Home » Ladies Special » అమ్మంటే

అమ్మంటే

అప్పుడు రెండో క్లాసు చదువుతున్నా.. ఆరేళ్ళుంటాయి.  మా చిన్నప్పుడు కృష్ణాష్టమికి బడికి సెలవుండేది కాదు. నాలుగింటికి వచ్చేసి, పాలు తాగి ఆటలాడుకుని వచ్చే సరికి పట్టుచీర కట్టుకున్న అమ్మ కనిపించింది.

రాగయుక్తంగా భాగవతంలో పద్యాలు పాడుతూ, సాయంత్రం అమ్మ తులసి కోట చుట్టూ కడిగి ముగ్గులేసి తులసమ్మకి అలంకారం చేస్తుంటే అనుమానం వచ్చింది. తెల్లారకట్ల మామూలుగా అయిపోయింది కదా! ఇప్పుడెందుకూ అని.   అమ్మ పిండివంటలేమైనా చేసిందేమో అని ఒక కన్ను తెరిచి చూస్తున్నా..

ఊహూ.. చలిమిడి, వడపప్పు, పానకం, పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి దంచిన ఉండలు, అరటిపళ్ళు.. అంతే.. నాకు చాలా నిరుత్సాహం.. బొండాలు, బజ్జీలు, మైసూర్ పాక్, లడ్డూలు.. పోనీ బొబ్బట్లు.. ఊహూ! ఆలోగా అమ్మ, వీధి గుమ్మం నుంచి చిన్న చిన్న పాదాలు ముగ్గేసింది. అమ్మ భలే తొందరగా ఒక్క నిముషంలో వేసేసింది.

“ఏంటమ్మా ఇవేళ?” కృషుడి విగ్రహాన్ని కూడా తులసమ్మ పక్కన పెట్టి, దీపం వెలిగిస్తున్న అమ్మని అడిగాను.

“కృష్ణాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజు. అందుకే మనింటికి పిలుస్తున్నామన్నమాట. ఆ పాదాల మీద అడుగులేసి వచ్చేస్తాడు.”

“పుట్టిన వెంటనే ఎలా నడుస్తాడు?”

“దేముడు కదా.. అందుకని నడవగలుగుతాడు..”

“మరి.. రోటిక్కట్టేస్తే పాకుతూ చెట్ల మధ్యనించి వెళ్ళాడని చెప్పావు కదా అప్పుడు..”

“అది వేరు యశోదమ్మ ఇంట్లో అది.. అయినా నీ ప్రశ్నలన్నింటికీ మీ నాన్నగారు జవాబు చెప్తారు. నువ్వు మాట్లాడకుండా అక్కడ కూర్చుని పూజ చూడు.”

ఓహో.. అర్ధమయింది. పుట్టగానే అందరిళ్ళకీ నడుచుకుంటూ వెళ్ళి, నేనొచ్చానోచ్ అని చెప్పి, ఆ తరువాత యశోదమ్మ ఇంట్లో పాకుతూ, అల్లరి చేస్తూ.... అయినా అమ్మకి చెప్పడం చాతకాపోతే.. మీ నాన్నగారంటుంది.

సరే.. పూజంతా అయ్యాక, నాకు మా ఆఖరన్నకీ (మిగిలిన అన్నలు వేరే ఊళ్లలొ చదువుతున్నారు)..  చలిమిడి, వడపప్పు వగైరాల ప్రసాదం.. బంగాళ దుంపల వేపుడు,  చారన్నం, పెరుగన్నం పెట్టేసి, తను ప్రసాదం మాత్రం తింటోంది. మా నాన్నగారు కాంపుకెళ్ళారు.

“ఇదేం పండగ.. చలిమిడి..” మా అన్న చిందులు తొక్కాడు. నేను కొబ్బరి ఉండలు తింటుండగా..

“అది అంతే.. నేనైతే ఉపోషం.. ఉడికించినవేం తినకూడదు. కడుపు చలవ. నూనెలో వేయించినవి అస్సలు నైవేద్యం పెట్టకూడదు.”

“కడుపు మాడ్చుకుని చలవంటావేంటమ్మా! చాదస్తం..” యస్సస్సెల్సీ చదువుతున్న అన్నయ్య అడిగాడు. నిజమే.. అన్నయ్యంటుంటే నాకూ అనుమానం వచ్చింది.

