సరిపోవు. అదేదో పిన్సీసు బుక్కో ఏదో అంటారు చూడండి"

    "గిన్నీస్ బుక్"

    "ఆ..అదే..న్యాయానికి నాపేరు దాన్లో సువర్ణాక్షరాలతో లిఖించాలి."

    "అంత మజా ఉందా పేకాటలో?" "తిన్నగా అంటారేంటి? పెకాడుతుంటే ఆకలికాదు. నిద్ర పట్టదు. డబ్బుగెలిచినా అడాలనిపిస్తుంది. ఓడినా ఇంకా ఆడాలనిపిస్తుంది. ఎంతసేపు ఆడినా విసుగు పుట్టదు. రెండు రోజులు కూర్చున్నా నడుము నొప్పి అనిపించదు. ఒకసారేమైందో తెలుసా?"

    "చెప్పండి"

    ఒకరోజు నేను క్లాబుకు పోతుంటే మీ ఆవిడకు నెలతప్పింది. సాయంకాలం ఆస్పత్రికి తీస్కెళ్ళాలిరా అన్నది మా అమ్మ. సరేనని వెళ్ళాను. రమ్మీ భలే రంజుగా సాగుతున్నది. ఒకటే ఉత్కంఠ. అది ఉదయమో తెలియదు. నేనేదైనా పనిమొదలు పెట్టానంటే శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతో చేస్తాను. మీ ఆవిడ ప్రసవించింది ఇంటికి రారా అని మా అమ్మ కబురు పంపిస్తేగానీ తెలియలేదు. అప్పటికి తొమ్మిది మాసాలనుంచి ఆపకుండా ఆడుతున్నానని" పెద్దగా నవ్వాడు వక్రతుండం.

    నోరు తెరిచాడు వెంకట్రావు.

    "మరీ అంత పట్టుదలా?" అన్నాడు.

    "మరి! మన పెద్దలేమన్నారు? పట్టరాదు. పట్టి వీడరాదు అన్నారు. ముక్కలు చేతపట్టామంటే అమీతుమీ తేలిందాకా వదలక పోవడం శూరుల లక్షణం."

    "పెద్దలు ఆ మాటన్నది పేకాటకా?" అన్నది సుందరి.

    "చూడమ్మాయ్ సామెతలను మనకు సరిపోయేట్లుగా అన్వయించుకోవడం వివేకుల లక్షణం."

    "పేకాట అనేది ఒక మత్తు లాంటిది" అన్నాడు వెంకట్రావు.

    "పొరబాటు. అదో గమ్మత్తు. ఒక విషయం తెలుసా? పెళ్ళిళ్ళకు వెళ్లిన మగాళ్ళలో ఎంతమంది అసలు పెళ్ళి చూస్తున్నారు. పెళ్ళి మంటపం ఎక్కడుందో కూడా చూడకుండా పేకాటకు ఎక్కడ దుప్పటి పరచాలా అని చూస్తారు. ఆఖరుకు సూత్రధారణ సమయంలో కూడా కూర్చున్న చోటునుంచే అక్షింతలు ఎడమచేత్తో విసిరేస్తుంటారు. ఒకసారి నేను అలా విసిరినా అక్షింతలు అక్కడున్న వెధవముండ బోడిగుండు మీద పడటంతో అది మమ్మల్ని తిట్టి దిగపారబోసింది."

    "ఎంత అనుభవముంటే ఏం లాభం ? ఆస్తులన్నీ పోగొట్టుకున్నారుగా!"

    "అది ఆత్మజ్ఞానం లేనివాళ్ళనే మాట. వెధవాస్తులు! పోయేటప్పుడు కట్టుకుపోతామా? మనిషికి అరవై ఎకరాల భూమి ఉన్నా చచ్చిన తరువాత కావలసినదెంత? ధర్మరాజు ఎంతటి జ్ఞాని! అటువంటి వాడు రాజ్యాన్ని, అన్నదమ్ముల్ని, జాయింటు భార్యను సైతం పాచికలాటలో పోగొట్టుకున్నాడు. అంత మాత్రాన ఆయన పరువు ప్రతిష్టలలు భంగం కలిగిందా? గౌరవం తరిగిందా? ఆయనను జూదగాడని లోకం నిందించిందా?లేదే? మాట కోసం అడవుల పాలైన ఘనుడిగా ముల్లోకాలూ ఆయనను కీర్తించాయ్! ఆ రోజుల్లో ప్రజలకు అంతటి సంస్కారం ఉన్నది. కాబట్టే ధర్మం నాలుగు పాదాలా నడిచింది."

    "పోనీ వాళ్ళు పడిన కష్టాలు చూసినా ఇటువంటి జూదాలు మానుకోవద్దు కదా?"

    "చూడం డల్లుడుగారూ. యోద్ధం అన్న తరువాత ఎవరో ఒకరే గెలుస్తారు. గెలుపు ఓటమి చీకటి వెలుగుల్లంటివి. ఎల్లకాలమూ చీకటి ఉండనట్లే ఓటమే ఉండదు. గెలుపోటముల చాలా సహజం. ధీరుడెపుడూ ఓటమిని పట్టించుకోడు. పేకాటలోణి ఉత్తేజం, ఉద్వేగం తెలిసిన వాడు ఓటమిని గడ్డిపరకలా చూస్తాడు."

    "ఏంటో ఆ ఉత్తేజం, ఉద్వేగం."

    {ఇంకావుంది}

    {హాసం వారి సౌజన్యంతో}

  • Prev
  • Next