Antera Bamardee 15

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 

అంతేరా బామ్మర్దీ - 15

*******************************************************************

బస్టాపులో బల్ల మీద కూచున్న రంగనాథాన్ని ఒక పెద్ద మనిషి ఎంతో మర్యాద పూర్వకంగా పలకరించాడు.

“ అయ్యా! తొమ్మిదో నెంబరు బస్సు ఎప్పుడు వస్తుందంటారు ?” అని.

ఆ పెద్ద మనిషిని రంగనాథం ఎగాదిగా చూస్తూ " తొమ్మిదో నెంబరు బస్సు ?” అన్నాడు తాపీగా.

“ అవునండి " అన్నాడు ఆ పెద్ద మనిషి.

“ ఎప్పుడొస్తుంది ?” అని కూడా తాపీగానే అన్నాడు రంగనాథం.

“ అంతేనండి " అన్నాడు ఆ పెద్ద మనిషి.

“ వెళ్లి కంట్రోలర్ని అడుగు " అని విసుగ్గా అన్నాడు రంగనాథం.

“ కంట్రోలరా? అతనెక్కడ వుంటాడో ?” అన్నాడు ఆ పెద్ద మనిషి.

రంగనాథం ఇక ఓర్చుకోలేకపోయేడు. అంచేత తన ధోరణీలో నిప్పులు తొక్కడం ప్రారంభించాడు.

“ ఏమిటయ్యా? అసలేమిటి నీ ఉద్దేశ్యం ? వాడెవడో మేష్టారు అని పలకరించి నన్ను బడి పంతుల్ని చేసేడు . నువ్వేమో ఆర్టీసీ బస్సు గురించీ, కంట్రోలరు గురించీ అడిగి నన్ను మూటలు మోసే మేస్త్రిని చేస్తున్నావ్ ? దేనికైనా కామన్ సేన్సంటూ ఒకటి అఘోరించాలి!”అని.

“ ఎందుకండీ అట్లా వేడెక్కిపోతారు? తొమ్మిదో నెంబరు బస్సు ఎప్పుడొస్తుందని అడిగెను. తెలిస్తే చెప్పండి. లేకపోతే తెలీదని చెప్పండి. ఎందుకంత ఎక్కువగా మాట్లాడుతారు ?” అని ఆ పెద్ద మనిషి అన్నాడు.

“ అంతే! మా వరసంతే! చిన్నప్పుడు మాకు మా పెద్దవాళ్ళు వస ఎక్కువగా పోసేరు. అంచేత డబ్బాలో రాళ్ళేసి గిలకరించినట్టు కర్త, కర్మా, క్రియల్లేకుండా...లోడలోడా వాగేస్తుంటాం! వాగ్గేయకారులం. తప్పో రైటో మాకు తెలీయదు. మాట బాగుంది కనక వాడేను. వదిలేయ్!

తొమ్మిదో నెంబరు బస్సు ఎప్పుడొస్తుందో లెక్చర్లు దంచుతాం. కంట్రోలరు ఎక్కడుంటాడో వాడి డ్యూటీ ఏమిటో గంటల కొద్దీ మాటాడుతాం! మేమంతే ! నోరు విప్పితే కంకర రాళ్ళే. వెళ్లిపోతావెం? ఆగు! ఇంట్రడక్షన్ పూర్తయింది. చెప్పాల్సింది యింకా చాలా వుంది నిన్నే!” అన్నాడు రంగనాథం.

ఆ పెద్ద మనిషి అప్పటికే వెళ్ళిపోయాడు. రంగనాథం మాత్రం యింకా గోణుక్కుంటూనే వున్నాడు.

“ తొమ్మిదో బస్సట. తొమ్మిదో నెంబరు! అదొక దిక్కుమాలిన బస్సు! దానికో నెంబరు "అని.

రంగనాథానికి బాగా తెలిసిన మనిషే. పేరు కృష్ణమూర్తి. ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ కలుసుకోలేదు.చాలా కాలానికి కనిపించడంతో, అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణమూర్తి , రంగనాథాన్ని చూస్తూ ఆనందంగా అన్నాడు.

“ నమస్కారం రంగనాథం గారూ? బహుకాలం దర్శనం ?” అని.

రంగనాథం, కృష్ణమూర్తిని చూసేడు. ఏమి మాట్లాడలేదు.

“ బావున్నారా ?” అన్నాడు కృష్ణమూర్తి.

ఆ మాటతో రెచ్చిపోయి రంగనాథం " బాగోడమా? మేమేందుకు బావుంటాం? ఎక్కేంగా రోడ్డు! చూస్తూ అడుగుతావేం? మేము బాగుండం! అడుక్కుతింటాం! అమ్మా మాదాకబలం తల్లీ అంటూ ఇల్లిల్లూ తిరిగి అడుక్కుతింటూ బతుకుతాం!” అన్నాడు రంగనాథం.

“ అయ్యో! అవేం మాటలండీ! వంట్లో బాగాలేదా?” అన్నాడు కృష్ణమూర్తి.

“ ఏమి బావుంటుంది? అస్సలు బావుండదు. సమస్తమైన రోగాలూ ఒకేసారి తగులుకున్నాయి గదా! ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. వాళ్ళిచ్చే రంగునీళ్ళు లెక్క ప్రకారం మూడు పూటలా మింగుతూ బతికేస్తున్నాం! వంట్లో బాగాలేదా!?” అన్నాడు రంగనాథం.

కృష్ణమూర్తి, రంగనాథం వరసకి ఆశ్చర్యపోతూ, సంభాషణ పొడిగించడం మంచిది కాదనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాడు.

అలా వెళ్ళిపోతున్నా కృష్ణమూర్తిని చూస్తూ రంగనాథం విసుక్కుంటున్నాడు.

“ పలకరించడం ఎందుకు? పారిపోవడం ఎందుకు ? ఆ బసివిగాడేమో మమ్ముల్ని తరిమి తరిమి కొట్టేందుకు గుమ్మం దగ్గిర మనుషుల్ని పెట్టేడా! ఊళ్ళో జనం మమ్ముల్ని పలకరించి పారిపోతుంటారా? అంతేమరి! మమ్ముల్ని చూస్తే అందరికీ అలుసే! అలుసు" అని అందుబాటులో ఉన్న ఇనప స్థంభాన్ని కాలితో గట్టిగా తన్నేడు!

*******************************************************************

అప్పుడు ఏమైంది?.

ఇంతకీ రంగనాథం ఇంటికి వెళ్తాడా? లేదా?

రంగనాథం గురించి కృష్ణమూర్తి ఏమనుకుంటూ వెళ్ళిపోయాడు?

ఇంటి దగ్గర రంగనాథం భార్య, బావమరిది ఏమనుకుంటూ ఉంటారు?

తరువాయి భాగంలో...

*******************************************************************

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)