“అంటే.. ఆకలేసే కడుపు కాదు.. కడుపున పుట్టిన పిల్లలంతా సుఖంగా ఉండేలా చూడమని కృష్ణుణ్ణి వేడుకుంటాం.. పొద్దుట్నుంచీ కన్నయ్యనే తలుచుకుంటూ, పాటలు, పద్యాలు పాడుకుంటూ ఆయన ధ్యానం లోనే గడుపుతామన్నమాట.” అమ్మ మాటలకి అన్నయ్య అయోమయంగా చూస్తూ వెళ్ళిపోయాడు.

“నేనైతే.. కడుపు నిండాతిని, బోలెడు పిండివంటలు చేసి.. కన్నయ్యకి నైవేద్యం పెట్టి, కడుపు చలవ చూడమంటా..” ప్రకటించేశాను. అమ్మ పకపకా నవ్వి, నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది.

అమ్మకి నిర్వచనం చెప్పాలంటే ఎలా? అమ్మంటే అన్నీ.. మన ఉనికి, మన ఉన్నతి, మన స్వభావం, మన జీవితం..

కొంచెం ఒళ్ళు వెచ్చబడితే తల్లడిల్లుతుంది. మన సమస్యలకి మన కంటే ఎక్కువ కన్నీరు కారుస్తుంది. నిత్యం మన వెంటే తోడుగా నీడగా ఉంటుంది.. మన మధ్యనున్నా లేకున్నా.

మా అమ్మకి ఆఖరి సంతానంగా తన నలభయ్యో ఏట నేను పుట్టాను. అప్పటికి మా ఆఖరి అన్నయ్య తప్ప అందరూ ఇంట్లోంచి బైటికి చదువులకి, ఉద్యోగాలకి వెళ్లి పోయారు. అందరికంటే పెద్దదయిన అక్కకి పెళ్ళవడమే కాక, బాబు కూడా. నా పై అన్నకీ నాకూ పదేళ్ళు తేడా.

ఇంక చూసుకోండి.. నాది ఇష్టా రాజ్యం ఇంట్లో. అమ్మని ఎంత సతాయించానో.. పగలంతా ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఎప్పుడూ పక్కింట్లోనో.. ఎదురింట్లోనో.. నాలుగు వీదులవతలున్న కమలా వాళ్ళింట్లోనో.. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. ఇంట్లో నేనొక్కదాన్నే ఉండటం కారణమేమో అనిపిస్తోంది. అలా ఆటల్లో పడి.. ఇంటికి ఆలిశ్యంగా వస్తే, ఎక్కడున్నానో తెలియని అమ్మ, వీధరుగు మీద కూర్చుని ఎదురు చూడాడం.. నన్ను చూడగానే, అమ్మయ్య అని నిట్టూర్పు విడవడం.. ఇంకా కళ్లముందే కనిపిస్తోంది.

నాకు ఒకటికి నాలుగు సార్లు ఏదైనా చెప్తే.. విసుక్కోడమే నా పని. . అయినా పట్టించుకోకుండా తను అనుకున్నది నేను చేసే వరకూ చెప్తూనే ఉండేది. మా పిల్లలు చిన్నప్పుడు మా ఇంట్లో ఉండి వాళ్ళని కంటి పాపల్లా చూసుకునేది.


నా ఉద్దేశంలో ఏ అమ్మ కథైనా ఒకటే.. పిల్లలే పంచ ప్రాణాలూ! అందులో.. మా అమ్మకి నేనంటే అంత కంటే ఎక్కువ. మా అన్నలు, అమ్మ నన్ను గారం చేసి పాడు చేస్తోందని కోప్పడుతుండే వారు, నన్ను ఆవిడనీ కూడా.
ఆవిడని సరిగ్గా చూసుకో లేదనే బాధ నాక్కూడా ఎపుడూ అనిపిస్తుండేది. ఎనభై ఏళ్ళు దాటాక, ఆవిడకి మతి మరుపు వచ్చేసింది. (ఆల్జీమర్స్) అర్ధ రాత్రి లేచి స్నానం చేస్తానని పేచీ.. అన్నం తినేసి కూడా తినలేదు మళ్ళీ పెట్టమని గొడవ. ఎప్పుడూ.. మాత్రలియ్యండి వేసుకోవాలి అంటూ వేధింపు. లోపల ఎంత బాధ ఉండేదో పాపం.. అని ఇప్పుడనిపిస్తుంది కానీ.. అప్పుడు బాగా కోప్పడేదాన్ని.

అంతే.. అమ్మ కనుమరుగయ్యాకే ఆవిడ విలువ తెలుస్తుంది.

మంథా భానుమతి---(రచయిత్రి)


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.